మృత్యుకేళి - లక్ష్మి పాల

హైదరాబాదు నుండి మాచర్ల కి వెళ్ళే రోడ్డు మీద కారు స్పీడ్ గా పరుగెడుతోంది.

జనార్ధన్ కి చాలా కంగారుగా ఉంది. రాత్రి తనకు వచ్చిన కల అతడిని విపరీతమైన టెన్షన్ కి గురిచేస్తోంది...! అతని మనసు మనసులో లేదు. ఆ కల మాటి మాటికీ గుర్తొచ్చి, ముచ్చెమటలూ పోస్తున్నాయి. త్వరగా విజయపురి చేరుకోవాలి. సాధ్యమైనంత త్వరగా ఆశ్రమంలో శ్రీ శ్రీ విజయ సచ్చిదానందస్వామి వారిని కలవాలి. 

అతని కళ్ళకు...ఆ రోజు హాస్పిటల్ ఎదురుగా కనిపించిన సాధువు కదలాడాడు. అతను చెప్పినట్లు, ఆరోజు తను విజయపురి వెళ్ళాడు. కానీ, అక్కడ సరైన సమాధానం దొరకక, వెనుతిరిగి వచ్చేసాడు. మళ్ళీ జన్మలో అక్కడికి వెళ్ళాల్సిన అవసరం వస్తుందని ఊహించలేదు. కానీ, ఇప్పుడు స్వామి వారిని ఆశ్రయించడం తప్ప తనకు మరో దారి కనబడలేదు. మరికాస్త స్పీడ్ పెంచాడు.

******

దాదాపూ ఊహ తెలిసినప్పటినుండీ... ఈ కలలు జనార్ధన్ ని వెంటాడుతున్నాయి. కానీ, అప్పుడు అవేమిటో అతడు తెలుసుకోలేకపోయాడు. సరిగ్గా అతడు గమనించింది...అతడి పదహారోయేట తన స్నేహితుడి ప్రసాద్ మరణం పట్ల వచ్చిన కల. ఆ రాత్రి అతడి కలలో... స్నేహితులందరూ ఎప్పుడూ ఆడుకునే ఊరి చెరువు గట్టున ఉన్న గడ్డి మైదానంలో క్రికెట్ ఆడుతున్నారు. అప్పుడు హఠాత్తుగా చెరువులో ఏదో కలకలం... ఏమిటా అని అందరూ చూస్తుండగానే, చెరువులో నీళ్ళు ఒక్కసారిగా గట్టుపైకి వచ్చి, తన పక్కనే ఉన్న ప్రసాద్ ని మాత్రం లోపలికి లాక్కెళ్ళిపోయాయి. అప్పుడు కూడా ఇదేదో పిచ్చి కల అనుకున్నాడు. కానీ, తెల్లవారి ఎప్పటిలాగే, చెరువుగట్టుమీద క్రికెట్ ఆడుకుంటుంటే, కీపింగ్ చేస్తున్న ప్రసాద్... బాల్ పట్టుకోబోతూ చెరువులో పడిపోయాడు. తీరా శవమై తేలేంతవరకూ వాడు దొరకనేలేదు.

అప్పుడు అర్ధమైంది. రాత్రి తనకు వచ్చిన కల ఇలా నిజమైందని. కానీ, భయంతో ఎవరికీ చెప్పలేదు. రెండోసారి, జనార్ధన్ మేనమామ... మరణించాడు. దానికి ముందు రాత్రి కూడా... తనకు హింట్ ఇస్తూ ఒక కల వచ్చింది. జనార్ధన్ మేనమామ రవీంద్ర, విమల అనే అమ్మయిని ప్రేమించాడు. ఇరుపక్షాల పెద్దలు అంగీకరించలేదు. ఇద్దరూ ఒకరోజంతా ఎవరికీ కనబడకుండా వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఇద్దరి పెద్దల నడుమ పేద్ద గొడవ అయ్యింది. ఆ రాత్రి... ఆ గొడవ అంతా వింటూ, తల్లి ఒడిలోనే పడుకుని నిద్రపోయాడు జనార్ధన్. నిద్రలో... జనార్ధన్ మేనమమ, అతని ప్రేయసి ఇద్దరూ రైలు పట్టాలలో నడుస్తున్నారు. ఇద్దరి ముఖాలూ విషాదంగా ఉన్నాయి. వాళ్ళని అనుసరిస్తూ వారి వెంటే నడుస్తున్న ఒక నీడలాంటి ఆకారమేదో జనార్ధన్ కి కనబడింది. దిగ్గున నిద్రలేచి, ఆ విషయం తల్లితో చెప్పాడు. “చాల్లే ఊర్కో... ఎవరైనా వింటే నవ్వుతారు మా తమ్ముడికి ఏమీ కాదు.” అంటూ కొట్టిపారేసింది.

ఆ తెల్లవారు ఝామున అందరూ మంచి నిద్రలో ఉండగా ఎవరో కేకేసి చెప్పారు. ”రవీంద్ర, విమలలు రైలుక్రిందపడి చనిపోయారట...” అంటూ...  

ఇట్లాంటివే మరో అయిదారు సంఘటనలు... జనార్ధన్ కి అర్ధమైంది. తనలో ఏదో తెలియని విచిత్రమైన శక్తి ఉంది. కానీ, అది తనకే ఎందుకు ఉంది...? మనసంతా భరించరాని బాధకు గురయ్యేది. ఇటువంటి స్వప్నాలు వచ్చినపుడు చాలాసార్లు ఆ సంబంధిత వ్యక్తులకు చెప్పాలనిపించేది. కానీ, అలా చెపితే, వాళ్ళు ఎలా అర్ధం చేసుకుంటారోననే భయంతో చాలాసార్లు అదిమిపెట్టుకునేవాడు. అర్ధం చేసుకోకపోతే ఫర్వాలేదు. తనని పిచ్చివాడి క్రింద జమకట్టి ప్రచారం చేస్తే...?

అతడికి 20  ఏళ్ళొచ్చాయి. జనార్ధన్ ఇంటికి నాలుగు ఇళ్ళ అవతల అతని క్లోజ్ ఫ్రెండ్ వెంకట్ ఇళ్ళు. నాలుగురోజులుగా వెంకట్, జనార్ధన్ కలలోకి వస్తున్నాడు. ఎందుకో ఎంత ఆలోచించినా జనార్ధన్ కి అర్ధంకాలేదు. ఆరోజు డిగ్రీ ఫైనల్ ఇయర్ పరిక్షా ఫలితాలోచ్చాయి. వెంకట్ ఫెయిలయ్యాడు. “ఫర్వాలేదులే... మళ్ళీ రాసుకుందాం” అంటూ ఫ్రెండ్సంతా ఓదార్చారు. వెంకట్ కూడా నవ్వుకుంటూనే ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి కలలో... ఎవరిదో బాగా పరిచయమున్న ఇళ్ళు. ఆ ఇంటిలోని ఓ గదిలో పైకప్పుకు ఉన్న ఫాన్ కి వ్రేళ్ళాడుతూ ఎవరో ఒకవ్యక్తి. అచేతనమైన అతని పాదాలు చూసి గుర్తుపట్టాడు. అవి వెంకట్ పాదాలు. ఉలిక్కిపడి లేచాడు జనార్ధన్. “మైగాడ్... వెంకట్ కి ఏమైనా అవుతుందా...?” అప్పుడు సమయం... రాత్రి 11.30. ఎందుకైనా మంచిదని, వెంకట్ కి ఫోన్ చేసాడు.

అవతల వెంకట్ లిఫ్ట్ చేసాడు. “ఏంట్రా ఇంత రాత్రి ఫోన్ చేసావు నిద్రపోలేదా...?” అడిగాడు.

“ఏం లేదు. రేపు బయటకు వస్తావా...? ఒక ముఖ్యమైన చోటకి వెళ్ళాలి.” అతనికి అనుమానం కలగకుండా ఏదో అడిగేసాడు జనార్ధన్.

వెంకట్ నవ్వాడు. “ఉంటే... తప్పక వస్తాను.” నర్మ గర్భంగా పలికాడు.

ఉలిక్కిపడ్డాడు జనార్ధన్. “అదేమిట్రా... ఉండక ఎక్కడికి వెళతావు?” మనసులో గాబరాగా ఉన్నా... పైకి అది తెలియనివ్వకుండా అన్నాడు.

“లేదురా... రేపు ఊరెళ్ళమంటున్నాడు నాన్న...” చెప్పాడు వెంకట్.

“ఉఫ్.....హమ్మయ్య” మనసులోనే అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు జనార్ధన్.

తెల్లవారుఝాము గం. 4.20లు. మంచం మీద కుడివైపుకు ఒత్తిగిలి పడుకున్న జనార్ధన్ నిద్రలో ఎడమవైపుకు తిరిగాడు. ఆ కదలికలో చిరు మెలకువ. అరక్షణం... నిద్ర మత్తులోనే...కళ్ళు తెరచి, మళ్ళీ మూయబోతుండగా... కనిపించింది. ఏదో ఒక ఆకారం తన మంచం పక్కనుండి బయటకు వెళ్ళిపోతూ...

ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. పక్కనున్న లైటు వేసి చూసాడు. ఏమీ కనిపించలేదు. కొన్ని మంచినీళ్ళు త్రాగి, మళ్ళీ పడుకున్నాడు.

“ఒరేయ్... జనా... లేవరా... నీ ఫ్రెండూ...” తల్లి నిద్ర లేపుతుంటే లేచాడు. “డిగ్రీ ఫెయిలయినందుకు వాళ్ళ నాన్న రాత్రి తిట్టాడంటా... దాంతో వెంకట్ ఉరేసుకుని... చనిపోయాడురా...!” చెప్పింది. మంచం దిగి ఒక్క ఉదుటున వెంకట్ ఇంటికి పరుగెత్తాడు. పోలీసులు వచ్చారు. కుటుంబసభ్యులంతా ఘొల్లున ఏడుస్తున్నారు. వెంకట్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని వ్రేళ్ళాడుతున్నాడు. అచేతనమైన అతని పాదాలు... కలలో కనిపించిన విధంగా కనబడుతున్నాయి జనార్ధన్ కళ్ళకు. అంటే, తెల్లవారుఝామున తన మంచం పక్కనుండి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నది. వెంకట్ ఆత్మనా...? అతడు వెళ్లిపోతున్నాడన్న విషయాన్ని తనకు చెప్పడానికి వచ్చాడా...??? జనార్ధన్ కళ్ళు తిరిగాయి.

********

          ఆ ఊరునుండి జనార్ధన్ తండ్రి కొత్తవ్యాపారం పెడతానంటూ, హైదరాబాదు వచ్చేసాడు. కుటుంబాన్ని మొత్తం షిఫ్ట్ చేసేసాడు. జనార్ధన్ కి కొత్త మనుషులు, కొత్త ప్రదేశం... కొత్త పరిచయాలతో పాత విషయాలు కొంతకాలం మరచిపోయాడు. అతనికి కలలు రావడం కూడా తగ్గింది. ఉద్యోగప్రయత్నాలేవీ చేయకుండా... తండ్రితో కలిసి వ్యాపారం చూసుకోసాగాడు. అందువలన కొంత కలల గురించిన ఆలోచనలు తగ్గాయి.

బిజినెస్ పెరిగింది. జనార్ధన్ కి వివాహమైంది. కాలక్రమేణా తల్లిదండ్రులు చనిపోయారు. అతడి ముఫ్పయి అయిదో ఏటకి వ్యాపారంలో బాగా రాణించాడు. ఇద్దరు పిల్లల తండ్రీ అయ్యాడు.

“డాడీ... నేను స్కూల్ కి వెళుతున్నాను..!” చెప్పాడు అనిరుద్ధ్, ఆరుబయట కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్న జనార్ధన్ తో.

“బైబై... జాగ్రత్త...!! రోడ్డు దాటేపుడు అటూ ఇటూ చూసుకుని వెళ్ళు...” రోజూలాగే చెప్పి, తిరిగి పేపర్ చదవడంలో నిమగ్నమయ్యాడు. అనిరుద్ధ్, జనార్ధన్ పదేళ్ళ కొడుకు. అతడు స్కూలుకు వెళ్ళే సమయంలో ఎప్పుడూ... జనార్ధన్ బయట పేపర్ చదువుకుంటూ కూర్చుని ఉండడం... అతడిని చూడగానే అనిరుద్ద్, ’డాడీ...వెళ్తున్నా...’అని చెప్పడం... ప్రతిరోజూ జరిగేదే...!

