( తింగళూరు , చంద్రగ్రహ స్థానం )
ఈ వారంనుంచి నవగ్రహ స్థానాల గురించి తెలుసుకుందాం , సూర్యగ్రహ స్థానం గురించి మీకు పరిచయం చేసేను , యీ వారం చంద్రగ్రహస్థానం గురించి చదువుదాం , వచ్చే వారం నుంచి వరుసగా నవగ్రహ స్థానాలగురించి చదువుదాం .
మన జాతకం బాగున్నదీ లేనిదీ జాతకం చూస్తే తలుస్తుంది , జాతకం లేనివాళ్లకు యే గ్రహం బాగులేనిదీ యెలా తెరుస్తుందా అంటే ఒక్కో గ్రహం బాగులేకపోతే మనకి కొన్ని రకాలైన యిబ్బందులు కలుగుతూ వుంటాయి , వాటిని బట్టి మనకి యేగ్రహం అనుకూలంగా లేదో తెలుసుకొని పరిహారాలు చేయించుకుంటే గ్రహ బాధలు తప్పుతాయి .
మన జాతకంలో చంద్రగ్రహం అనుకూలము గా లేనప్పుడు తల్లి అనారోగ్య సమస్యలు , భార్య ఆరోగ్య సమస్యలు , మానసిక శాంతి లేకపోవడం , చర్మ సంబంధ మైన బాధలు , నాడీ సంబంధ మైన రుగ్మతలు , పచ్చ కామెర్లు మొదలయిన బాధలు కలుగుతాయి . అదే చంద్రగ్రహం అనుకూలంగా వుంటే ధనలాభం ,వ్యవహారలాభం , సంసారిక సుఖం , జీవితంలో పురోభివృద్ధి , మంచి పెళ్లి సంబంధాలు కుదరడం జరుగుతాయట . ఎవరికైనా జాతకంలో చంద్రగ్రహస్థితి బాగు లేకపోతే యీ కోవెలలో పరిహారం చేయించుకుంటే అన్ని దోషాలు తొలగిపోతాయి . అయితే యీ కోవెల ఎక్కడ వుంది . ఎలా చేరుకోవాలి . అన్న విషయం తెలుసుకుందాం .
తమిళనాడు లోని తంజావూరు జిల్లాలో , తంజావూరు నుంచి తిరువైయూరు వెళ్ళేదారిలో తంజావూరికి 25కిమీ.. , తిరువైయూరుకి 6 కిమీ . కుంభకోణం తిరువయ్యూరు వెళ్ళే దారిలో కుంభకోణానికి 35 కిమీ దూరంలో వుంది యీ తింగళూరు . తమిళంలో తింగళ్ అంటే చంద్రుడు అని అర్ధం . చంద్ర స్థానం వుంది కాబట్టి యీ వూరు కి తింగళూరు అని పేరు వచ్చింది .
అయితే యీ చంద్రుడు యెవరు ? యితని తల్లితండ్రులెవరు ?
సురాసురులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికినప్పుడు కామధేనువు , కల్ప వృక్షం మొదలయిన వాటితో బాటు చంద్రుడు కుడా వుద్భవించేడు , అందుకు యితనికి తోబుట్టువులే తప్ప తల్లితండ్రులు లేరు . చంద్రునికి కళలు వున్నాయి . పదిహేనురోజులు అంటే అమావాస్య నుంచి పున్నమి వరకు యీ కళలు పెరుగుతాయి . పున్నమి నుంచి అమావాస్య వరకు తరుగుతాయి . వీటినే శుక్ల పక్షమి , కృష్ణ పక్షమి అని అంటారు .
యీ శుక్ల , కృష్ణ పక్షమి లు యేర్పడ్దానికి యీ క్రింది కధని చెప్తారు.
పాల సముద్రములో ఉద్భవించిన చంద్రుడు అత్యంత మోహనాకారుడై , తన శీతల కిరణాలతో దేవతలనందరిని సమ్మోహితులను చేస్తాడు . దక్ష ప్రజాపతి పుత్రికలయిన అశ్విని మొదలు రేవతి వరకు గల యిరువై ఏడు నక్షత్రాలను అతనిని మోహించి వివాహమాడాలనే కోరిక కలుగుతుంది . పుత్రికల మనోభీష్ఠమ్ తెలిసిన దక్షుడు తన పుత్రికలనిచ్చి వివాహం చేసి అందరినీ సమానముగా చూసుకొమ్మని చెప్పి చంద్రునకు అతని భార్యలకు ఆకాశంలో స్థానం కల్పిస్తాడు . చంద్రుడు రోహిణి పైన ఎక్కువ అనురాగం కలిగి వుంటాడు . అందుకు ఆగ్రహించిన చంద్రుని మిగతా భార్యలు దక్షునికి చెప్తారు . దానికి ఆగ్రహించిన దక్షుడు చంద్రుని అందం రోజురోజుకు తరగాలని శపిస్తాడు . శాపగ్రస్తుడైన చంద్రుడు శివుని సేవించగా శివుడు చంద్రుడు పదిహేను రోజులు కృశించేటట్టు , పదిహేను రోజులు పెరిగేటట్లు ఆ శాపాన్ని మార్చి అర్ధ చంద్రుని తన శిరశ్శు పై ధరించి చంద్రునకు అత్యుత్తమ స్థానం కల్పిస్తాడు . అలా చంద్రకళ క్షీణించిన పక్షాన్ని కృష్ణ పక్షం అని చంద్రకళ పెరిగే పక్షాన్ని శుక్ల పక్షం అని అంటారు .
ముఖ్యం గా తమిళ నాడులో వున్న నవగ్రహ కోవెలలలో మూలవిరాట్టుగా పూజలందుకొనేది పరమశివుడే . అలాగే యిక్కడ కుడా ముందుగా శివుడిని దర్శనం చేసుకొవాలి . యిక్కడ యీశ్వరుని కైలాశానాధుడు అనిపిలుస్తారు . తరువాత అమ్మవారిని దర్శించుకోవాలి . అమ్మవారు యిక్కడ పెరియనాయకి అనే పేరుతొ పూజలందు కుంటోంది .
తింగళూరు గ్రామంలో తూర్పుమూలగా వుంటుందీ కోవెల .కోవెలలోకి ప్రవేశించడానికి దక్షిణ ద్వారం వుపయోగిస్తారు . యీ మందిరం ద్రవిడ శిల్పకళను పోలి వుంటుంది . మండపం లో ఆపూథి ఆదిగళ్ , అతని భార్య , ముని తిరువ్వక్కరసు , అప్పారు స్వామి వారికి అభిముఖంగా పిల్లల విగ్రహాలు చూడొచ్చు .
ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం లో వచ్చే ' ఉత్తర ఫల్గుణి ' నక్షత్రం వచ్చే రోజున సూర్యోదయ సమయం లో సూర్యకిరణాలు శివలింగం మీద పడతాయట . అలాగే సాయంత్రం చంద్ర కిరణాలు శివలింగం మీద పడతాయట . ఆరోజు యిక్కడ చాలా మంది భక్తులు వస్తారు . సూర్య చంద్రుల పూజలందుకొనే దేవునిగా యీ కైలాసనాధుని వర్ణిస్తారు యిక్కడి స్థానికులు . కైలాష నాధుని దర్శనానతరం ఎడమ వైపున వున్న పెరియనాయకి అమ్మవారిని దర్శించు కుంటాము . అమ్మవారి దివ్యమంగళ స్వరూపం దర్శించుకోగానే మసులోని చింతలన్ని మాయమై మనకి మానశసిక శాంతి కలుగుతుంది .కైలాశానాధుని మందిరానికి ప్రదక్షిణ చేసేటప్పుడు ముందుగా యోగముద్రలో వుండే దక్షిణాముర్తిని దర్శించుకుంటాము , అక్కడనుంచి ముందుకు వెళితే వినాయకుని మందిరం దానిపక్కనే వల్లి , దేవయాని సమేత కుమారస్వామినీ దర్శించుకుంటాం . తరవాత గజలక్ష్మి , దుర్గాదేవి వాటికి పక్కగా సందికేశ్వరుడు , భక్తులు తమ కోరికలని సందికేశ్వరునికి విన్న వించుకుంటే అతను భగవానుడు ప్రసన్నంగా వున్నప్పుడు మన కోరికలు భగవంతునికి విన్నవిస్తాడుట . ఎందుకంటే భగవంతుడు ప్రసన్నంగా వున్నప్పుడు భక్తులు కోరిన వరాలు ప్రసాదిస్తాడట . అందుకే తమిళనాడు మందిరాలలో సందికేశ్వరునికి వేరేగా చిన్న మండపం యేర్పరచి పూజా నైవేద్యాలు జరుపుతూ వుంటారు . ఆ పక్కనే యిక్కడి స్థల వృక్షమైన బిల్వవృక్షం వుంటాయి . యీ కోవెలలో ఒక పూటే అభిషేకాదులు నిర్వహిస్తారు .
పక్కనే యీమధ్యనే కట్టిన నవగ్రహ మండపం పక్కనే చంద్రతీర్థం . ఆ చంద్రతీర్థం లో స్నానం చేసి చంద్రుని సేవించు కుంటే చంద్రగ్రహ దోషాల నివారణ జరుగుతుంది .
చంద్ర తీర్దానికి ఎదురుగా చిన్న మందిరంలో చంద్రుని విగ్రహం వుంటుంది . మండపం లో కూచొని చంద్రునికి జపతపాలు చేసుకొనే స్థలం వుంటుంది . యీ తింగళూరు లో పాముకాటు వల్ల యివాళటి వరకు మరణాలు సంభవించ లేదుట . అందుకు నిదర్శనంగా యీ క్రింది కధను చెప్తారు . అదేంటంటే పూర్వం యీవూరిలో పరమశివుని భక్తుడైన ఆపూథి ఆదిగళ్ అనే వ్యాపారి యెందరికో యెన్నోవిధాల సహాయం చేస్తూ , అతిధి మర్యాదలు చేస్తూ తనను తిరువక్కరసు అనే ముని యీ విధముగా చేయమన్నట్లు అందరికీ చెప్తూ వుంటాడు . ఆనోటా ఆనోటా యీ విషయం విన్న తిరువక్కరాసు ఆపూథిని చూసేందుకు తింగళూరు వచ్చి ఆపూథి ఆదిగళ్ కి తాను అతని యింట ఆతిధ్యం స్వీకరించ వచ్చినట్లు సమాచారం పంపుతాడు . ఆపూథి ఆదిగళ్ యెంతో సంతోషించి ఆథిధ్యానికై అన్ని సంబారాలు సమకూర్చు కుంటాడు . ఆపూథి ఆదిగళ్ యేకైక కుమారుడు వంట చెరకు నిమిత్తం అడవికి వెళ్లి పాము కాటునకు గురై మరణిస్తాడు . విషయం విన్న ఆపూతి ఆదిగళ్ దుఃఖము తనలోనే దాచుకొని తానూ , భార్యా తిరువక్కరసు కి ఆతిధ్యం యిస్తారు . విషయం తెలుసుకున్న తిరువక్కరసు పిల్లవానిని యీ కైలాసనాధుని యెదుట వుంచి కైలాసనాధుని పిల్లవానిలో వున్నవిషాన్ని అమృతంగా మార్చమని " ఒండ్రు కోటం " అని మొదలు పెట్టి శ్లోకాలతో వేడుకుంటాడు . అప్పుడు శివుడు ప్రత్యక్షమై పిల్లవానిని బతికించి ఆ ఊరిలో మరియెవ్వరూ కూడా పాముకాటుతో మృత్యుబారిన పడకుండా వుండేటట్లు వరాన్ని కూడా యిస్తాడు . యీ విషయం తమిళ మహాకవి " శెక్కిఝార్ " 'పెరియపురాణం (పెద్ద పురాణం ) ' లో వర్ణించేడు .
యిక్కడి చంద్రతీర్ధమ్ లో స్నానం చేసుకొని చంద్రుణ్ణి ఆరాధించే వారికి మానసిక దౌర్బల్యం , కుష్ఠువ్యాధి రావని , అధికారుల మన్నన , తల్లి / భార్య ల ఆరోగ్యం , వివాహ సంబంధాలు , ధనలాభం కలుగుతాయని భక్తుల నమ్మకం . చంద్రుగ్రహానికి సంబంధించి మరికొంత సమాచారం చంద్రుగ్రహ దోషం పోగొట్టుకోడానికి బియ్యం , కర్పూరం , తెల్లబట్ట , వెండి , శంఖము , తెల్ల చందనం , తెల్లపూలు , పంచదార , యెద్దు , పెరుగు , ముత్యం , దానం చెయ్యాలి .జపించ వలసిన మంత్రం యిది . దధి శంక తుషారాభం క్షీరోధార్ణవ సంభవం , నమామి శశినం సోమం శంభోర్ మకుటభూ షణం .
మూల మంత్రం
ఓం శ్రాం శ్రీం శ్రౌం సః చంద్రాయనమః
చంద్ర గాయత్రి
ఓం నిశకరాయ విద్మహే , కళానాధాయ ధీమహి
తన్నో చంద్ర ప్రచోదయాథ్
యీ తింగళురు వెళ్ళేటప్పుడు అయిదు కిలోమీటర్ల ముందు ' గణపతి అగ్రహారం ' అనే గ్రామం వస్తుంది . పచ్చని వరిపొలాల మధ్యలో వినాయకుని కోవెల వుంది . యిక్కడ వినాయకుని అగస్త్యడు ప్రతిష్ఠించేడని స్థానికులు చెప్పేరు . వినాయకుడు అన్ని విఘ్నాలను తొలగిస్తాడు కాబట్టి గణపతి అగ్రహార వినాయకుడిని దర్శించుకొని మీ ప్రయాణం జయప్రదం గా పూర్తి చేసుకోండి .వచ్చేవారం కుజస్థానం గురించి చదువుదాం , అంతవరకు శలవు .