ఈ రోజుల్లో ఎక్కడ చూసినా commercial ads తో హోరెత్తించేస్తున్నారు. టీవీ ల్లో కూడా ప్రత్యేక చానెళ్ళు ప్రారంభించేశారు… అయినా సరే, వార్తలు, సినిమాలూ, చివరకి ప్రవచనాల కార్యక్రమాల్లో కూడా, ఈ వ్యాపార ప్రకటనల దాడి లేకుండా చూడలేము. ఒకానొకప్పుడు ఈ వ్యాపార ప్రకటనలకి కొన్ని ethics అనండి, లేదా restrictions అనేవి ఉండేవి. ఉదాహరణకి .. ఓ కార్యక్రమాన్ని ఏదో ఫలానా కంపెనీ sponsor చేస్తున్నప్పుడు, అలాటి products గురించి మరోcompetitive కంపెనీ వారి ప్రకటనలుండేవి కావు. కానీ ఇప్పుడంతా దానికి విరుధ్ధం.. ఒకే రకమైన product గురించి, నాలుగైదు కంపెనీల ప్రకటనలు గుప్పించేస్తున్నారు. అది ఓ కాలినెప్పి మందనండి, లేక ఏ పూజాద్రవ్యాల సామగ్రనండి, చివరాఖరికి బియ్యం, మినప్పప్పనండి, ప్రతీదానికీ, రెండు మూడు వివిధ కంపెనీల ప్రకటనలు. అలాగే Real Estate, Detergents, Health Drinks దేన్నీ వదలకుండా, ఒకే చానెల్ లో అంతా గందరగోళం చేసేస్తున్నారు. మధ్యలో ఎవడో వచ్చి ఫలానా చెప్పులంటాడు.. చూసేవాళ్ళని confuse చేసేస్తున్నారు… ఏ కంపెనీ product వాడాలో తెలియక… అరగంట కార్యక్రమంలోనూ 10 నిముషాలు వీళ్ళే తినేస్తున్నారు. పోనీ ఒక్కసారి చూపించి వదులుతారా అంటే అబ్బే, కనీసం 3 సార్లు భరించాలి… ఒప్పుకుంటాం.. ఈ ప్రకటనలే టీవీ చానెళ్ళకి జీవనాధారం.. కానీ మరీ ఇంతలా bombard చేసేయాలా? నిజంగా జరుగుతున్నదేమిటంటే, టీవీ ల్లో ఈ ప్రకటనల వెల్లువ భరించలేక, అసలు మార్కెట్ లో ఆ వస్తువు కొనడానికే ఎవరూ ముందుకు రారు. అందుకే ఈ మధ్యన సినిమాలు కూడా, టీవీ చానెల్స్ లో మానేసి, హాయిగా, ఎటువంటి ప్రకటనలూ లేని, ఏ Amazon, Netflix ల్లోనో చూస్తున్నారు.
ఇవికాకుండా రోడ్లపక్కనుండే భూతాల్లాటి Hoardings.. పోనీ అవేమైనా శుభ్హ్రంగా ఉంటాయా అంటే అదీలేదూ, ఏ అమ్మాయిదో సగంసగం బట్టలతో.. ఆ హోర్డింగ్ చూస్తూ ఏ కారో స్కూటరో నడుపుతూ. accidents చేయడం. ఆమధ్యన సుప్రీం కోర్టు వాటి ఎత్తూ, ఒడ్డూ, పొడుగూ లమీద ఏవో కొన్ని restrictions పెట్టారు కాబట్టి బతికిపోయాము.. అయినప్పటికీ కొంతమంది ఈ కోర్టు ఆర్డర్లని ఖాతరు చేయరు.. ఉదాహరణకి, ఆ మధ్యన పూణె లో, రైల్వే వారి ఓ పేద్ద బోర్డు, సడెన్ గా కూలిపోయి, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన వాహనదారులమీద పడి, పాపం ఓ అరడజనుమంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాటివికాకుండా, గాలీవానా లాటివి ఉధృతంగా వచ్చినప్పుడు, ఈ హోర్డింగ్స్ వల్ల వచ్చే ప్రమాదాలైతే చెప్పక్కర్లేదు.
ఇవి ఇలాఉండగా, కార్యక్రమాలు sponsor చేయడంకూడా వదలడంలేదు.. బిడ్డ బారసాలతో మొదలెట్టి, ఏ ప్రముఖుడిదో అంతిమయాత్రదాకా, ఎక్కడ చూసినా ప్రకటనలే… ఒక భాషలో తీసేయడమూ, ప్రాంతీయ భాషల్లోకి డబ్బింగు చేసి మనల్ని హింసించడమూనూ.. ఇవేళ అదేదో ad -HIV గురించి చూస్తూంటే నవ్వొచ్చింది. గర్భవతి ముందర పుట్టబోయే బిడ్డకి dress తో ప్రారంభించి, పళ్ళ దుకాణానికి వెళ్ళి, ముందర apples అడిగి, తరవాత Oranges చేతిలో పట్టుకుని, baby కి oranges ఇష్టం అంటుంది..OK fine.. వెంటనే … ” అందుకే హాస్పిటల్ కి వెళ్ళి HIV Test కూడా చేయించుకోవాలి..” అంటే దానర్ధం– oranges ఇష్టం కాబట్టి HIV Tests చేయించుకోవాలనా… నా మట్టి బుర్రకి అర్ధం అవలేదు..
ఈ సౌజన్య్ సే అంటే, మనవైపు టాక్సీలకీ, ఆటోలకీ వెనక్కాల రాస్తూంటారు పెద్దపెద్ద అక్షరాలతో ” ఫలానా బ్యాంకు వారి సౌజన్యం ” తో అని. అంటే అప్పుతీర్చే సదుద్దేశం లేదన్నమాటే కదా. ఆ బ్యాంకువాడేమైనా అప్పనంగా ఇచ్చాడా ఏమిటీ, ముక్కుపిండి వడ్డీతో సహా తీసికుంటాడు. ఈమాత్రం దానికి ఈ ” సౌజన్యాలూ, సింగినాదాలూ” ఎందుకంట? అలాగే అత్యోత్సాహానికి వెళ్ళి, ఎవడో తలమాసినవాడు, తన పిల్లకో, పిల్లాడికో బారసాల, పోనీ ఖర్చులైనా కలిసొస్తాయని. ఏ కంపెనీ వాడో sponsor చేస్తే, తాటికాయలంత అక్షరాలతో banners పెట్టుకుంటాడు.. ఫలానా పాప/ బాబు..ఫలానా కంపెనీవారి సౌజన్య్ సే .. అని. అంటే పాపం కష్టపడి కన్న ఆ తండ్రిని doubt చేసినట్టు కాదూ?…
సర్వే జనా సుఖినోభవంతూ…