సంక్రాంతి కవితలు - సుజాత.పి.వి.ఎల్

సంక్రాంతి సంబరాలు
 
రాను రాను
మనిషి మనసు మరీ ఇరుకైపోతోంది
బాహ్య బంధాలను తెంచుకొని
ఒంటరితనాల ఆనందాన్ని అనుభూతిస్తున్నాడు
మనిషి సంఘజీవి అన్నది
ఇంటర్ నెట్ మాటున ఒదిగిపోతోంది
తరతరాల నాటి సమస్యలు
ఇప్పటికీ చిక్కుముడులే 
ఓ పిల్ల పెళ్ళిచేయడం
ఓ ఉద్యోగం సంపాదించడం
కడుపునిండా తినడం
ఇవన్నీ కలలే !
రైతు రాజవకపోయినా
కనీసం సామాన్యుడిగా
బ్రతకలేకపోవడం
తీవ్రవాదుల నడుమ
శాంతి పావురం గజగజ వణికిపోవడం ...
ప్రభుత్వాలెన్ని మారినా ..
సామాన్యుడి బ్రతుకు
''ఎక్కడ వేసిన..'' చందమవడం
ఇవన్నీ స్పష్టమైన వాస్తవాలే !
మనిషి సంఘజీవనుడై
శాంతియుతంగా
ప్రశాంతంగా గడపగలిగినప్పుడు
అన్నీ సంక్రాంతులే ...
అన్ని చోట్లా సంబరాలే !
 
****************
 

మార్పు

నల్లటి తార్రోడ్లు తప్ప
పచ్చటి పంటల తివాచీ చూడలేదు
ఇంటి ముందు గచ్చేయించిన నేలలు తప్ప
కళ్లాపి జల్లి, ముగ్గులేసే మట్టి నేల చూడలేదు
ఏది కావాలన్న డబ్బెట్టి కొనుక్కోవడం తప్ప
ఆప్యాయంగా కొసరి కొసరి ఇచ్చుకోడాలు తెలియదు
నా ఇంట్లో నేను నావాళ్లూ తప్ప
అందరూ సమిష్టిగా ఉండడం చూళ్లేదు
కాస్త సమయం చిక్కితే సినిమా తప్ప
ఆప్యాయంగా పలకరిస్తూ ఊరంతా కలయ తిరగడం తెలియదు
ముంగిట్లో నాలుగు కోటన్స్ తప్ప
ఊరంతా పూల పళ్ల మొక్కలుండడం చూళ్లేదు
షేక్ హాండ్లతో విష్ చేయడం తప్ప
హరిదాసుల, గంగిరెద్దుల ఆశీర్వచనాలు తీసుకోలేదు
ఇప్పటిదాకా నేనున్నదో మర ప్రపంచం..నేనో మరమనిషిని
ఇక్కడి గాలి పీల్చి, మట్టి మీద అడుగెట్టాక మన్సులోని జీవం మొలకెత్తింది
ఇహ దానికిన్ని నీళ్లు పోయడమే తప్ప మోడు చేయను!


****************

శుభ సంక్రాంతి

 
వినూత్న కాంతులతో
విశ్వమంతా నేడు 
సంక్రాంతి సంబరాలతో నిండింది
సంబరాల సంరంభాన్ని
సరదాగా పంచుకునేందుకు
లక్షలాది ప్రజల కొరకు
సందడిగా సవ్వడి చేస్తూ
తెలతెలవారు జామునే
తలుపుతట్టి
ఊరినే మేల్కొలిపింది సంక్రాంతి లక్ష్మి
ముంగిళ్ల ముత్యాలముగ్గులు
ముగ్గుల్లో దాగిన రతనాల గొబ్బిళ్ళు
గొబ్బిళ్ళ కొప్పులో మురిసే
ముద్దు లొలుకు ముద్ద బంతులు
పచ్చని పైరులు పసిడి ధాన్యపు రాశులు
గంగిరెద్దు ఆటలు
బసవన్న ఆశీస్సులు
హరిదాసు కీర్తనలు సంక్రాంతి లక్ష్మికి
స్వాగతం పలుకగా
ప్రకృతి కాంత పరవశించింది
ప్రతి ఇంటా అడుగిడింది
తొలి నవ్య కాంతి
శుభ సంక్రాంతి ..!

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు