1. పూల సందేశం
నిను చూసిన
మొదటి రోజు
ఈ గులాబీమొక్క
మొగ్గ తొడిగింది !
ప్రతిరోజొక వసంతమై
నీ పై ప్రేమ నాలో
కొత్త చివురులు
తొడుగుతుంటే !
గులాబీ మొక్క
రోజుకొక రేకు విచ్చి
విరగబూసి నాకు
కన్ను గీటింది !
తుంచుదామని
చేయివేస్తే
వేలికి గుచ్చుకుని
గులాబీ ముల్లు వారించింది !
గులాబీ పువ్వు సందేశమేమో ?
నినుచేరాలంటే
పూలు కాదు
నిజమైన ప్రేమ కావాలని !
***********
2 .నాలోకి నేను
నాలోకి నేను ప్రయాణిస్తున్నా
నిరంతరం రగిలే
అంతరంగ
భాషాకిరణాల వెలుగుకోసం
నాలోకి నేను ప్రవహిస్తున్నా
జలపాతమైదూకే
భావావేశ
కవన సాగరాల కోసం
నాలోకి నేను ఒంపుకుంటున్నా
జ్ఞానదివ్వెల
అఖండ జ్యోతులుజేసే
అక్షరాల చమురు కోసం
నాలోకి నేను ఇంకిపోతున్నా
మనసుపొరల్లో
కావ్యవనాల
అమరత్వం కోసం
***********
3. మాయాదర్పణం
బంధాలు తెంపుకుందామని
నిన్న అటక మీదనుండి
కిందికి దిగింది
అది నాతోపాటే ప్రయాణిస్తున్న
జ్ఞాపకాల ఖజానా
నేనెళ్ళిన ఊరికల్లా
నా వేలు పట్టుకుని నడిచే
అర్థాంగి
విడిచిన వలువల
చెమట కంపుని
మోసే నా మరో తనువు
గడియారాన్ని కాలికి
కట్టుకుని
కాలం వెంట పరుగెత్తే
గతకాలపు కథల
మాయాదర్పణం
ఇంటి గడప దాటి
సర్కారు బడి వసతి గదిలో
తలాపునే పడుకుని
నన్ను మోసింది మొదలు
ఇంటి గడపలు
మనుషుల నడుమ బంధాలు
మాయమైన అద్దాల భవనంలో
నా పడకగది అటకమీదికి
చేరేదాక
నన్ను తెలిసిన
నాకు తెలియని
నా జీవితానికి సాక్షి
మా అమ్మ నాకిచ్చిన
ఈ సందుగు !!
***********
4.పచ్చబొట్టు
నీ మీద నాకున్నది
ప్రెమే అంటే
చిన్న మాటే అవుతుంది
రోజులు
వారాలు
నెలలు
వసంతాలు గడచిపోయాయి
మనసు భారమైనపుడు
నిన్ను చూస్తాను
బాధలన్నీ దూదిపింజలౌతాయి
ఆనందంలో
నిన్ను తలుస్తాను
ద్విగునీకృతమైన ఉత్సాహం
నాలో ఆయువౌతుంది
ప్రతి అడుగులో
నీ తలపే నన్ను
విజయద్వారాలు తాకిస్తుంది
నేననే పుస్తకంలో
ప్రతిపేజి నీదే
పచ్చబొట్టై ముఖచిత్రంగా
నిలిచిపోతావని
నిన్నాహ్వానిస్తూ నేను!
***********
5."సిరిసిరిమువ్వ"
సిరిసిరి నగవులు
మోమున విరయగ
సరిగమపదనిలు
కాలి మువ్వల మొగగ
గలగల సెలయేరులు
త్వరపడి పరుగిడి
గబగబ అందెల
తడుముతు మురవగ
జల జలపాతము
నగవుల సొగసుకి
తుంపర తెంపరలై
బుగ్గన దిగ్గున వాలగ
బంగారు మేని
శృంగారమొలకెను
మువ్వల సవ్వడి
ముత్యాలు రాల్చెను
వి . నాగ్రాజ్