ఎందుకనో?
కొవ్వొత్తిలాంటి అమ్మని
కడదాకా వాడుకుంటున్నామే తప్ప,
వెన్నలాంటి అమ్మగుండె
వేడెక్కి మరుగుతోందని కానీ,
కరుగుతున్న అమ్మశక్తి తరుగుతోందని కానీ,
అమ్మ క్రమక్రమంగా అశాంతిలోయలోకి
ఒరుగుతోందని కానీ,
అమ్మ జీవితంలోని కాంతి చెరుగుతోందని కానీ,
మనం ఎన్నడూ గ్రహించనే లేదు.
సాధ్యమైనంతవరకూ అమ్మతో
సేవలు చేయించుకొంటూన్నామే కానీ,
ఆమెను సేవించటం గురించిన ఆలోచనే
మనకు ఎప్పుడూ రాలేదు.
అనుక్షణం ఆమె దీవెనలను పొందుతున్నామే కానీ,
ప్రతిక్షణం ఆమెను దహిస్తున్న వేదనల గురించి కానీ,
ఆమెను హింసిస్తున్న వాదనల గురించి కానీ,
ఆమె సహిస్తున్న శోధనల గురించి కానీ,
ఆమె మనసు మౌనంగా చేస్తున్న రోదనల గురించి కానీ,
ఆలోచనే మనకు ఎన్నడూ తట్టలేదు.
అమ్మని ఏ విధానంలోనైనా వాడుకున్నామే తప్ప
ఎన్నడూ వేడుకోలేదు,
అమ్మని ఏ విషయంలోనైనా ఆజ్ఞాపించామే తప్ప
అర్ధించనేలేదు,
అమ్మ మాటల్లో అపార్ధాలను వీక్షించి,
అనర్ధాలను సృష్టించామే తప్ప,
పరమార్ధాన్నెప్పుడు పరికించనేలేదు.
అమ్మంటే మన దృష్టిలో ఆషామాషీ!
ప్రతిఫలం ఆశించని ఒక పనిమనిషి!
అమ్మ విషయంలో
అనాదిగా మరి ఎందుకో ఇది ఇంతే!
ఎవరికీ అంతుపట్టని ఒక వింతే!
కానీ, ఇది ముమ్మాటికీ వదలని ఒక చింతే!
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.
**********
మార్గదర్శి
అతడివేలు పట్టి నడుస్తుంటే
దారంతా బాల్యజ్ఞాపకాల
వసంతాలను పూయిస్తాడు
చిరునవ్వుల విత్తులతో
ఊరంతా అభిమానాలపంటను
పండిచే రైతునుచేస్తాడు
చెరువుగట్టులతో మామిడి చెట్టులతో
స్నేహానికి ఊపిరిపోస్తాడు
వెన్నెలరాతిరిలో నులకమంచంపై
కథల ఊయలలో ఓలలాడిస్తాడు
విక్రమార్కభేతాళులతో నిశీధిలో పయనించేస్తూ
వికటకవితో వికటాట్టహాసం చేయిస్తాడు
జామచెట్టుకు నీరునుపోస్తూ
ఎగిరిగెంతే ఉడుతపిల్లతో కబుర్లుచెబుతాడు
గులాబీ మొక్కకు పాదునుచేస్తూ
గుమ్మడికాయ వడియాలగురించి నోరూరించేస్తాడు
ఇంతలో పెద్ద మనిషయిపోయి సుద్దులుచెబ్తూ
తాతనునేనంటూ గుర్తుచేస్తాడు
మళ్ళీ ఆటలాడే సమయంలో
మాలో ఒకడైపోతూ మర్రిచెట్టునీడలో
తామాడిన ఆటల జ్ఞాపకాలను నెమరేసుకుంటాడు
లేగదూడల కన్నుల్లోని నిర్మలత్వాన్ని
మనసునిండా నింపేస్తూ
తాతకు తగ్గ మనమలంటూ
ఊరంతా బుగ్గలు పుణుకుతుంటే
కొండంతగర్వాన్ని మోములో దాచేస్తాడు
మంచెచెడుల వ్యత్యాసాన్ని
అనుభవపాఠమై రుచిచూపిస్తాడు
పాతవాసనల గొప్పదనాన్ని
ఆవకాయపచ్చడంత ఘాటుగా
జీవితపుస్తకంలో లిఖించేస్తాడు
.త్రివేణి
**********
ఎవరు?
కలువల కనులతో,
చిలిపి చూపులతో
నా మది నదిలో
వలపుల ఆశల అలలు
రేపినదెవరు?
అరనవ్వుల అందచందాలతో,
కదిలే కారుమబ్బుల కురులతో
విరబూసిన వలపుల విరులతో
నా మనసు మన్మధుని దోచినదెవరు? వలచినదెవరు?
సిరిమల్లెల ముగ్గుల సిగ్గులతో,
గులాబీ మొగ్గల బుగ్గలతో
నా హృదయ కోటలో ప్రేమ పాగా వేసినదెవరు?
ఉల్లాసపు వలపుల ఊసులతో
నా హృదయానికి ఊపిరి పోసినదెవరు?
పవిత్ర ప్రేమ పలుకులతో,
వలపుల వాన చినుకుల కులుకులతో
నా హృదయపు వీణను మీటినదెవరు?
ప్రేమవిందులు చేసినదెవరు?
-గద్వాలసోమన్న
**********
గా ఒక్కడూ..మాలో ఒక్కడు..
లీడరంటే యెవరు
జనాలను ఎంటేసుకు తిరిగేటోడా?
అయినదానికి..కానిదానికి లొల్లిపెట్టెటోడా?
దీపం ఉండగనే..అన్నీ సక్కబెట్టుకునేటోడా?
గా రోజులు పొయినయ్
గిప్పుడు లీడరంటే జనం సమస్యలను
అర్థంచేసుకోవాల
ముచ్చట్లు చెప్పి మురిపించుడు కాదు
మనల్ను ముందుకు నడిపించాల
చెరువులు తవ్వించాల
రైతులకు తెర్వు చుపించాల
పెన్షన్లివ్వాల.. వృద్ధుల ముఖంలో
నవ్వులు సూడాల
కరెంట్ కష్టాలు గట్టెక్కించి
ఇంటింటా వెలుగు పూలు పూయించాల
పిల్లల్ను బడిబాట పట్టించాల
బతుకమ్మలు..ఆడబిడ్డలు కన్నీరెట్టకుండా
అన్ని విధాల ఆదుకోవాల
పిరమైన వైద్యాన్ని
పేదల ముంగింట్లోకి తేవాల
రెండు గదుల వెచ్చని గూళ్లివ్వాల
ఇంటింటికి గంగను రప్పించాల
పథకాలతో సాయమందించి
పేదలను పైకి తీస్కరావాల
దేవుళ్లకు సేవ చేస్కుంట..యాగాలు చేస్త
రాష్ట్రాన్ని రక్షించమని మనందరి తరఫునా వేడుకోవాల
పదవుల మత్తులో మనల్ని మరచెటోడు కాదు
మన నాల్కలపై కొలువు దీరెటోడే లీడర్
గసుమంటి నాయకుడు
ఎప్పుడో ఒకసారి అవతరిస్తడు
దశాబ్దాలనుంచీ పేరుకున్న చెత్తను తుడిచి
అంత బాగుచేస్తడు
గిన్ని మాటలెందుకు?
ఎన్ని సమస్యలున్న..గా ఒక్కడూ సమాధానమై నిలుస్తడు
మనం ఎనకుండి..ఆయన బలమైతే సాలు
మన బతుకు బంగారం చేస్తడు!
మన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసి తీర్తడు!!
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు
*********
వారం వారం కవితల శీర్షికను ఆదరిస్తున్న పాఠకులకూ, పాల్గొంటున్న కవులూ-కవయిత్రులకూ కృతజ్ఞతలు...వచ్చేవారం నుంచి కొత్తరూపు సంతరించుకోబోతోంది....అదెలాగంటే, ఇప్పటిదాకా ప్రతివారం వేర్వేరు కవుల కవితలు ప్రచురిస్తున్న స్థానంలో ఇకపై ఒకరివే మూడు నాలుగు కవితలు ప్రచురించడం జరుగుతుంది....పరిశీలనకు తమ కవితలను పంపేవారు నాలుగైదు కవితలు తమ ఫోటో ఒకటి జతపరచి పంపవలసింది...అందులోంచి ఎంపిక చేయబడిన వాటిని ప్రచురిస్తాం...అంటే, ఇకపై ఒక్కోవారం ఒక్కొక్కరికి ఈ శీర్షిక కేటాయించ బడుతుందన్నమాట...మరింకెందుకాలస్యం....పంపిస్తారు కదూ.... -సంపాదకవర్గం