శుక్రగ్రహ స్థానం ( కంజానూరు )
కిందటి సంచికలో మనం గురుగ్రహం గురించి తెలుసుకున్నాం . యీ సంచికలో నవగ్రహాలలో ఆరవది , శుభగ్రహాలలో రెండవది గా చేప్పబడే శుక్రగ్రహం గురించి తెలుసుకుందాం .
సంస్కృతం లో శుక్ర అంటే నిర్మలమైన , స్వచ్చమైన , కాంతి వంతమైన అని అర్ధం . ఇతను తెల్లని శరీర కాంతిని కలిగి , వాహనం గా ఒంటె లేక గుఱ్ఱము లేక మొసలి గలిగిన వాడు , చేతులలో కర్ర , మాల , పద్మపుష్పం , విల్లు అంబులు ధరించువాడు అని చెప్పబడింది . వృషభ , తుల రాశులకు అధిపతి శుక్రుడు , మీన రాశిలో ఉఛ్ఛ లోను , కన్యా రాశిలో నీచం లోను ఉంటాడు . భరణి , పూర్వఫల్గుణి ( పుబ్బ ) , పుర్వాషాఢ నక్షత్రాలకు అధిపతి . బుధుడు , శని గ్రహాల తో మిత్రత్వం , సూర్యు , చంద్ర గ్రహాలతో శత్రుత్వం కలిగి వుంటాడు . శుక్ర గ్రహం అనుకూలంగావుంటే పదోన్నతులు , కళలు , వాహన సుఖం , అందమైన భార్య , అందమైన ఇల్లు , కీర్తి , పలుకుబడి , కార్య విజయం కలుగుతాయి . జాతక చక్రం లో. శుక్రగ్రహం అనుకూలం గా లేకపోతే కంటి బాధలు , మగతనం లేకపోవుట , భోజన సౌక్యం లేకపోవుట , చర్మవ్యాధులు కలుగుట , విడాకులు , వివాహం జరుగకపోవటం , మూత్రపిండాలలో రాళ్లు యేర్పడ్డం , గర్భ స్రావాలు జరగడం సంభవిస్తాయి .
శుక్రునికి యిష్ఠమైన రంగు తెలుపు లోహం వెండి , పువ్వు తెల్లకలువ , ధాన్యం బియ్యము , ఆహారం పెరుగు అన్నం , నవరత్నం వజ్రం , దిక్కు ఆగ్నేయం , తీర్ధమ్ అగ్నితీర్ధమ్ .
శుక్రుడు బృగు మహర్షి , కావ్యమాతలకు శ్రావణ శుద్ధ అష్ఠమి శుక్రవారము నాడు జన్మించేడు . ఆంగీరస మహర్షి వద్ద శాస్త్ర విద్యలు నేర్చుకొనేందుకు శిష్యరికం చేస్తాడు . ఆంగీరస మహర్షి తన పుత్రుడైన బృహస్పతి పై పక్ష పాతం వహిస్తునాడనే అనుమానం తో గౌతమ ముని వద్ద సర్వ శాస్త్రాలు నేర్చుకుంటాడు . పరమశివునికై తపస్సు చేసి అతనిని ప్రసన్నం చేసుకొని ' మృత సంజీవని ' పొందుతాడు . ప్రియవ్రతుని పుత్రి ఊర్జస్వాతిని వివాహమాడి దైత్యుల గురువై దేవదానవ యుద్ధం లో , మరణించిన దానవులను మృతసంజీవనీ విద్యతో పునః జీవితులను చేసేవాడు . ఆ కారణం గా దేవతల బలం తగ్గిపోవడంతో శివుడు శుక్రుని పై ఆగ్రహించి అతనిని మ్రింగి వేస్తాడు . శుక్రుడు శివుని పొట్టలోనుండి శివధ్యానం చేస్తూ వుంటాడు . పార్వతీ దేవి శుక్రుని మన్నించమని శివుని ప్రార్ధిస్తుంది . శివుడు పార్వతీ దేవి ప్రార్ధన మన్నించి శుక్రుని యీ కంజానూరు ప్రాంతం లో విడిచిపెడతాడు . పార్వతీ దేవి భక్తులకు యెల్లప్పుడూ శుక్రుడు అనుకూలముగా వుంటాడు
తమిళ నాడులోని తంజావూరు జిల్లాలో కంజానూరు లో యీ శుక్రస్థానం వుంది . చోళనాడులొ కావేరి ఉత్తర ప్రాంతం లో 36వ దేవరస్థానంగా యీ క్షేత్రాన్ని చెప్తారు .
కుంభకొణానికి 18 కిమీ , మైలదుత్తురై ( మాయవరం ) కి 18 కిమీ దూరం లో వుంది . సూర్యనార్ కొయిల్ కి 3 కిమీ దూరం లో వున్న ప్రశాంతమైన గ్రామం యీ కంజానూరు .
అయిదు అంతస్తుల రాజ గోపురం లోంచి వెళితే అగ్ని తీర్ధం కనిపిస్తుంది . ఇది కుడా శైవ నవగ్రహస్థానం కావడం తో యిక్కడ మూలవిరాట్టు శివుడు . ఇక్కడ శివుడు అగ్నీశ్వరుడుగా ప్రసిద్ది పొందేడు . అగ్నిదేవుడు శివుని కొరకు తపస్సుచేసి శివుని ప్రసన్నం చేసుకున్న ప్రదేశం యిదేనని అంటారు. అందుకే శివుణ్ణి అగీశ్వరుడు అని పిలుస్తారు . ఇక్కడ పార్వతీ దేవి కర్పాంబిక ( కోరిన వరాలిచ్చే తల్లి ) గా పూజలందుకుంటోంది .
ఈ కోవెలలో శుక్రునికి వేరే మండపం గాని విగ్రహం ఆని లేదు . శివుడినే శుక్రునిగా పూజిస్తారు . ముక్తి మండపం లో నటరాజు , శివకామి విగ్రహాలను చూడొచ్చు . ఇక్కడ శివుడు ముక్తి తాండవం చేసేడుట . ముని పరాసురునికి శివుని ముక్తి తాండవాన్ని చూచే భాగ్యం కల్పించేడుట పరమ శివుడు . ఇక్కడ బ్రహ్మ కు శివపార్వతుల కళ్యాణాన్ని చూసే దృష్ఠి ని శివుడు ప్రసాదించేడుట .
ఈ కోవెల చోళరాజులచే నిర్మింప బడింది , విజయనగర రాజులచే పునః నిర్మింప బడింది . అందుకే యీ కోవెలలో చొళుల శిల్పకళ , విజయనగర కాలం నాటి శిల్పకళ కనిపిస్తుంది . అలాగే రెండు కాలాలకు సంబంధించిన శాసనాలు యీ కోవెలలో కనిపిస్తాయి .
ఈ కోవెలలో దక్షిణా మూర్తి , పళ్లి స్వామీ , భైరవుడు , దుర్గాదేవి , వినాయకుడు , కుమారస్వామి , సందికేశ్వరుడు వేరు వేరు చిన్న మందిరాలలో కొలువై యున్నారు .
అగ్ని తీర్ధం లో స్నానం చేసి అగ్నీశ్వరుని పూజించి విష్ణు మూర్తి శుక్రుని వల్ల పొందిన శాపం నుండి విముక్తి పొందేడుట .
శుక్రుడు విష్ణు మూర్తికి శాపం యివ్వడానికి రెండు కధలు ప్రచారం లో వున్నాయి .
వామనావతారంలో విష్ణు మూర్తి బలి చక్రవర్తి వద్ద మూడడుగుల భూమి దానం గా కోరుతాడు , వచ్చినది బ్రాహ్మణ రూపం లో వున్న విష్ణు మూర్తి గా గుర్తించిన శుక్రుడు బలి చక్రవర్తిని వారిస్తాడు . వచన బధ్ధుడైన బలి దానమిచ్చుటకు నిర్ణయించుకొని కమండలములోని నీరు వామనుని చేతిలో పోయుటకు ప్రయత్నించగా శుక్రుడు తుమ్మెదగా మారి కమండలములో నీరు వచ్చు దారిని నియంత్రిస్తాడు . విషయం గ్రహించిన వామనుడు దర్భ పుల్లతో కమండలాన్ని పొడుస్తాడు . దర్భపుల్ల తగిలి శుక్రుడు ఒక కంటి దృష్ఠి పోగొట్టుకుంటాడు . దృష్ఠి పోయినందుకు ఆగ్రహించిన శుక్రుడు విష్ణు మూర్తి ని శపిస్తాడు .
రెండో కధ ప్రకారం దేవదానవులకు యుద్ధం జరుగుతూవుండగా శుక్రుని తల్లి కొందరు దానవులకు ఆశ్రయం యిస్తుంది . వారిని సంహరించే క్రమం లో విష్ణుమూర్తి ఆమెను కుడా సంహరిస్తాడు . అందుకు ఆగ్రహించిన శుక్రుడు విష్ణుముర్తిని శపిస్తాడు .
శుక్ర గ్రహ దోష నివారణార్ధం చేసే పూజలు యిక్కడ ఈశ్వరునికి జరుపుతారు .
ఇక్కడ మందిరంలో రెండు వింతలు చూడదగ్గవి .శివునికి తైలాభిషేకం చేసేటప్పుడు శివలింగం తైలాన్ని పీల్చుకుంటుంది . అలాగే యీ కోవెలలో వుండే బిల్వ చెట్టు రెమ్మకు మూడు ఆకులకు బదులు అయిదు ఆకులు వుంటాయి . ఈ మందిరం లో మహా శివరాత్రి , నవరాత్రి , ఆదిపూరం , ఆరుద్ర దర్శనం రోజులలో విశేష పూజలు నిర్వహిస్తారు .
శుక్రగ్రహ దోష నివారణార్ధం పూజలు చేసేవారు తెల్లని వస్త్రములు ధరించి ఆగ్నేయ దిక్కుగా కూర్చొని క్రింది మంత్రాలను జపించాలి .
శుక్ర మూలమంత్రం
ద్రాం ద్రీమ్ ద్రౌం సహా శుక్రవేనమః
శుక్ర గాయత్రి
ఓం రాజాధిపాయ విద్మహే
బృగుసుతాయ ధీమహి
తన్నో శుక్ర ప్రచోదయాత్
వచ్చేవారం శనీశ్వరుని కోవెలగురించి చదువుదాం అంతవరకు శలవు .