జీవన మాధుర్యం
దైవ ప్రసాదిత జీవితం పొందిన మానవుడు దాన్ని పూర్ణ కలశం, ప్రవహించే అమృతోపమానమైన జీవనదిగా భావించడం లేదు. అవసరాలు తీర్చుకోడానికి తగిన వనరులు సమకూరినా, ఏ ఒక్కటో అమరనందుకు అనుక్షణం చింతాగ్రస్థుడు అవుతున్నాడు. మనో శాంతిని, జీవన మాధుర్యాన్ని కోల్పోతున్నాడు. సృష్టికర్త, జీవ సృష్టికి ముందే, మానవ మనుగడకు విఘాతం కలగకుండా అపరిమిత సూర్యరశ్మిని, గాలిని, తాగు నీటిని ఇచ్చే నదీ నదాలను, కమ్మని పళ్లని ఇచ్చే హరితవనాలను కానుకగా ఇచ్చాడు. ప్రకృతిలో కాలానుగుణ మార్పులు రూపొందించి, సమయానుకూలంగా అన్ని వనరులూ అందే ఏర్పాటు చేశాడు.
ఇది చాలదన్నట్టు మనిషి, మేధకు పదును పెట్టాడు. విజ్ఞానం పరిథి లేకుండా విస్తరించి ఎన్నెన్నో ఆవీష్కరణలకు ఆలవాలం అయింది. మానవ జీవయాత్రను సుగమం చేసింది. అందులో ఎటువంటి సందేహం లేదు. అదే బలహీనతగానూ మారింది. మనిషి తను సృష్టించిన సుఖానుభూతులను పొందడానికి మానసిక లాలసతో అవిశ్రాంతంగా పరిగెడుతున్నాడు. రోజుకో కొత్త ఆవీర్బావం. దాన్ని పొందాలన్న నిరంతర ఆరాటం అతనికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వాస్తవికత నుంచి యాంత్రికత వైపు మెరుపు వేగంతో పయనిస్తున్నాడు. పర్యవసానం- పర్యావరణ సమతుల్యత తప్పుతోంది. ధర్మం, అధర్మం, న్యాయం, అన్యాయం, నీతి, అవినీతిలకు మధ్య ఉండే తేడా సన్నగిల్లుతోంది. సత్యం పలకడం, దానం చేయడం, ధర్మ బద్ధంగా జీవితం గడపడం, పరులకోసం పాటు పడడం, సర్వ ప్రాణుల పట్ల సమభావం వంటివి పురాణాలకు పరిమితమనుకుని చదవడం లేదు. చదివినా ఒంట పట్టించుకోవడం లేదు.
పూర్వ యుగాల్లో ఋషులు ఆధ్యాత్మికతను, ధర్మబద్ధ జీవన విధానాన్ని విద్యాభ్యాసంలో భాగం చేసేవారు. విలువలతో కూడిన జీవితం ఎంత ఉన్నతమో భోధించేవారు. దానివల్ల సమాజం గతి తప్పేది కాదు. ఇప్పటికీ ఆదర్శ సమాజాలుగా అవి కొనియాడబడుతూ ఉన్నాయి.ధర్మబద్ధ జీవనం వల్ల రాజ్యప్రాప్తి, స్వర్గప్రాప్తి, ఆయువు, కీర్తి, మోక్షం సిద్ధిస్తాయని, అసలు ధర్మమే పరమ పురుషార్థమని తెలియజేస్తుంది బ్రహ్మ పురాణం. ధర్మవర్తనులై జీవించడంలో ఎంతటి ఔన్నత్యం ఉందో చెప్పడానికి ఈ పురాణ వాక్యం నాందిగా నిలుస్తుంది.అహర్నిశం ధర్మ మార్గంలోనే నడవాలి. లౌకిక వ్యవహారలకి దూరంగా ఉండాలి. సత్పురుషుల శుశ్రూష చేయాలి. కోరికలని త్యజించాలి, సర్వదా సేవా భావంతో ఉండాలి అంటుంది శ్రీమద్భాగవత పురాణం.యవ్వనం, ధనం, అధికారం, అవివేకం అనే నాలుగింటిలో ఏ ఒక్కటి ఉన్నా అనర్థమే అని శాస్త్ర వచనం. ఇప్పటి లౌకిక ప్రపంచం వీటి చుట్టూ పరిభ్రమించడం శోచనీయం. దానం, అధ్యయనం సర్వకాల సర్వావస్థల్లోను, ఎలాంటి అవాంతరాలు ఎదురైనా చేయాలన్నది మహనీయుల సుభాషితం.
మనిషి లౌకిక జీవన అభిలాష తగ్గించుకుని పారమార్థిక చింతన వైపు మళ్లితే మనసు పరిపక్వమవుతుంది. జీవన మాధూర్యమూ అనుభవంలోకి వస్తుంది.వేద వేదాంగాలని, పురాణాలని కంఠోపాఠం చేసుకున్న పెద్దలు చెప్పిన సుద్దులు జ్ఞాన నిధులు. వారు వేసిన బాటలు నిత్యస్మరణీయాలు. అనుసరణీయాలు. జీవన్ముక్తిని సఫలం చేసే ఉపాయాలు.