మృత్యుకేళి - లక్ష్మి పాల

క్లాస్ రూమ్ నిశ్శబ్ధంగా ఉంది. లెక్చరర్ శిరోమణి మేడమ్ చెపుతున్న తెలుగు పాఠం వింటున్నారంతా. జూనియర్ ఇంటర్ క్లాస్ అది. సహజంగా స్కూల్ వాతావరణం నుండి వచ్చిన పిల్లలు కాబట్టి, వినయవిధేయతలు, క్రమశిక్షణ ఇంకా పిల్లలలో జీర్ణించుకుపోయి ఉంటాయనేది ఎంత నిజమో... రాను రానూ స్నేహితులవలన, పరిస్థితుల ప్రభావం వలన అవి కొంత తగ్గుతాయనేది కూడా అంతే నిజం.

అలాగే... స్కూల్లో ఉన్నప్పటినుండీ రౌడీ వేషాలు వేసే పిల్లలలో ఆ లక్షణాలు జూనియర్ ఇంటర్ లో కనబడినా.. ముందు ముందు తగ్గనూ వచ్చు. లేదా... ఎవరి అదుపూ లేక పెరగనూవచ్చు.

ఎలాంటి హద్దూ అదుపూ లేని ఆకతాయి పిల్లలుగా నాగేంద్ర అతడి టీమ్  సభ్యులు రవి, రాము, కిషన్లను. చెప్పుకోవచ్చు..

“ఏయ్... ప్రణీత్ ఏంటీ సంగతి...? పందానికి రెడీయేనా...?”  ముందు బెంచిలో కూర్చుని పాఠం శ్రద్ధగా వింటున్న ప్రణీత్ ని పెన్ తో గుచ్చి గుసగుసగా అడిగాడు నాగేంద్ర.

“ష్....మేడమ్ చూస్తున్నారు” రహస్యంగా చెప్పాడు ప్రణీత్.

“పందెంలో ఓడిపోతావని భయమా... మేడమ్ చూస్తున్నారని వంక చెప్పి తప్పించుకుందామని ప్లాన్ చేస్తున్నావా...?” రెచ్చగొడుతూ అన్నాడు.

ఆల్రెడీ శ్రీనివాస్, కృష్ణ లను ఇలాగే రెచ్చగొట్టాడు. కానీ, వీడి మాటలకు వాళ్ళిద్దరూ లొంగలేదు. ఇప్పుడెలా అని ఆలోచిస్తుంటే వాడి కళ్ళకు ప్రణీత్ కనబడ్డాడు. ఇవ్వాళ వీడినైనా బాదుదాం అని బాగా ఫిక్సయ్యాడు నాగేంద్ర. వీడిని ఎలాగైనా ఒప్పిస్తే, ఈ రోజుకు పందెం డబ్బులు సంపాదించినట్లే...!

“ఏమంటావు...? లేదంటే చేతకాదని చెప్పేయ్... ఆడంగిని అని ఒప్పేసుకో...” ఇంకా రెచ్చగొట్టాడు.

“ఒరేయ్... నా వల్లకాదు నన్నొదిలేయ్. నా దగ్గర డబ్బులు లేవు.” బ్రతిమాలాడు ప్రణీత్.

“అబద్ధాలు చెప్పకు, నీ జేబులో అయిదువందల రూపాయలు ఉండటం చూసాడట రవి. నాకు చెప్పాడు. డబ్బులు ఉంచుకుని లేవని తప్పించుకున్నావో... రేపు నువ్వు కాలేజికి ఎలా వస్తావో చూస్తాను.” ఆఖరి అస్త్రంగా బెదరించాడు.

ప్రణీత్... వాడి పోరు తట్టుకోలేక పోయాడు.

“సరే... వస్తాను. పందానికి నేను రెడీ...!”  చెప్పాడు.

నాగేంద్ర ముఖం వెలిగిపోయింది. “డన్...!” అంటూ బొటనవ్రేలిని థమ్స్ అప్ లా చూపిస్తూ మిగిలిన టీమ్ కి సైగ చేసాడు. వాళ్ళు కూడా సై అంటే సై అనుకున్నారు. ప్రణీత్ దగ్గరనుండి ఈ రోజు బాగా డబ్బులు గుంజొచ్చు. ఆ డబ్బులతో రేపు రిలీజయ్యే కొత్తసినిమాకు వెళ్ళిపోవచ్చు.

సరిగ్గా అదే సమయంలో ఒక విచిత్రమైన “ఆజానుభాహువు” ఒకడు... బుజానికి ఒక జోలె తగిలించుకుని... వారి క్లాస్ రూమ్ పక్కనుండి నడుచుకుంటూ వెళుతున్నాడు. వాడి దృష్టి నాగేంద్ర మీద పడడం... నాగేంద్ర ఒకరకమైన ఉలికిపాటుకు గురి అవడం లిప్తపాటులో జరిగిపోయాయి.

“ఎవరు ఇతను...??” అని అనుకునేలోపే...

“నాగేంద్రా... ఏం చేసున్నావ్? పాఠం వినకుండా ఎటు దిక్కులు చూస్తున్నావు?” టీచర్ అరిచింది.

“లేదు మేడమ్... వింటున్నాను”  బుద్ధిగా తలూపాడు నాగేంద్ర. వాడిని బెదరించే సరికి మిగిలిన పిల్లలు సెట్ రైట్ అయ్యి సరిగ్గా కూర్చున్నారు.

*******

పరమహంస సైన్స్ & ఆర్ట్స్ జూనియర్ కాలేజిలో ARTs చదువుకుంటున్న ఇంటర్మీడియెట్ పిల్లల్లో ...ఈ నాగేంద్ర టీమ్  బాగా ఆకతాయి పిల్లలు. ఏదైనా సాహసం చేయాలంటే... వీళ్ళనే చెప్పుకోవాలి. ఎలాంటి పనయినా సంకోచించకుండా ధైర్యంగా చేసేస్తారు. రిలీజ్ సినిమాలో టిక్కెట్లు సంపాదించాలంటే వారి తరువాతే...గొడవలు పెట్టుకోవడంలో వాళ్ళే రౌడీలు... వీళ్ళ పేరు చెపితే, మిగిలిన పిల్లలకు హడల్. లెక్చరర్లను కూడా పెద్దగా లెక్క చేయని టీమ్ ఇది. ఎదుటివాడిని ఇబ్బంది పెట్టి పైశాచికానందం పొందే వారిలో వీళ్ళే ప్రధములు. 

వీరి ఆటకు ప్రణీత్ బకరాగా దొరికినందుకు నాగేంద్ర టీమ్ అంతా హుషారుగా ఉన్నారు. ఇంటర్వెల్ బెల్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

కానీ, వారికోసం మరొకరు ఎదురుచూస్తున్నారన్న సంగతి, ఆ నిముషంలో వారికి తెలియదు.

కాలేజి ఇంటర్వెల్ లో ఈ స్టూడెంట్స్ కి ఇదో ఆట...! వాళ్ళల్లో వాళ్ళు సరదాగా వేసుకునే ఓ ప్రమాదకరమైన పందెం అది.  కాలేజికి ఉత్తరదిక్కున కి.మీ దూరంలో వున్న రైల్వే ట్రాక్ మధ్యలో ఓ క్రొత్త బ్రిడ్జి ఉంది...రోజూ వీళ్ళ ఆటలు ఆ బ్రిడ్జి మీదే కొనసాగుతాయి. ఎందరు లెక్చరర్లు చెప్పినా....ఇది ఆగదు. ప్రిన్సిపాల్ ఎన్నిసార్లు పనిష్మెంట్ ఇచ్చినా... ఈ ఆటలో ఉన్న మజాను వాళ్లెవరూ మానుకోలేరు. ఈ గోల తట్టుకోలేక.. ఇంటర్వెల్ టైమింగ్స్ మార్చాలని చైర్మన్ కు రిక్వెస్ట్ పంపించారు ప్రిన్సిపాల్. అక్కడనుండి ఉత్తర్వులు రావలసి ఉంది.  

ఈ ఆటలో వీళ్ళు నలుగురూ ఆరితేరిన వాళ్ళు. వీరితో పందెం వేసుకోవడం అంటే... బెట్టుకాసిన డబ్బులు ఒదులుకోవడమన్నమాటే...!  

ప్రతిరోజూ....11.00 గంటలకు ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ ఆ ట్రాక్ మీదకు వస్తుంది. సరిగ్గా అదే సమయం ఈ కాలేజి ఇంటర్వెల్. బెల్ మ్రోగడం ఆలస్యం... వీరంతా పరుగెత్తుకుని ఆ ట్రాక్ మీదకు వెళ్ళిపోతారు. ఆల్రెడీ ఉదయం అసెంబ్లీ జరగడానికి ముందే...వీళ్ళ బెట్టింగ్ లు పూర్తయితాయి. బెట్ కట్టని మిగిలిన పిల్లలు కూడా..వీళ్లతో రైల్వే ట్రాక్ పైకి పరుగెట్టి ఆ బ్రిడ్జికి పక్కనే ఉన్న ఓల్డ్ బ్రిడ్జిపై నుల్చుని... తమాషా చూస్తుంటారు. ఆ ఆట ఏమిటంటే...???

వేగంగా రైలు ఆ క్రొత్త బ్రిడ్జి మీదకు వస్తుంటుంది. నాగేంద్ర టీమ్ నలుగురు ఆ రైల్వే ట్రాక్ మధ్యలో నిల్చుని ఉంటారు. రైలు వీళ్ళ  దగ్గరగా రాగానే....వీళ్ళు నలుగురూ ఒకేసారి...ఒకరి చేతులు ఒకరు పట్టుకుని... ఒక్క ఉదుటున బ్రిడ్జి మీదనుండి క్రిందనున్న వాగులోకి దూకేయాలి. ఒక్కరు అటూ ఇటూగా దూకినా నలుగురూ ఓడిపోయినట్లే... అదీ వాళ్ళు వేసుకునే పందెం.

పందెం వేసుకున్న ప్రతీసారీ.... నాగేంద్ర టీమ్ గెలుస్తూనే ఉంటారు. ఎవరైతే బెట్ కడతారో ఆ పిల్లలు ఓడిపోయి నాగేంద్ర టీమ్ ముందు బిక్కమొఖాలు వేసుకుంటారు...! చచ్చినట్లు నాగేంద్ర టీమ్ కి డబ్బులు చెల్లించుకుంటారు...!!

ఈ గేమ్ విషయంలో నాగేంద్ర టీమ్ కే కాదు. వాళ్ల  పేరెంట్స్ ని కూడా  పిలిచి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారు కాలేజి యాజమాన్యం. ఎంత చేసినా... ఆ తల్లిదండ్రులు కానీ, కాలేజి యాజమాన్యం కానీ వీరి ఈ అలవాటును మాన్పించలేకపోయారు.

*******

ఆ రోజు  కూడా....ఈ ఆట మొదలైంది. అప్పటికే... ప్రిన్సిపాల్ ఆదేశాల మేరకు కాలెజి పి.టి.... వాళ్ళను అక్కడనుండి తరిమేయడానికి బయలు దేరాడు. దూరంగా ”కూ...” అంటూ రైలు విజిల్ వినిపించింది.

గేమ్ స్టార్టయ్యింది. వీరు నలుగురూ పొజిషన్ లో నిలబడి రెడీ గా ఉన్నారు.

ఓల్డ్ బ్రిడ్జి పై నిలబడి... బెట్ కాసిన పిల్లలు చప్పట్లతో, కేరింతలతో వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. రైలు దగ్గరవుతుంది... వీళ్ళు నలుగురూ అలర్ట్ గా ఉన్నారు. వాళ్ళ చెవులు బాగా షార్ప్ గా పని చేస్తున్నాయి. రైలు శబ్ధం మాత్రమే వినిపించేంత ఏకాగ్రత వాళ్ల మెదడులో...

రైలు బాగా దగ్గరైంది.

వాళ్ళకి తెలుసు... ఇంకో నలభై సెకన్లలో ఆ రైలు వాళ్ళకి అడుగు దూరంలోకి వచ్చేస్తుంది. కేవలం పది సెకన్ల టైం మాత్రమే గ్యాప్ ఇవ్వాలి.

ఆ గ్యాప్ లో... వాళ్ళు బ్రిడ్జి మీద నిల్చున్న స్థలానికి, క్రిందుగా కుడివైపు ఉన్న ఇసుకలోకి ఒకేసారి దూకెయ్యాలి. ఒకటి.... రెండు.... మూడు.....  లెక్కపెట్టుకుంటున్నారు.

మిగిలిన పిల్లలంతా ఊపిరి బిగపట్టి వారినే కన్నార్పకుండా చూస్తున్నారు.  వాళ్ళే కాదు. వారికి అతి సమీపంలో నిలబడి చేతులు కట్టుకుని దీక్షగా వారినే చూస్తూ ఉన్నాడా ఆజానుబాహుడు.

రైలు వాళ్ళు ఊహించిన అడుగు దూరంలోకి వచ్చేసింది. ఒకరినొకరు పట్టుకున్న చేతులు గట్టిగా బిగుసుకున్నాయి. దూరం నుండి పి.టి వేస్తున్న విజిల్ వినబడుతున్నా.. వాళ్ళ చెవులు, మెదడు దాన్ని స్వీకరించడం లేదు. పి.టి. కూడా వాళ్ళనే చూస్తూ నిలబడ్డచోటనే ఆగిపోయాడు. ఎంత పరుగెత్తుకొచ్చినా... వాళ్ళను ఆపలేడన్న విషయం అతనికి తెలుసు.

రైలు వాళ్ళకి చాలా దగ్గరగా వచ్చేసింది.

"ఊ....రెడీ....జంప్..." నలుగురూ ఒక్కసారిగా గాలిలోకి లేచారు. వాళ్ళ టైమింగ్ కరెక్టే...

కాని, సరిగ్గా అదే సమయంలో... ఇటు చివర నిల్చున్న నాగేంద్ర కాలు ఏదో పట్టుకున్నట్లుగా అనిపించింది. సెకనులో వెయ్యోవంతు అతని కళ్ళు తనకు ఎడమవైపుకు తిరిగాయి...

అక్కడ... ఇందాక జోలె తగిలించుకుని  క్లాస్ రూం పక్కనుండి తనను చూసుకుంటూ వెళ్ళిన  "ఆజాను బాహుడు"... అతడేం చేస్తున్నాడో అర్ధమయ్యేసరికి, భయంతో నాగేంద్ర కళ్ళు పెద్దవయ్యాయి.

ఆ ఆజానుబాహుడు... నాగేంద్ర  కాలును పట్టి నేలకు అదిమిపెట్టి ఉంచాడు. అతని చూపు చిత్రంగా ఉంది. తన కర్తవ్యమేదో దీక్షగా నిర్వర్తిస్తున్నట్లు... అతని ముఖంలో చిత్రమైన భావం.... అతని పెదవులు ఏదో మంత్రాన్ని ఉఛ్ఛరిస్తున్నాయి. కళ్ళు ఎర్రగా రక్తకణికల్లా... కనబడుతున్నాయి.