ఇంటి ఎదురుగానే మెయిన్ రోడ్డు. ఇంటిముందు కూర్చుని ఉంటే, అనిరుద్ద్ రోడ్డు దాటి, రోడ్డవతల ఆగి ఉన్న స్కూల్ బస్సు ఎక్కివెళ్ళడం కనబడుతూనే ఉంటుంది. పేపరు చదువుతూ యధాలాపంగా తలెత్తి చూసిన జనార్ధన్ కనుబొమలు ముడిపడ్డాయి. అనిరుద్ధ్ తో ఎవరో కొత్తవ్యక్తి నడుస్తున్నాడు. ఎప్పుడూ చూడని ఆ వ్యక్తి ఎవరూ...? అతడు అనిరుద్ధ్ వెంటే ఎందుకున్నాడు...? ఆలోచించేలోపే, ఎక్కడనుండి వచ్చిందో ట్రక్కు... రోడ్డు దాటుతున్న అనిరుద్ధ్ ని ఒక్కసారిగా ఢీకొట్టి, కొంచెం దూరం పోయి ఆగింది. “అనిరుద్ధ్...!” లేచి బయటకు పరుగెత్తాడు జనార్ధన్... అప్పటికే రక్తం మడుగులో కాస్సేపు గిలగిల కొట్టుకుని ప్రాణాలు విడిచాడు అనిరుద్ధ్.

ఒక్క ఉదుటున మంచం పై లేచి కూర్చున్నాడు జనార్ధన్. అప్పుడు సమయం... తెల్లవారి గం. 4.00లు. ఏ.సి. లో సైతం... ఒంటికి పట్టిన చమటను తుడుచుకుంటూ... “భగవాన్.... మళ్ళీ ఈ కలలు ప్రారంభమయ్యాయా...? తన కొడుకుకు ఎమైనా అవుతుందా...? భగవాన్... ఏమిటిదీ...!!!” తలపట్టుకు కూర్చున్నాడు.

తెల్లవారింది. “అనూ... ఈ రోజు అనిరుద్ద్ ని నేను స్కూల్ కి తీసుకెళతాను” అంటూ రెడీ అయిపోయి బెడ్ రూమ్ నుండి బయటకు వచ్చాడు.

హాల్లో కూతురికి టిఫిన్ తినిపిస్తూ...“వాడెప్పుడో వెళ్ళిపోయాడు” నవ్వుతూ చెప్పింది భార్య అనురాధ. గట్టిగా నిట్టూర్చి షాపుకు వెళ్ళిపోయాడు. సాయంత్రం షాప్ లో బిజీగా ఉన్న టైమ్ లో భార్య ఫోన్ చేసి చెప్పింది. “ఏమండీ... మన అనిరుద్ద్... అనిరుద్ద్.... యాక్సిడెంట్ లో...” వెక్కిళ్ళ మధ్య చెప్పలేక, చెప్పలేక చెప్పింది.

జనార్ధన్ కి అర్ధమైంది. తన కల మళ్ళీ నిజమైంది. ఈసారి తన కన్నకొడుకునే పొట్టనబెట్టుకుంది.

********

          కొడుకు మరణంతో బాగా డిస్టర్బ్ అయ్యాడు జనార్ధన్.  ఇన్నాళ్ళూ ఈ కలలను పట్టించుకోకపోవడం, వీటి గురించి సీరియస్ గా ఆలోచించకపోవడం తన తప్పే...! తన ఇంట్లో ఆ నష్టం జరిగేవరకూ తను మేలుకోకపోవడం తన స్వయంకృతాపరాధమే...

          “సహజంగా... ప్రతి మానవుడికి 9రకాల కలలు వస్తుంటాయి. ఎత్తైన ప్రదేశం నుండి క్రిందకి పడిపోతున్నట్లు, పబ్లిక్ లో తను వివస్త్రగా ఉన్నట్లు, ఎవరో తనను తరుముతున్నట్లు, తన దంతాలు ఊడిపోతున్నట్లు, Infidelity dreams, pregnancy పై కలలు, ఇంకా ఎగ్జామ్ రాస్తున్నట్లు, తను గాల్లో ఎగురుతున్నట్లు, తను లేదా తనవారు మరణిస్తున్నట్లు... ఇలా వారి వారి మానసిక స్థితిని బట్టి, ఆయా పరిసరాలు, పరిస్థితులను బట్టి ఉంటాయి.” సైక్రియాట్రిస్ట్ మిస్టర్ పాల్ చెపుతున్న మాటలు శ్రద్ధగా వింటున్నాడు జనార్ధన్.

          “మీరు చెప్పినట్లు, ఎదుటివారి మరణానికి సంబంధించిన కలలు వస్తున్నాయి అంటున్నారంటే... ఒకటి, మీ వాళ్ళ పట్ల, మీకు తెలిసినవాళ్ళ పట్ల  మీలోని ప్రేమ, భయాందోళనలే ఇందుకు కారణమై ఉండొచ్చు. వారికి సంబంధించి అతిగా ఆలోచిస్తున్నారు కాబట్టే, ఇలాంటి కలలు వస్తున్నాయి. అవి నిజమౌతుండటం యాధృఛ్ఛికమై ఉండొచ్చు. లేదా... మీలోని Deep Sixth Sense  కలల రూపంలో ఈ హింట్స్ ఇస్తుండటం జరుగుతుందేమో...! ఎందుకైనా మంచిది, మీరు కొన్ని టెస్టులు చేయించండి. వాటిని పరిశీలించి, సమస్యను సరిగ్గా డయాగ్నసిస్ చేయగలము” చెప్పాడు.

          “మీరేమైనా చేయండి డాక్టర్ గారూ... నాకీ కలలు రాకుండా ఆపండి. ఇవి నేను భరించలేకపోతున్నాను.  ఈ కలలు ఎవరికీ ఉపయోగపడకపోగా... ఆ టెన్షన్ తో పిచ్చెక్కేలా ఉంది నాకు.” బారంగా తలపట్టుకున్నాడు జనార్ధన్.

“కంగారు పడకండీ...! ఈ టెస్టులు ఓ రకంగా మీరు schizophrenia తో బాధపడుతున్నారేమో చెక్ చేయడానికి. ఇది కాదని ప్రూవ్ అయితే, ఆ తరువాత ఏదైనా చేయగలం.” చెప్పాడు పాల్.

schizophrenia....అంటే...???” తలెత్తాడు.

“అంటే... మెంటల్ ఇల్ నెస్. మీరు hallucination  గురించి మీరు వినే ఉంటారు. మేజర్ గా Auditory Hallucination and Visual Hallucination ఉంటాయి. మొదటిది, ఎవరూ కనబడకున్నా, లేదా కనబడినా ఏదో తనకు చెపుతున్నట్లు, ఏవో మాటలు గాలిలో వినబడుతున్నట్లు భ్రమ చెందేది. రెండవది... తనకు కనబడని దృశ్యాలు కనబడుతున్నట్లు భ్రమపడేవి. మీరు చెప్పినవి... Sleep Hallucinations కి చెందుతాయి. ఇందులో... స్వప్నంలో కనిపించేవి నిజమేననే Deep Imagination ఉంటుంది. నిద్ర లేచాక కూడా... అక్కడ వాస్తవం కాకపోయినా అదే భ్రమ కంటిన్యూ అవుతుంది. లేదా... వాస్తవంలో జరిగిన సంఘటనే, రాత్రి కలలో వచ్చింది అని గానీ, నాకిది ముందే తెలిసింది అనే భ్రాంతిలో ఉండడము జరుగుతుంది. మీ లక్షణాలు ఇవి అవునో, కాదో తెలుసుకోవాలి ముందు.” చెప్పాడు.

నిట్టూర్చాడు జనార్ధన్. అక్కడినుండి లేచి, బయటకు వచ్చి కారెక్కాడు. డాక్టర్ దగ్గరకు వెళ్ళాక, అతని పరిస్థితి మరీ అయోమయంగా ఉంది. కారు స్టార్ట్ చేయబోతుండగా... ఒక సాధువు అడ్డుపడ్డాడు. “నీకు జవాబు కావాలంటే... ఇక్కడ కాదు. విజయపురి వెళ్ళు. నీ సమస్యలన్నీ తీరిపోతాయి. వెళ్ళు ... అక్కడికి వెళ్ళు... ” చెప్పి మరోమాటకు అవకాశమివ్వకుండా వెళ్ళిపోయాడు. మనుషులు... డాక్టర్లకన్నా... సాధువులను, స్వాములను తొందరగా నమ్ముతారు. ఈ సమస్యకు స్వామివారే కరెక్టు అనిపించి, ఆరోజు విజయపురి వెళ్ళాడు జనార్ధన్.

*******

 “నువ్వు చెప్పినట్లు,  సైంటిఫిక్ రీజన్స్ తో నాకు సంబంధం లేదు. కొన్ని ఎందుకు జరుగుతాయో... కొందరికే ఎందుకు జరుగుతాయో... ఆ పరమాత్ముడు తప్ప, మానవమాత్రులెవ్వరూ చెప్పలేరు. ఇది పూర్వజన్మ సుకృతమో లేదా దోషమో... ఈ జన్మపాపపరిహారమో... మనం గణించలేము. నీకు ఇటువంటి స్వప్నాలు సాక్షాత్కరించబడినపుడు, వారిని కాపాడమంటూ ఆ భగవంతుడిని వేడుకోవడమే మనము చేయగలిగేది. ఎందుకంటే, మృత్యువు అనివార్యము. ఆయువు ముగిసిన వారినెవరినీ మనం దాని బారినుండి రక్షించలేము. మనలను మనమూ రక్షించుకోలేము. అది అంతా భగవదేఛ్ఛ...! పుత్రశోకంతో అల్లాడుతున్నావు. మనసును నిబ్బరంగా పెట్టుకో... జరిగేది, జరగబోయేది చూస్తూ నిమిత్తమాత్రుడిగా ఉండటమే నీ పని...! ఆ భగవంతుడిని ధ్యానించు...!!”

ఆ మాటలు వినగానే చిర్రెత్తుకొచ్చింది జనార్ధన్ కి. సాధువు చెప్పాడని, వెంటనే విజయపురికి వచ్చి స్వామిని కలిసాడు తను. ఎంతో ఆశతో వచ్చిన తనకి స్వామి చెప్పిన ఈ మాటలు ఏమాత్రం సంతృప్తిని ఇవ్వలేదు. సహించలేకపోయాడు.

“ఈ జవాబు కోసమా స్వామీ... ఇంతదూరం పరుగెత్తుకొచ్చాను. ఎవరినీ కాపాడలేనపుడు... ఆ స్వప్నాలు నాకే ఎందుకు రావాలి...? ఈ ప్రపంచంలో మరెవరూ లేనట్లు, అందరి మరణాలు నాకే ఎందుకు తెలియాలి...?” అసహనంగా అడిగాడు.

“నీకు అందవలసిన సమాధానం నానుండి సంపూర్ణంగా అందింది. నువ్వే సూక్ష్మం గ్రహించలేకపోతున్నావు. ఇంక బయలుదేరు...” బయటికి దారి చూపించాడు స్వామి.

అతని వైఖరికి జనార్ధన్ కి వీపరీతమైన కోపం వచ్చేసింది.

“సమస్యకు కారణమేమిటో చెప్పలేకపోగా, సోది కబుర్లు చెపుతున్నారు. ఈ సొల్లు చెప్పడానికి, మీకో ఆశ్రమం... పెద్ద సంఖ్యలో శిష్యగణం... వెర్రిముఖాలేసుకుని ఇదంతా వినడానికి ఇంత పెద్ద ఎత్తున భక్తులా...?” ఆవేశంగా అరిచేసాడు.

అతని మాటలకు స్వామి కోపం తెచ్చుకోలేదు. ప్రశాంతమైన చిరునవ్వు అతని ముఖం మీదనుండి చెరిగిపోలేదు.

“మిమ్మల్ని అని లాభం లేదు. మీలాంటి వాళ్ళను దేశంలో పెట్టుకుని ప్రోత్సహిస్తున్న ఈ ప్రభుత్వాలను,  పెంచి పోషిస్తున్న ఈ ప్రజానీకాన్ని అనాలి.” విసురుగా లేచి, బయటకు వచ్చేసాడు.

“అదేమిటి స్వామీ... అతడిని అలా పంపించేసారు...? ఎప్పుడూ ఎవరినీ నొప్పించరు మీరు...! ఏ సమస్యతో వచ్చినా... పరిష్కారము చూపించకుండా ఉండరు. కానీ, అంత పెద్ద సమస్యతో వస్తే... జవాబు ఏమీ లేనట్లు అలా ముగించారు” పక్కనే ఉన్న శిష్యుడు ఆశ్చర్యంగా అడిగాడు.

స్వామి ప్రశాంతంగా చెప్పాడు. “అంతవరకు చెప్పడానికే భగవంతుడు నన్ను ఆదేశించాడేమో. పాపం అతడికి ఇంకోమాట చెప్పడానికి నాకు నా నాలిక సహకరించలేదు. వాస్తవానికి అతని జన్మలగ్నం బలహీనం. అయినప్పటికీ ఒక దశవరకు అతనికి పంచమహాయోగం సిద్ధించింది. ఎదుటి వారి మృత్యువు ముందే తెలిసిపోవడం అనేది, గొప్ప గొప్ప సిద్ధులకే అసాధ్యం. కానీ, అతనికే తెలియకుండా అతనిలో నిక్షిప్తమై ఉన్న ఆ అతీంద్రీయ శక్తిని, అతడు పాజిటీవ్ దృష్టితో కాకుండా... నెగటీవ్ దృష్టితో చూస్తూ మనసును అశాంతిపాలు చేసుకున్నాడు. ఇప్పుడు అతని వ్యయస్థానంలో దుష్టగ్రహాల వీక్షణ అధికంగా ఉంది. ఇక మనం చెప్పడానికి ఏమీలేదు. ఒక్కసారి, వెనుతిరిగి వెళ్ళిపోతున్న అతడి నీడను చూడు...” చూపించాడు.

దూరంగా వెళుతున్న జనార్ధన్ వెనుక రెండు నీడలు వెళుతున్నాయి. అందులో ఒకటి మాత్రమే జనార్ధన్ ది. రెండవది... అది చూడగానే “పరమాత్మా...!” బలంగా నిట్టూర్చుతూ కళ్ళుమూసుకున్నాడు శిష్యుడు.

*******

కారు మాచర్ల దాటి విజయపురి వెళ్ళే రూట్ లోకి మళ్ళింది. సరిగ్గా ఆ సమయంలో రోడ్డుకు ఎడమవైపున ఒక వ్యక్తి లిఫ్ట్ కోసం చేయి చాచి నిలబడి ఉండడం కనబడింది. చాలా సేపటినుండి ఎదురుచూస్తున్నాడేమో... జనార్ధన్ కారు కనబడగానే అతని ముఖం విప్పారింది.

అతనికి దగ్గరగా రాగానే... ప్రాధేయపూర్వకంగా ముఖం పెట్టి, చేతులు జోడించాడతను. జనార్ధన్ కారు ఆపకుండా ఉండలేకపోయాడు. “ఎక్కడికి...?” అడిగాడు.

“ఆశ్రమానికి సార్.... చాలాసేపటినుండి నిలబడి ఉన్నాను. దయచేసి లిఫ్ట్ ఇవ్వండి...!” రిక్వెస్టు చేసాడు.

“సరే”నని ఎక్కించుకున్నాడు. దారిలో తనెక్కడినుండి వస్తున్నాడో... చెప్పాడు ఆ అపరిచిత వ్యక్తి. అన్నింటికీ తలూపుతూ వింటున్నాడు జనార్ధన్.  తనేమీ మాట్లాడకపోవడంతో అతను కూడా మౌనంగా ఉండిపోయాడు. కాస్సేపు  ఎవరి ఆలోచనల్లో వారు నిశ్శబ్ధంగానే ఉన్నారు.

కారు... అటవీప్రాంతంలో ప్రయాణిస్తుంది. ఆశ్రమం చేరుకోవడానికి ఇంకా రెండు కిలోమీటర్ల దూరం ఉంది. ఆశ్రమం చేరువవుతుంటే టెన్షన్ పెరుగుతోంది జనార్ధన్ లో. ఏదో ఒకటి మాట్లాడితే తప్ప, ఇది తగ్గదనిపించి, “ఆశ్రమానికి ఎందుకు...?” అనడిగాడు ఆ అపరిచితుడిని.

అతను, “రాత్రి... నాకు ఒక కల వచ్చింది సార్. ఆ కలలో నేను ఎక్కడికో ప్రయాణం చేస్తున్నాను. హఠాత్తుగా, నేను ప్రయాణిస్తున్న కారు, ఎందువల్లో... రోడ్డు మీదనుండి పక్కనున్న పొదల్లోకి దూసుకుపోయి, అక్కడున్న ఒక పెద్ద చెట్టుకు గుద్దుకుని, అక్కడికక్కడే నేను మరణించాను. అసలీ కల నాకెందుకు వచ్చిందో స్వామిని అడిగి తెలుసుకుందామని వెళుతున్నాను.”  చెప్పాడు.

అతను పలుకుతున్న ఒక్కోమాట... జనార్ధన్ చెవినుండి మెదడులోకి ప్రవహించినట్లనిపించింది. ఆశ్చర్యంతో భయంతో కళ్ళు పెద్దవయ్యాయి. తలతిప్పి పక్కకు చూసాడు. రాత్రి... సరిగ్గా తనకూ అదే కల! ఆ కలలో... కారు యాక్సిడెంట్ అయి, తనే మరణించినట్లు. ఎందుకు ఆ కల వచ్చిందో తెలుసుకోవడానికే, తనిలా అర్జంటుగా బయలుదేరి వచ్చాడు. ఇంతలో... “సార్....సార్... ముందుకు చూడండి...” ఆ అపరిచితుడు కంగారుగా అరవడం, జనార్ధన్ చూసేలోపే, కారు రోడ్డు మీదనుండి పక్కనున్న పొదల్లోకి దూసుకుపోయి, అక్కడున్న ఒక పెద్ద చెట్టుకు గుద్దుకుని, ఆ తాకిడికి కారు బోనెట్ పైకి లేచింది. ముందు భాగమంతా లోపలికి డోక్కుపోయింది. ఆ వేగానికి కారు డోర్ ఒపెన్ అయి జనార్ధన్ బయటకు నెట్టివేయబడ్డాడు.

“మైగాడ్... ఎంత ప్రమాదం తప్పింది...? కార్ డోర్ ఓపెన్ అయి ఉండకపోతే, తను కారులోనే నుజ్జునుజ్జు అయిపోయి ఉండేవాడు.” ఊపిరి పీల్చుకున్నాడు జనార్ధన్.

ఆ అపరిచిత వ్యక్తి కోసం చుట్టూ చూసాడు. అతడు ఎక్కడా కనబడలేదు. భయంతో కారుదిగి పారిపోయి ఉంటాడు అనుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. అప్పుడు స్పురించింది అతడికి... రాత్రి తనకు వచ్చిన కల ఫలించలేదు. అంటే... తనకు ప్రాణగండం తప్పిందన్నమాట. సంతోషం కలిగింది. గబగబా... రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వామి ఆశ్రమానికి పరుగెత్తాడు.

ఆశ్రమమంతా... హడావుడిగా ఉంది. ఏదో శాంతి క్రతువు చేస్తున్నట్లు, అందరూ ఉరుకులూ పరుగులూ పెడుతున్నారు. తమ పనిలో తాము నిమగ్నమై ఉన్నట్లు, తనని ఎవరూ పట్టించుకోవడం లేదు.

“లోపల స్వామివారు ఉన్నారా...?” ఒక శిష్యుడికి ఎదురెళ్ళి అడిగాడు జనార్ధన్. అతను కనీసం ఇతనివైపు అయినా చూడకుండా వెళ్ళిపోయాడు.

“ఏమిటీ హడావుడి...? ఇప్పుడు స్వామిని కలవవచ్చా...?” మరో శిష్యుడిని అడిగాడు. అతడు కూడా... జనార్ధన్ ని పట్టించుకోకుండా వెళ్లిపోతున్నాడు. స్వామి ఉండే హాలు ప్రధాన ద్వారం దగ్గరకు వెళ్ళాడు. అతడిని ఎవరూ ఆపలేదు. లోపలికి అడుగుపెట్టాడు. హాలు అంతా ప్రశాంతంగా ఉంది. స్వామి ఒక్కరే ఉన్నారు. ఏదో ధ్యానంలో ఉన్నారు.

“స్వామి...”  అంటూ అతని ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు. స్వామి కళ్ళు తెరచి చూసాడు. చిరునవ్వుతో, “వచ్చావా...?” అనడిగాడు. ఆశ్చర్యపోయాడు జనార్ధన్. తను వస్తున్నట్లు స్వామికి ముందే తెలుసా...?

“నువ్వు మొదటిసారి వచ్చినపుడు, నేచెప్పినది ఇదే నాయనా... మరణం అనివార్యం. దాన్ని ఎవరూ ఆపలేరు. ఆయువు తీరిన ప్రతి జీవి... ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే...!” చెప్పాడు స్వామి.

జనార్ధన్ గబగబా చెప్పాడు. “కానీ, స్వామీ...!” ఏదో చెప్పబోయేలోపు... “నాతో రా...” స్వామి బయటకు నడిచాడు. అతడిని అనుసరించాడు జనార్ధన్. ఇద్దరూ కొంతదూరం ప్రయాణించి, జనార్ధన్ కారు యాక్సిడెంట్ చేసిన ప్రదేశాన్ని చేరుకున్నారు. అప్పుడు చూసాడు జనార్ధన్. కారులో స్టీరింగ్ పై తలవాల్చి పడి ఉన్న తన శవాన్ని.

“అంటే... అంటే... తను మరణించాడా...? అయితే, తనతో కారులో అపరిచితుడి రూపంలో ప్రయాణించింది... మృత్యువా...??” తలపట్టుకుని నిస్సత్తువగా క్రింద కూర్చుండి పోయాడు.

***********************

 

 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు