ఏరియల్‌ యోగా' బంచిక్‌ చెయ్‌ బాగా..! - ..

Ariel yoga

'బంచిక్‌ బంచిక్‌ చెయ్‌ బాగా, ఒంటికి యోగా మంచిదేగా..' అంటూ అప్పుడెప్పుడో రమ్యకృష్ణ నటించిన పాట గుర్తింది కదా. ఆ పాటలో రమ్యకృష్ణ చాలా చాలా విన్యాసాలు చేసేసింది. ఆ సంగతి అటుంచితే, ఎవరు చెప్పినా ఎలా చెప్పినా యోగా మంచిదే. వాస్తవానికి యోగా మన పూర్వీకుల నుండీ వారసత్వంగా వస్తున్న అపురూపమైన సంపద. ఆ అపురూప సంపదే మనం ప్రపంచానికిచ్చిన అద్భుతమైన బహుమతి. దురదృష్టవశాత్తూ దాన్ని మనం సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నాం. యోగా అంటే ఏదో మ్యాట్‌ వేసుకుని ఒక్కచోటే కూర్చొని చేసే విన్యాసం ఏమాత్రం కానే కాదు. యోగా అనేది ఎలాగైనా చేయొచ్చు. తాజాగా 'ఏరియల్‌ యోగా' అనే పేరుతో ఓ సరికొత్త యోగా ప్రక్రియని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది నేటి యువత.

పేరు కొత్తగుంది కదా.. అని ఇదేదో పెద్ద కష్టమైన ప్రక్రియ అనుకునేరు. చిన్నప్పుడు చెట్లకూ, ఇంటి దూలాలకు చీరలు కట్టి పిల్లలు ఆడుకున్న ఉయ్యాలాటే ఈ ఏరియల్‌ యోగా. అయితే కొత్తగా దీనికి పేరు పెట్టారంతే. అసలింతకీ 'ఏరియల్‌ యోగా' అంటే ఏంటీ.? ప్రతీ ఇంట్లోనూ సీలింగ్‌ ఉంటుంది. ఆ సీలింగ్‌కి ఓ హుక్‌ ఉంటుంది. ఆ హుక్‌కి ఓ బలమైన క్లాత్‌ వేలాడదీస్తే, మన ఈ కొత్త యోగాకి ప్రోపర్టీ రెడీ అయిపోయినట్లే. వేలు ఖర్చుపెట్టాల్సిన పని లేదు కదా. అలాగే దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదండోయ్‌. చిన్నప్పుడు మనమాడిన ఉయ్యాలాటల్నే కొంచెం అటూ ఇటూ తిప్పి వాడితే చాలన్నమాట. భలేగుంది కదా. కష్టపడి ఫిట్‌నెస్‌ సెంటర్స్‌కి వెళ్లవసరం లేకుండా ఎంచక్కా ఇంట్లోనే ఖర్చు లేకుండా యోగా చేసెయ్యొచ్చన్నమాట.

దీంట్లో బోలెడన్ని రకాల విన్యాసాలున్నాయండోయ్‌. వాటికీ పేర్లున్నాయ్‌. ఏరియల్‌ లిఫ్ట్‌, ఏరియల్‌ బ్యాలెన్స్‌, ఏరియల్‌ హ్యాండ్‌ స్టాండ్‌, ఏరియల్‌ ఏరోబిక్‌.. ఇలా చాలా రకాలున్నాయన్నమాట. అయితే వీటి కోసం కూడా మనమేమీ గూగుల్‌ తల్లినడగక్కర్లేదు. ఓసారి ఫ్లాష్‌బ్యాక్‌కెళ్లినా సరిపోతుంది. అయితే ఈ తరం వారికి పల్లెటూరి ఫ్లాష్‌ బ్యాక్స్‌ లేవు కాబట్టి. ఓ సారి గూగుల్‌ తల్లిని తలిస్తే చాలు. ఎంచక్కా సూర్యనమస్కారాలు కూడా ఈ ఏరియల్‌ యోగాలో చేసేయొచ్చు.

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఈ ఏరియల్‌ యోగాని ప్రమోట్‌ చేస్తోంది. దానికి యంగ్‌ తరంగ్‌ మెరుగులు దిద్దుతోంది. ఎక్కువగా అమ్మాయిలు ఈ ఏరియల్‌ యోగాపై ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. ప్రత్యేకంగా అమ్మాయిలు కోసం అన్నట్లుగానే ఈ ఏరియల్‌ యోగాని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. 15 ఏళ్ల బాలిక నుండీ, ఆరోగ్యం సహకరిస్తే, 50 ఏళ్ల వయసు వరకూ మహిళలు ఈ ఏరియల్‌ యోగాని ట్రై చేయొచ్చు. ప్రధానంగా 18 నుండి 30 ఏళ్ల వయసున్న మహిళా లోకం ఈ యోగా పట్ల ఆకర్షితులవుతున్నారు. ఈ వయసు వారికే ఈ యోగా వల్ల ఫలితాలు కూడా ఎక్కువనీ తెలుస్తోంది. జెమ్నాస్టిక్స్‌, కరాటే, కుంగ్‌ఫూలోని కొన్ని ముద్రలు ఈ ఏరియల్‌ యోగాలో కనిపిస్తాయి. డాన్సుల్లో కనిపించే విన్యాసాల్ని ఇందులో చూడొచ్చు. బ్యాక్‌పెయిన్‌, మెడ నొప్పులే కాకుండా, ఇతరత్రా లేడీస్‌ సమస్యలకు ఈ ఏరియల్‌ యోగా ఉపయోగకరంగా ఉంటోందట. అయితే వైద్య సలహాలు, నిపుణుల పర్యవేక్షణ కంపల్సరీ. ఈ సూచనలు, సలహాలతో ఏరియల్‌ యోగాని ఫాలో చేస్తే, జీరో బడ్జెట్‌తో, 'సైజ్‌జీరో' పొందడం ఖాయం. 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు