కవితలు - ..

బ్రతుకు

తీరు తీరు గతులు
తీరమెరుగని గతులు
ఏ తీరు చెబుదునే లోక సంగతులు
అన్ని గతులు కడకు ఆ గతులకే చేరు
ఆ మాత్రానికి ఎందుకో ఇన్ని కతలు
తడవనీ మన్నేది
 తడపనీ కన్నెది
ఏ చింతలు లేని చిత్తమేది
ఒకసారి వస్తది   
ఒకసారి పోతది
నిలవలేనీ సొమ్ముకి ఈ విలువ ఏంది
పొత్తుకొచ్చే పిల్ల
పుట్టుకొచ్చే పిల్ల
సంసారమున బతుకు తల్లడిల్లె
వీణ్ణి చూసి వాడు
వాణ్ణి చూసినవాడు
ఒక్కడైనా తెలివి తెచ్చుకోడు
సంసారమే గొయ్యి
లోతైన నుయ్యి
ఆరు అడుగుల మించి ఈదలేవు
ఎంత ఈదిన ముందుకెళ్ళలేవు
గిరగిరా గిరగిరా
బొంగరం వలె తిరిగి
సత్తువంతా చచ్చి మునిగిపోతావూ
మునిగిపోయే బతుకు
మూన్నాళ్ళ బతుకూ
బతుకు పోయేదాక
నీ బతుకే బతుకని
నలుగురు మెచ్చేటి రీతిలో బతుకు.


వాసుదేవమూర్తి శ్రీపతి

******


ధరణిబిడ్డడు

ఆకాశం తల్లి గర్భంలో నుంచి పుట్టిన
నక్షత్రాలను ఏరి ఇంట పోసుకోవాలనుకోలేదు
ఆ తల్లి తన బాధను చూసి ఒక కంట
రెండు చుక్కల జాలి నీరు కారిస్తే
ఆ చుక్కల తడిసిన నేలన మొక్కలు నాటి
డొక్కలు నింపాలని ఎదురుచూశాడు
ఆశలు తవ్విన కళ్ళు పాతాళాన్ని తాకి
దిగుడుబావులుగా మారిపోయాయి
పంట మీద కోరిక ఎండమావిగా మారింది
మట్టిని వీడి వానపాములు వలసవెళ్ళాయి
కుట్టినా కడుపు నిండలేదని దోమలు
అతని శరీరాన్ని చుట్టడం మానేశాయి
ఋణాల వ్రణాలు కేన్సర్ కణాలయ్యాయి
పిడికెడు పంటకు గిట్టుబాటు కోరే
ఆ అభాగ్యుని మీదకు బాకులు దూయకండి
బ్రతికున్న శవాల పైకి లాఠీ ఝళిపించకండి
పేగుల వేడిని పురుగుల మందు ఆర్పకముందే
అరాచక రాజకీయానికి అంతిమయాత్ర చేసి
ధరణి బిడ్డ ఆవేదనకు న్యాయం చేయండి
చెదరుతున్న పాకల కప్పుకు ఆసరాకండి
తప్పుతున్న పల్లెకళకు తిరిగి జీవం పోయండి


శింగరాజు శ్రీనివాసరావు

******


గగనాక్రోశం 

తరువులు లేని ధరణిని చూసి
పెరిగిపోతున్న పొగలను చూసి
తెలివే లేని మనుషుల జూసి
దుఖిఃస్తోంది ఆకాశం

                                                                                 

ఎండిపోయిన నదీనదాలను
మోడివారిన అడవులను
బీడువారిన నేలను చూసి
శోకిస్తోంది ఆకాశం

 

అనగనగనగా చెట్లుండేవని
భావితరాలకు కథలను చెప్పే
దుర్భరమైన స్థితి మీకొద్దని
క్రోధంతో అప్పుడప్పుడు
బోధిస్తోంది ఆకాశం

 

ఆకుపచ్చని వనాల చంపి
అవనంతా భవంతులు నింపి
ఆనందంగా బ్రతుకుతున్నామని
అపోహలో వున్నామంతా                 

 

భూమికై పోరులు చేస్తున్నట్టు                                                                                 
నీటికై గొడవలు పడుతున్నట్టు
ఊపిరికోసం యుధ్ధాలైతే
మన బ్రతుకేంటో ఊహించారా..?

 

తరువులతోనే తీరును కరువు
ప్రకృతి రక్షణే మనిషికి హితవు
పర్యావరణం రక్షిస్తేనే
జీవజాతులను మేలు జరుగు


  సుజాత. పి.వి. ఎల్
******

సామ్యవాదులు

ఊరిని ఊరితో
జనాలని తనవారితో
కలిపే వారధులు
నగరాన్ని వేగంతో
బంధించే నల్లత్రాచులు
ఒకమోస్తరు, భారీ, అతిభారీ
రూపాల్లో
నేలని
గమ్యస్థానాలతో
బంధిస్తున్న  
గమ్యమెరుగని బాటసారులు
వేగంతో దోస్తీచేసె
ఆదమరుపు బాటసారులను
సొగసుకూడళ్ళతో
కబలించే అనకొండలు
తరతమ భేదమెరుగుక
సకలచరాచరాన్ని
ఒకేరీతిన ఆదరిస్తూ
భూగోలాన్ని అలుముకున్న
ఎకైన సామ్యవాదులు
రహదారులు


నాగ్రాజ్

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు