ఆది యోగి శివుడు అగస్త్యమునిని దక్షిణ భారతదేశానికి పంపారు. ఆయన డెక్కన్ పీఠభూమికి దక్షిణంగా ఉన్న అన్ని జనావాసాలనూ ఏదో తరహాలో ప్రతిష్టీకరించి, ఆధ్యాత్మిక ప్రక్రియ కొనసాగేటట్లు చేశారు. ఆయన ఒక్క జనావాసాన్ని కూడా వదలలేదు. ఆపని చేయడానికి ఆయనకు నాలుగు వేల సంవత్సరాలు పట్టిందంటారు. మరి అది నిజంగా 4000 ఏళ్లో లేక 400 ఏళ్లో లేక 140 ఏళ్లో మనకు తెలియదు. కాని ఆయన చేసిన అంత పనిని, ఆయన చేసిన అంత సంచారాన్నీ చూస్తే ఆయన ఎక్కువ కాలం జీవించారు అని తెలుస్తుంది. ఆయన ఏమి చెప్పారంటే - అభివృద్ధి, విజ్ఞానాల మూలంగా ప్రపంచం గాడితప్పినప్పుడు, విజ్ఞానం నిజంగా విషం అయినప్పుడు, మీకు మంచి చేయవలసింది, చెడు అయినప్పుడు, ఆయన చేసిన పని వికసించి పనిచేస్తుంది అన్నారు. ప్రతిష్టీకరణ అనేది జీవ ప్రక్రియ. అది ఎలాగంటే మీరు మట్టిని ఆహారంగా చేస్తే దానిని వ్యవసాయం అంటారు. అదే ఆహారాన్ని రక్త మాంసాలుగా మారిస్తే దానిని జీర్ణం చేసుకోవడం అంటారు. ఈ మాంసాన్ని మళ్ళీ మట్టిగా చేస్తే దానిని ఖననం చేయడం అంటారు. మీరు ఈ మాంసాన్ని, లేక శిలను లేక ఆఖరికి ఖాళీ ప్రదేశాన్ని గానీ దివ్యంగా చేయగలిగితే, దానినే ప్రతిష్టీకరణ అంటారు. ఈ రోజు ఆధునిక విజ్ఞానం మీకు అంతా ఒకటే శక్తి అని, అదే శక్తి వివిధ రూపాల్లో వ్యక్తీకరణ అవుతోందని చెబుతోంది.
మరి ఆ విధంగా చూస్తే మీరు దేవుడు అనేదీ, రాయి అనేదీ, పురుషుడు లేక స్త్రీ అనేది, దెయ్యం అనేదీ విభిన్న రీతులలో పనిచేస్తున్న ఒకటే శక్తి అని. ఉదాహరణకు ఒకే విద్యుచ్ఛక్తి కాంతిగా,శబ్దంగా, ఇంకా అనేక విధాలుగా సాంకేతికతను బట్టి ప్రకటితమౌతుంది. అంటే అది కేవలం అక్కడ వాడబడిన సాంకేతికతను బట్టే ఉంటుంది. మీకు కావలసిన ఆ సాంకేతికత ఉంటే మీ చుట్టూ ఉన్న స్థలాన్ని మీరు ప్రతిష్టీకరణ చేయగలరు. కేవలం ఒక రాయి ముక్కను తీసుకుని దేవునిగానో, దేవిగానో చేయగలరు. ఈ విజ్ఞానాన్ని ప్రతిష్టీకరణ అంటారు.
ఎవ్వరూ ప్రతిష్ట చేయబడని ప్రదేశంలో నివసించకూడదని ఆ కాలంలో ముందు దేవాలయాన్ని కట్టి ఆ తరువాత ఇళ్ళు కట్టేవారు.
ఈ ప్రక్రియ గురించి ఎంతో విజ్ఞానం ఈ సంస్కృతిలో వెల్లివిరిసింది, ఎందుకంటే దీనిని అతిముఖ్యమైనదిగా భావించారు. మీరేమి తింటున్నా, మీరెలా ఉన్నా, మీరెంతకాలం జీవించినా, మీరు ఈ సృష్టి మూలంతో అనుసంధానం కావాలన్న కోరిక మీకు ఏదో సమయంలో వస్తుంది. మరి అటువంటి అవకాశం ప్రపంచంలో కలిగించకపోతే, ప్రతి మనిషికీ అది అందుబాటులో లేకపోతే, ఆ సమాజం మనిషికి అసలైన శ్రేయస్సును సమకూర్చడంలో విఫలమైనట్లే. ఆ ఎరుకతోనే ఈ సంస్కృతిలో ప్రతి వీధిలోనూ రెండు మూడు దేవాలయాలు ఉండేవి. దానికి కారణం ఒక దేవాలయానికి మరో దేవాలయానికీ పోటీ అని కాదు. కొద్ది ప్రదేశం కూడా ప్రతిష్టకాకుండా వదలబడకూడదని. ఎవ్వరూ ప్రతిష్ట చేయబడని ప్రదేశంలో నివసించకూడదని ఆ కాలంలో ముందు దేవాలయాన్ని కట్టి ఆ తరువాత ఇళ్ళు కట్టేవారు. తమిళనాడు రాష్ట్రం మొత్తం ఇలానే ఉంది. తమిళనాడులోని ప్రముఖ పట్టణాలన్నింటిలో ఒక పెద్ద దేవాలయం దాని చుట్టూనే పట్టణం. ఎందువల్లనంటే మీరు నివసిస్తున్న గృహం ముఖ్యంకాదు.
మీరు నివసిస్తున్న ఇల్లు 10000 చ.అడుగులా, 1000 చ. అడుగులా అన్నది ముఖ్యం కాదు, ప్రతిష్టీకరించిన ప్రదేశంలో ఉండడం ముఖ్యం, అది మీ జీవితంలో ఎంతో తేడా తీసుకువస్తుంది. ఆ అవగాహనతోనే అక్కడ 25 ఇళ్ళు ఉన్నా అక్కడ ఒక దేవాలయం ఉండాలి. మీరు అక్కడకు వెళతారా లేదా, మీరు పూజలు చేస్తారా లేదా, మీకు ఆ మంత్రాలు వచ్చా, లేదా అన్నది ముఖ్యం కాదు. మీరు మీ జీవితంలో ప్రతిక్షణం ప్రతిష్టీకరింపబడిన ప్రదేశంలోనే నివసించాలి.