నాగేంద్రకు ఆలోచించుకునే సమయం లేకపోయింది. చూపు కుడివైపుకు తిరుగుతుండగానే....రైలు "ఫట్" మని కొట్టేసింది. ఏం జరిగిందో అక్కడున్నవాళ్ళకు అర్ధమయ్యేలోపే నాగేంద్ర శరీరాన్ని రైలు కొంతదూరం ఈడ్చుకు వెళ్ళిపోయింది. అప్పటికే గాలిలోకి లేచిన రవి... అతని ఎడమ చేయి నాగేంద్ర చేతిలో బిగుసుకు పోయి ఉండడం వలన...రైలు వేగానికి అతని శరీరం అనుకున్న దిశకు కాకుండా... నాగేంద్ర శరీరంతో పాటు లాక్కెళ్ళబడి... ట్రాక్ కి వేసిన చెక్కదుంగలకు కొట్టుకుని చిట్లిపోయింది...అతని చేతిలో ఉన్న కిషన్ చేయి ఆ ఉదుటుకు ఆల్రెడీ జారి బ్రిడ్జి క్రిందకు పడిపోయినా.... పైన జరిగినదాని వలన దిశ మారి కిషన్...బ్రిడ్జి క్రింద ఎడమవైపున ఉన్న బండలపై పడి అక్కడికక్కడే మరణించాడు. ఒక్క రాము మాత్రమే... అనుకున్న టైమింగ్ లో ప్లాన్ ప్రకారం ఇసుకలో పడ్డాడు. అయినప్పటికీ... తల్లక్రిందులుగా పడడంతో... మెడ ఎముకలు విరిగి నుజ్జు నుజ్జయ్యాయి. దాంతో ఆ కుర్రాడు అక్కడే... ప్రాణాలొదిలాడు.

అప్పటివరకూ తమాషా చూస్తున్న పిల్లలందరూ భయంతో కెవ్వు కెవ్వున అరిచారు. దూరం నుండి వాళ్ళను చూస్తూ ఆగిపోయిన పి.టి. రయ్యిన పరుగెత్తుకొచ్చాడు. ఎప్పటిలాగే పిల్లలు వాగులోకి దూకేస్తారనుకున్నాడు గాని, నాగేంద్ర ఎందుకని ఆగిపోయాడో... అతనికి అర్ధం కాలేదు.

ఇది తెలిసి... కాలేజి సిబ్బంది, మిగిలిన స్టూడెంట్స్ అందరూ పరుగెత్తుకుని వచ్చారు.  హుటాహుటిని పోలీసులు ఎంటరయ్యారు. ఆ పిల్లల తల్లిదండ్రులకు కబురంది... వాళ్ళూ ఏడ్పులు పెడబొబ్బలతో వచ్చేసారు. పోలీసులు ... చెల్లా చెదరై పడి ఉన్న నాగేంద్ర శరీర భాగాలన్నీ ఒక్కదగ్గర చేర్చారు.

ఒక్కొక్కరి డెడ్ బాడీని వాగులోని ఇసుకలో వరుసగా పడుకోబెట్టారు.

ప్రాణాలతో చెలగాటం... ప్రమాదాలతో పందెం...ఎంత అనర్ధదాయకమో...ఆ సంఘటన తెలియజెప్పింది. అప్పటివరకూ వాళ్ళనే చూస్తూ కూర్చుని ఉన్న ఆ “ఆజానుబాహుడు”  తనవంతు బాధ్యత పూర్తయినట్లుగా... పైకి లేచి, ఆ నలుగురి ప్రాణాలను అరచేతితో అందుకుని తన బుజానికి ఉన్న సంచిలో వేసుకుంటూ నిశ్శబ్ధంగా ముందుకు సాగిపోయాడు.

అతడిని అక్కడ ఉన్న వాళ్ళెవరూ చూడలేదు. కాదు కాదు... ఎవరూ చూడలేరు.  కేవలం ఆయువు తీరిన వారికి తప్ప సజీవులై ఉండబోయే మానవులకెవరికీ కనబడని “మృత్యువు” అతడు...!!!

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు