పాకిస్తాన్ లో పదిరోజులు: పుస్తక సమీక్ష - సిరాశ్రీ

Book Review - pakisthan lo padi rojulu

పుస్తకం: పాకిస్తాన్ లో పదిరోజులు
రచన: ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
వెల: రూ 75/-
ప్రతులకు: విశాలాంధ్ర

మొన్నీమధ్య నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ వారి పిలుపు మీద అమెరికా బయలుదేరాను. హైదరాబాద్ నుంచి దోహా (కతార్)చేరి, అక్కడ ఫ్లైట్ మారి అమేరికాలో దిగాలి. దోహా నుంచి బయలుదేరిన ఫ్లైట్ లో నా పక్కన విండో సీట్ లో ఉన్నాయన నవ్వుతూ ఆత్మీయంగా పలికరించాడు. నేను కూడా అలాగే ప్రతిస్పందించాను. ఆయనెవరో నాకు తెలీదు. బహుశా తొలిసారి విదేశీ ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక భారతీయుడికి ఇంకో భారతీయుడు కనిపిస్తే అప్రయత్నంగా జరిగే పలకరింపు లాంటిది అనుకున్నాను. కూర్చున్న కాసేపటికి పిచ్చాపాటి మొదలుపెట్టాడు ఆయన. కతార్ ఎయిర్ వేస్, ఎమిరేట్స్ ఎయిర్ వేస్ సేవల గురించి టాపిక్. చక్కటి హిందీ, అమెరికన్ స్లాంగ్ ఇంగ్లీషు కలిపి మాట్లాడుతున్నాడు. అప్పుడు అర్థమయ్యింది. ఈయనకిది తొలి విదేశీ ప్రయాణం కాదని. ఎక్కడుంటారని అడిగాను. హూస్టన్ లో గత 20 ఏళ్లుగా ట్రేడింగ్ బిజినెస్ చేసుకుంటూ సెటిల్ అయిపోయానని చెప్పాడు. హిందీ సినిమాల గురించి చాలా సరదాగా మాట్లాడుతున్నప్పుడు ఆయన హిందీ విని ఉత్తరప్రదేశా అని అడిగాను అమాయకంగా. "నో..అయాం ఫ్రం కరాచి" అన్నాడు. కరాచి అనగానే అజ్మల్ కసబ్, ఆ వెంటనే పాకిస్తాన్ జెండా కళ్లముందు కదిలినట్టు అనిపించింది. అప్పటిదాకా నేను అనుకున్నట్టు అతను భారతీయుడే కాదు.. పాకిస్తానీ. నా అంచనాలన్నీ తప్పు. "మీ హిందీ యాస యూపీ స్టైల్ లో ఉంది. ఉర్దు పదాలు కూడా ఎక్కువగా లేవు. అందుకే మీరు యూపీ హిందు అనుకున్నాను" అన్నాను.  "నేను భారతీయులతో మాట్లాడేటప్పుడు సాధ్యమైనంత వరకు ఉర్దు పదాలు వాడను. సుధ్ధ్ హిందీ పదాలు వాడే ప్రయత్నం చేస్తాను. ఇక యాస అంటారా. జాగ్రఫికల్ గా మాకు, పంజాబ్ యూపీలకి ఏమంత దూరం ఉందని... యాస మారిపోవడానికి", అన్నాడు.

నా అమెరికా ప్రయాణానికి కారణం అడిగితే "సౌత్ ఇండియాలో తెలుగు అని ఒక భాష ఉంది. అది నా మాతృ భాష. మా భాష మాట్లాడేవాళ్లు డల్లాస్ లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ నన్ను అతిధిగా పిలుస్తే వెళ్తున్నాను" అంటూ విదేశీయుడికి తెలుగు భాష ఉనికి గురించి చెప్ప్తున్నానన్న ఫీలింగ్ తో లోలోపల మురిసిపోయాను.

"తెలుగు గురించి అంత డీటైలింగ్ ఎందుకు. హిందీ తర్వాత అత్యధిక సంఖ్యలో సినిమాలు తీసేది ఆ భాషలోనే అని మాకు తెలుసు", అన్నాడు. నా అంచనా మళ్లీ బొక్కబోర్లా పడింది.

అలా భాష, యాస, సంస్కృతి, ఇరు దేశాల ప్రభుత్వాలు, పాక్ లో తాలిబన్ల అరాచకాలు, మత మౌఢ్య రాజకీయం వంటి విషయాలన్నీ మాట్లాడుకుంటూ గమ్యాలు చేరాం. సరిహద్దులు గీసుకుని కూర్చుంటేనే ఈ బేధభావాలు. ఇద్దరం బోర్డర్ దాటితే భారత్-పాక్ భాయి భాయి అన్నట్టు అనిపించింది. ఇక అమెరికాలోని బాల్టిమోర్ లో ఇండియా, పాకిస్తాన్ పిల్లలు కలిసి క్రికెట్ ఆడుకుని జోకులేసుకుంటూ లంచ్ చేయడం కూడా చూసాను.

మొన్న కినిగే లో కొత్త పుస్తకాల కోసం వెతుకుతుంటే "పాకిస్తాన్ లో పది రోజులు" అనే టైటిల్ కనపడింది. నా దృష్టి అక్కడ ఆగిపోయింది. రచయిత యార్లగడ్డ. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లడానికైనా డబ్బు, వీసా ఉంటే సరిపోతుంది కాని పాకిస్తాన్ లో పర్యటించాలంటే మాత్రం యోగం ఉండాలి. ఒకప్పుడు మన భూభాగమే అయినా బోర్డర్ దాటి ఏ దేశానికి వెళ్లని దాదాపు అందరు భారతీయుల మనసుల్లో పాకిస్తాన్ అంటే 1. ఒక ఉగ్రవాద భూమి, 2. ఒక శతృ దేశం, 3. సరిహద్దుల్లో భారత సైనికులతో కవ్వింపు చర్యలకు పాల్పడడం దాని నైజం.

లోకం చూడని చాలమంది పాకిస్తాన్ ప్రజల్లో కూడా భారతీయుల పట్ల ఇదే భావం ఉండే ఆస్కారం ఉంది. కారణం అంతర్జాతీయ మీడియా కొంత, మత మౌఢ్య రాజకీయం ఇంకొంత.

ఈ నేపధ్యంలో పాకిస్తాన్ లో తిరిగొద్దాం అనే ఆలోచనే సగటు భరతీయుడికి రాదు. కానీ తెలుగువాడైన సుప్రసిధ్ధ రచయిత యార్లగడ్డకు ఆ గడ్డమీద తిరిగే యోగం పట్టింది. ఆ అనుభవాలన్నీ "పాకిస్తాన్ లో పదిరోజులు" పేరుతో పుస్తకం గా తీసుకురావడంతో పాక్ సంగతులు తెలుసుకునే అవకాశం మనకు దక్కింది. కరాచి, హైదరాబాద్ (సింధ్), ఇస్లామాబాద్, లాహోర్ లలో యార్లగడ్డ అనుభవాలు ఈ పుస్తక సారాంశం. అక్కడ జరిగే హోలీ పండుగ వివరాలు, అద్వానికి దొరికిన ఆయన చిన్నప్పుడు వాడిన మంచం విషయాలు (అద్వాని పుట్టింది లాహోర్లోనే)... ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలు ఇందులో ఉన్నాయి.

అయితే అధికార యంత్రాంగం నడుమ చేసిన పర్యటన కారణంగా జనం మధ్యలో తిరిగిన విషయాలు ఇందులో లేవు. అదొక్కటే లోపం. భారత్ పట్ల సామాన్య పాకిస్తాన్ ప్రజల మనోభావాలు ఇటువంటి పుస్తకాల్లో చోటు చేసుకుంటే బాగుండేది. అయినా పాకిస్తాన్ గురించి ఇప్పటివరకు తెలియని ఎన్నో విషయాలు, విశేషాలు అశేషాలుగా మన ముందుంచారు ఆచార్య యార్లగడ్డ.

92 పేజీల ఈ సచిత్ర గ్రంథం పాకిస్తాన్ గురించి కొంతైనా తెల్సుకోవాలనుకునే వారు చదవాలసిందే.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు