సినీ పరిశ్రమలో పలువురు గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను సినిమాలుగా వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. అవి నేటి యువతకు ఆదర్శంగా మారుతున్నాయి. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను యువత ఆదర్శంగా తీసుకోవడమే కాకుండా, చరిత్రలో తమకు తెలియని ఆయా వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం కలుగుతోంది. క్రికెటర్ ధోనీ బయోపిక్ చూశాం. మేరికోమ్ బయోపిక్, అలాగే మహానటి సావిత్రి బయోపిక్ ఇలా చాలా మంది ప్రముఖుల బయోపిక్స్ గురించి తెలుసుకున్నాం. అసలు బయోపిక్ అంటే ఏంటీ.? వచ్చినవన్నీ నిజమైన బయోపిక్సేనా.? సంజయ్‌దత్ బయోపిక్‌నే తీసుకుంటే సంజయ్ దత్ పాత్రలో ఒదిగిపోయేందుకు రణ్‌బీర్ కపూర్ పడ్డ కష్టం గురించి మాట్లాడుకోవడం తప్ప ఆయన జీవితం గురించి తెలుసుకోవడానికి స్పూర్తి పొందడానికి ఏమీ కన్పించదు. దాన్నొక కమర్షియల్ సినిమాగా తీర్చిదిద్దాలనే దర్శక, నిర్మాతల తపన మాత్రమే కనిపిస్తుంది ఆ సినిమాలో. వాస్తవాల్ని పక్కన పెట్టి తమకు కావల్సిన విధంగానే హీరో పాత్రని చూపించారు ఆ సినిమా డైరెక్టర్.
ఇదిలా ఉంటే, మేరీకోమ్ జీవితాన్ని మాత్రం యథాతథంగా దించేశారు. త్వరలో సైనా నెహ్వాల్ బయోపిక్ రాబోతోంది. గోపీచంద్ బయోపిక్‌కి రంగం సిద్ధమవుతోంది. తెలుగులో ఘన విజయం సాధించిన 'మహానటి' గురించి మాట్లాడుకోవల్సి వస్తే, ఈ తరం ఆ సినిమాని బాగానే ఆదరించింది. దర్శక, నిర్మాతల కష్టం, సావిత్రి పాత్రలో కీర్తిసురేష్ ఒదిగిపోయిన వైనం ఇవన్నీ నేటి తరాన్ని మెప్పించాయి. సావిత్రి జీవితంలో వివాదాస్పదం అనుకున్న కొన్ని సన్నివేశాల జోలికి దర్శక, నిర్మాతలు పోలేదు. అయినా సినిమాపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉంటే, ఇక్కడ మనం మాట్లాడుకున్న బయోపిక్స్ అన్నీ ఒకెత్తు.
ఎన్టీఆర్ బయోపిక్ ఇంకో ఎత్తు. రామాయణ, మహాభారతాల గురించి ఎలాగైతే ఎంతైనా మాట్లాడుకోగలమో ఎన్టీఆర్ జీవిత చరిత్ర కూడా అంతేనేమో. అతిశయోక్తి అనిపించినా ఇది నిజమేనేమో. నటుడిగా ఎన్టీఆర్ ఉన్నత శిఖరాల్ని అధిరోహించడం ఓ ఎత్తు, రాజకీయ రంగంలోకి రావడం ఇంకో ఎత్తు, ఆ రంగంలో రాణించడం ఇంకో ఎత్తు. చివరి రోజులు మరో ఎత్తు. ముఖ్యమైన ఘట్టాలు ఎన్టీఆర్ జీవితంలో చాలా ఉన్నాయి. దేన్ని విస్మరించినా, ఎన్టీఆర్ బయోపిక్ సంపూర్ణం అవదు.
నేటి తరం తెలుసుకోవల్సిన విషయాలు ఎన్టీఆర్ జీవితంలో చాలా ఉన్నాయి. అందుకే ఈ బయోపిక్‌పై అంత ఆశక్తి. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలొస్తున్నాయి. అయితే దీంట్లో ఎన్టీఆర్ పతనం కనిపించకపోవచ్చు. ఆ లోటును 'లక్ష్మీస్ ఎన్టీఆర్' భర్తీ చేయబోతోంది. సినీ రంగంలో ఆటుపోట్లును ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డ ఎన్టీఆర్, రాజకీయ జీవితంలో మాత్రం అయిన వారి వెన్నుపోటుకు బలైపోయారు. ఆ పాయింట్‌నే 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో వర్మ చూపించబోతున్నారు. దీంతో ఈ సినిమాపై కొన్ని వివాదాలు నడుస్తున్నాయి. వాస్తవం - వివాదాస్పదం ఈ అంశాల చుట్టూ జరుగుతున్న రచ్చ నేటి యువతకు ఈ సినిమాపై ఆశక్తి పెరిగేలా చేస్తోంది. మరోపక్క 'యాత్ర' పేరుతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కూడా సినిమాగా రాబోతోంది.
రాజకీయంతో మనకి పనేంటి.? అని అనుకోవడం లేదు నేటి యువత. తాజా రాజకీయ పరిస్థితులపై అంచనాలు వేస్తూ, విశ్లేషిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అనేక అంశాలపై చర్చించుకుంటోన్న కుర్రకారు ఎన్టీఆర్ బయోపిక్ గురించి కూడా ఆశక్తిగా చర్చించుకోవడం జరుగుతోంది. మహనీయులు జీవితాల్లోని తెలియని కోణాల్ని తెలుసుకోవడం ద్వారా వాస్తవ పరిస్థితుల్ని అంచనా వేయడం, తద్వారా విశ్లేషణా శక్తిని పెంచుకోవడం, మెరుగైన సమాజం కోసం తమ వంతుగా కృషి చేయడం ఇదంతా నేటి యువత బాధ్యతగా భావించాలి. అందుకు ప్రముఖ రాజకీయ నాయకుల బయోపిక్స్ ఉపకరిస్తాయి. అయితే ఆ బయోపిక్స్ వాస్తవాల్ని వక్రీకరించేలా ఉంటే మాత్రం ప్రయోజనం ఉండదు.