చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

గుర్తుండే ఉంటుంది—ఒకానొకప్పుడు గొర్రెలూ, మేకలూ పెంచేవాళ్ళు, ఒక్కచోట ఉండేవారు కాదు, తమ సామాన్లు, గాడిదలవీపుమీదో, గుర్రాల వీపులమీదో వేసి, తోడుగా ఓ రెండు మూడు కుక్కలతో, దేశమంతా తిరిగేవారు. ఆరోజుల్లో  గ్రామాల్లోని ఏ పొలాల పక్కనో డేరాలు వేసుకుని జీవించేవారు. ఆరోజుల్లో గొర్రె / మేక  లను పొలాల్లోకి వదిలేవారు,  వాటికి పుష్కలంగా మేతా దొరికేది, దానికి సాయం ఆ మేక/ గొర్రె ల పెంట, భూమికి ఎరువులా కూడా ఉపయోగించేది. గొర్రెలకాపర్లకి పైసాఖర్చులేకుండా మేతా దొరికేదీ, పొలాలకి ఎరువు కూడా ఉచితంగా దొరికి ఉభయతారకంగా ఉండేది.

ఈ రోజుల్లో  రసాయన ఎరువుల ధర్మమా అని, జనాలు వాటికే అలవాటు పడిపోయారు… అలాగని జనాలు వలస వెళ్ళడం ఆగిపోయిందని కాదు, ఇప్పటికీ రోడ్లు వేయడానికీ, బిల్డింగులు, బ్రిడ్జీలు కట్టడానికి, కూలీల అవసరం ఎంతైనా ఉందికదా. గ్రామాల్లో ఉపాధిలేక, చాలామంది, ఇలాటి  construction sites  వైపు మొగ్గుచూపుతున్నారు.. దగ్గరలోని ఏ  Footpath  మీదో, వీళ్ళ కాపరాలు చూస్తూంటాం.. ఆ కట్టడం పని అయిపోగానే, ఇంకో చోటకి ప్రయాణం, స్థిరంగా ఒకేచోట ఉండరు.

వీళ్ళు కాకుండా, మరో రకం వాళ్ళున్నారు. పని మాటెలా ఉన్నా, జనాభా అందరికీ ఉండడానికి ఇళ్ళంటే, కొంచం ఖర్చుతోకూడిన పనే మరి… దీనికి పరిష్కారం ? ఆ లొకాలిటీ లోనే ఉండే, నోట మాటున్నవాడూ, ప్రభుత్వ కార్యాలయాల్లో (అంటే కార్పొరేషన్ లాటివి) పలుకుబడి ఉన్నవాడో, కాదూ కూడదంటే, ఏ రాజకీయనాయకుడి అనునాయుడో రంగంలోకి వస్తాడు.  ప్రభుత్వాలకి బంజరు భూములు చాలానే ఉంటాయి, వాటిమీద వీడికి కన్ను పడుతుంది.. పలుకుబడెలాగూ ఉంది… ఇంక కావాల్సినదల్లా గిరాకీలు… వాళ్ళకేమీ తక్కువలేదు. దేశంలో నూటికి 75 పాళ్ళు ఉండడానికి ఇల్లులేనివాళ్ళే .. స్థలాలు కొనడమంటే అంత సులభం కాదుగా.. ఫుకట్ గా ప్రభుత్వ స్థలాలు చూపిస్తూంటే వద్దనేవాడెవడూ? ఓ ఖాళీ స్థలం చూపించి, అక్కడ ఓ పాక వేసుకోవచ్చంటే , క్యూలు కడతారు జనం.క్రమక్రమంగా ఓ యాభయ్యో, వందో గుడిసెలు తయారవుతాయి.  వీటన్నిటికీ ఆ రాజకీయనాయకుడి అనునాయుడు అద్దెకూడా వసూలు చేస్తాడు, ఏదో నామమాత్రంగానే అయినా, అద్దె అద్దే కదా.. , మెల్లిమెల్లిగా ఓ కాలనీలా తయారవుతుంది.. మనుషులున్నప్పుడు, వాళ్ళకి నీళ్ళూ, వెలుతురూ కూడా అవసరమేగా..  అద్దె పుచ్చుకుంటున్నందుకు, ఆ అనునాయుడే, అవసరమైన చోట డబ్బులు ఖర్చుపెట్టి , మొత్తానికి కరెంటు  స్థంభాలూ, నీళ్ళకొళాయిలూ వచ్చేస్తాయి. ఆ కాలనీకి, ఏ పార్టీ నాయకుడు వీళ్ళకి సాయం చేసాడో, వాడిపేరుకూడా పెట్టేస్తారు. ఇదో రకమైన  VOTE BANK  లా ఉపయోగపడుతుంది.చూశారా జేబులోంచి నయాపైసా ఖర్చుపెట్టకుండా పనికానిచ్చేసాడు.  ఆ పార్టీ అధికారంలో ఉన్నంతకాలమూ, అక్కడుండేవాళ్ళకి ధోకా లేదు.

వీళ్ళతోపాటు ఊళ్ళో ఇళ్ళులేనివాళ్ళుకూడా చేరిపోతారు… మొదట్లో ఏదో  చిన్న గూడుగా ఏర్పాటుచేసుకున్నవారు, క్రమక్రమంగా ఇటుక సిమెంట్ తో పాటు ఓ ఇల్లూ, ఆ పైన డాబాదాకా వచ్చేస్తాడు.. అడిగే నాధుడుండు.. నోరుంటే చాలు. మొదట్లో  ఉండే మట్టిరోడ్లు కాస్తా, తారు, సిమెంట్ రోడ్లలోకి మారతాయి. అన్నీ బావుంటే, ఆ ప్రాంతానికి ఓ  PIN CODE  కూడా ఇచ్చేస్తారు. ఎప్పుడో అధికారంలో ఉన్నపార్టీ ( అంటే ఈ ప్రాంతాన్ని పోషిస్తున్నది) మారుతుందేగా.. అప్పుడొస్తుంది గొడవ, ఏ ప్రధాన  రోడ్డు మార్గాన్నో వెడల్పు చేద్దామని ఓ ఆలోచన రావడం తరవాయి, ఆ మార్గంలో కొలతలూ, వగైరాలు వేయడంతో తేలుతుంది—ఈ ఇళ్ళున్న ప్రాంతమంతా ప్రభుత్వానిదీ అని. ఓ నోటీసిచ్చేస్తారు.. ఫలానా భూమి ప్రభుత్వానిదీ, మీ ఇళ్ళు కూల్చవలసొస్తుందీ అని. ఇంకేముందీ, అక్కడికేదో ఆ భూమి తమ స్వంతమే అయినట్టు, కోర్టులో ఓ దావావేసి ప్రభుత్వ నోటీసులమీద ఓ  Stay Order  తెచ్చేసుకోవడం.. ఆ ప్రకరణం ఓ రెండుమూడేళ్ళు సాగుతుంది, ఈలోపులో రోడ్లకి పెట్టాల్సిన బడ్జెట్ కూడా… ఇంకాస్త డబ్బు తినే అవకాశం.

ప్రభుత్వాలు అత్యవసర పరిస్థితుల్లో, ప్రజలకి పునరావాసం కల్పించే సదుద్దేశంతో, ప్రభుత్వ స్తలాల్లో కొన్ని భవనాలు కట్టుంచుతారు. అవికూడా రెండు పడగ్గదులతో… వాటి చుట్టుపక్కలంతా స్థితిమంతులు లక్షల్లో భూములు కొని, కోట్లతో ఆధునిక భవనాలు కట్టుకుని అప్పటికే ఉంటున్నారు కూడా.   కోర్టువారు  Stay  ఎత్తేయడం ధర్మమా అని, ప్రభుత్వం , రోడ్లు వెడల్పుచేసే ప్రక్రియలో మొత్తానికి, అనధికారంగా వెలిసిన కాలనీ కూల్చేయడానికి ప్రారంభం చేస్తారు. మరీ అక్కడున్నవారిని రోడ్దుమిద పడెస్తే ఎలా? అప్పుడెప్పుడో నిర్మించిన  so called  పునరావాసకేంద్రాలలో వీళ్ళందరికీ ఓ కొంప ఏర్పరుస్తారు. అప్పటికే  ఆ ప్రాంతం ఓ  posh locality  గా మారిపోయింది.

చూశారా నయాపైస ఖర్చు లేకుండా , ఎలాటి  locality  కి రాగలిగాడో? మధ్యతరగతివారు అలాటి చోట్ల ఇల్లు తీసుకోవాలంటే కోట్లరూపాయలతో పని.

ఇందులో నీతి ఏమిటంటే.. మనదేశం లో  మధ్యతరగతి వాడుగా పుట్టడమంత మహాపాపం ఇంకోటి లేదు.. పుడితే ఆగర్భ శ్రీమంతుడిగానో, లేకపోతే కటిక దరిద్రుడిగానో పుట్టాలి…

సర్వే జనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు