సాధారణంగా, ఓ వస్తువవనీయండి, ఓ అవయవమవనీయండి, అంతదాకా ఎందుకూ ఓ నిర్మాణమవనీయండి, ఉపయోగించకుండా చాలా కాలం మూలన పడేస్తే, అది కాస్తా సమయానికి పనికిరాకుండా పోవడం తథ్యం.. ఏదో మార్కెట్ లోకి కొత్తగా వచ్చిందనో, లేక రోజూ 24 గంటలూ మనల్ని హింసించే వ్యాపార ప్రకటనలు చూసో , వెంటనే దగ్గరలో ఉండే Mall కి వెళ్ళి, మన పక్కింటివాడు కొనేలోపల కొనేసుకోవడం. ఎవరైనా మనింటికి వచ్చి దాన్ని చూసి, “ అర్రే అప్పుడే మీ ఇంట్లోకి వచ్చేసిందా ఏమిటీ..” అనగానే, ఓసారి కాలరెత్తుకోవడం చూస్తూంటాం… కొనడంలో ఉండే ఉత్సాహం, దాన్ని ఉపయోగించడంలో ఉండదు. ఉదాహరణకి Exhibitions లో ఏవేవో అమ్ముతూంటారు.. కూరలు అందంగా చక్రాల్లా cut చేసేవీ, అవేవో chips లా చేసేవీ లాటివి… ఏదో హొటళ్ళలో అయితే ఉపయోగం కానీ, మొగుడూ పెళ్ళాం, ఓ ఇద్దరు పిల్లలూ ఉండే ఇంట్లో అంత అవసరమంటారా? అలాగని వీళ్ళింటికి ప్రతీవారం అతుథులేమైనా వస్తారా అంటే అదీ లేదూ. అలాటప్పుడు హాయిగా ఏ కత్తిపీటతోనో కోసుకోక, తినే ఆ నాలుగు కూరముక్కలకీ designs ఎందుకుట? ఏదో పిల్లలు సరదాపడి ఆ వస్తువు తెచ్చిన ఓ వారంరోజులు , తరిగిపెడతారు. పైగా వాటిని శుభ్రపరచడం ఓ పెద్ద పనాయె. అలాగని పనిమనిషికీ ఇవ్వలేరు, విరక్కొడుతుందేమో అని.. చివరకి షెల్ఫ్ లోకి వెళ్ళిపోతుంది.
అలాగే Mall లో కొత్తగా కనిపిస్తూన్న ఏ హెల్త్ ఫుడ్డో, హెల్త్ డ్రింకో , పిల్లలపేరుచెప్పి కొనేయడం.. వాడీదీ లేదూ పెట్టేదీ లేదూ. షెల్ఫ్ లోనో, ఫ్రిజ్ లోనో , అందరికీ కనిపించేలా పెట్టుకోడానికి మాత్రమే.. పైగా ఇంటికెవరైనా పిల్లలతో అతిథులు వస్తే, వాళ్ళకి బలవంతంగా తాగించడం, హెల్త్ పేరుచెప్పి… ఎవరూ తాగకపోతే, దాని Expiry Date దాటిపోగానే చెత్తబుట్టలో పడేసి చేతులు దులుపుకోవడం. అలాగే మందులు కూడా—ఏదో అనారోగ్యం వచ్చిందని డాక్టరు రాసిన మందులు కొనడం, పైగా అవసరమైనవాటికంటే కొంచం ఎక్కువగానే రాస్తాడు డాక్టరుగారు, మరి ఆ మందులకంపెనీకి విశ్వాసపాత్రుడు కూడానూ.. మందులు మంచివే, కానీ అన్ని కొనక్కర్లేదు. ఏవో మరీ దీర్ఘకాలిక రోగాలు తప్పించి, సాధారణ జలుబూ, దగ్గూ లాటివి ఓ రెండుమూడురోజుల్లో తగ్గేవే, కానీ ఆ మందులెవరేసుకుంటారూ, ఓ ప్లాస్టిక్ డబ్బా నిండా ప్రతీ ఇంట్లోనూ unused medicines తప్పకుండా ఉంటాయి. పైగా ఈ మందులు ఇంకోరికివ్వలేముకూడానూ, ఆమందు వేసుకుని ప్రాణం మీదకు తెచ్చుకుంటే, మళ్ళీ అదో గోలా..
అలాగే కొంతమందికి ఇళ్ళూ స్థలాలూ కొనడం ఓ పెద్ద hobby. ఎప్పుడో కొన్ని సంవత్సరాలకి కొన్నదానికి మూడింతలు వస్తుందని ఎవరో చెప్పగా విని, అప్పుచేసైనా సరే కొనేయడం. నిజమే వస్తుందండీ.. కానీ ఎప్పుడూ, ఆ చుట్టుపక్కల ఇంకా కొన్ని స్తలాలు అమ్ముడవాలి, ఆ ప్రాంతమంతా అభివృధ్ధి చెందాలి.. ఇంత హడావిడి. చేతిలో డబ్బులెక్కువఉంటే కొనడంలో అర్ధముంది, కానీ వడ్డీమీద అప్పుచేసి కొనుక్కోవడం అర్ధంకాదు. ఓ పాతిక లక్షలు పెట్టికొన్నాడనుకుందాం, కట్టే వడ్డీ జోడించి, అప్పుతీరేసరికి ఓ ఇరవైఏళ్ళలో , ఓ యాభైలక్షలదాకా తేలుతుంది. అప్పుడు అమ్మినప్పుడు 50 లక్షలు వస్తే ఎంత రాకపోతే ఎంత? అలాగే ఏదో సొసైటీలో ఎపార్ట్మెంటేదో చవకలో వస్తోందని కొనేసి, తాళంపెట్టేయడం. పోనీ అద్దెకిస్తారా అబ్బే, ఆ వచ్చినవాళ్ళు దాన్ని తగలేస్తే.. ? చివరకి ఏమౌతుందంటే బూజుకొట్టుకుపోతుంది. ఓ పదేళ్ళ తరవాత అమ్మాలని ప్రయత్నించినప్పుడు, ఆ ఇంటి, floor tiles నుండి, ప్రతీదీ మార్పిస్తేనేకానీ, అమ్ముడవదు… అయినా సరే investment పేరిట కొనడమూ మానరు… ఏదైనా అవసరం వచ్చినప్పుడు అమ్మొచ్చని కొన్నామూ అని ఓ సమర్ధింపు… నిజంగా అలాటి అవసరం వచ్చినప్పుడు ఛస్తే అమ్ముడవదు.
అవసరానికి కొనడం వరకూ బాగానే ఉంటుంది. కానీ సమయానికి సద్వినియోగంకూడా చేసుకుంటేనే, దాని విలువ ఉంటుంది.. ఆబగా కొనేయడం కాదు…
సర్వేజనా సుఖినోభవంతూ…