మా పట్నానికి మళ్లీ కళ తీసుకొస్తారని ఆశిస్తూ..
నాకు అర్థంగానిదేంటంటే, మీరందరు ఊర్నుంచి అయిన వాళ్లందరిని వదల్లేక వదల్లేక వదిలి బతుకు తెరువు కోసం ఈ సిటీకి వచ్చారు. బాగుంది. సర్లే పండగలకు సెలవులకోసం పనులు ముందే పూర్తి చేసుకుని, బాస్ ల కాళ్లూ గడ్డాలు పట్టుకుని బతిమిలాడి పండగ ఆనందాన్ని అనుభూతించడానికి పల్లెటూళ్లకెళతారు అదీ బానే ఉంది. కాని మీరెళ్లాక మా పరిస్థితి, మా సిటీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? పళ్లూడిపోయిన అవ్వ నోటిలా..బోసిగా! అవును నీళ్లతో కళ కళ్లాడినప్పుడే కదా చెరువుకందం. ఎండిపోతే..?
మీరున్నప్పుడు నిండు గర్భినుల్లా కదలాడే బస్సులు బక్కపలచబడి రోడ్లమీద బలపాల్లా కదులుతుంటాయి. కస్టమర్లతో నిండి మీటరు మీద అంతిస్తావా? ఇంతిస్తావా? అని రుబాబ్ చేసే ఆటోవాలాలు, మేమెక్కితే చాలన్నట్టు ఆశగా చూస్తుంటారు. రెక్వెస్ట్ పెట్టంగానే ఇంటిముందు వాలి పోతున్నారు క్యాబ్వాలాలు. రోడ్లయితే కర్ఫ్యూ పెట్టినట్టె. ప్రతిరోజూ మా సిటీకి పండగ వాతావరణాన్నిచ్చే మీరందరూ సరిగ్గా పెద్ద పండగలనాడు ఇలా మా నగరాన్ని డల్ చేయడం న్యాయమా?
పొలాల్నుంచి కొత్త పంటలను బళ్ల మీద ఇంటికి తెచ్చుకోవడం, ముగ్ధలు కళ్లాపీ చల్లిన ముంగిళ్లలో వేసే రంగు రంగుల ముగ్గులతో, పెట్టే గొబ్బెమ్మలతో, ఊరి వీధుల్లో సంచరించే ఆబాలగోపాలంతో, పసి పిల్లల చేతుల్లో ఎగిరే గాలిపటాలతో, గుళ్లలోని అయ్యవార్ల ఆశీర్వచనాలతో, గంగిరెద్దుఆటలతో, సరదా కోడి పందాలతో మీరు భూమ్యాకాశాలు దద్దరిల్లేలా చేసే హడావుడి మేము టీ వీల్లో చూస్తుంటే భూమిలో కొంత భాగమే పల్లెల్లా కాకుండా, భూమంతా పల్లెగా మారిపోతే ఎంత బాగుండునో అనిపిస్తూంది. ఆ పాడి పంట కేవలం పట్నంలోనే పుట్టి పెరిగిన వాళ్ల ఊహకు కూడా అందదు. ఇక్కడంతా కొనుక్కోవడమే!
ఇక్కడ మాలో కొంతమంది కృత్రిమంగా పల్లె సీమను ఏర్పాటు చేసుకున్న శిల్పారామం కి వెళతారు. గుడ్డిలో మెల్ల. అయితే, ఎంతైనా అక్కడి జీవం ఇక్కడ ప్రతిఫలించదుకదా!
అన్నట్టు ఇప్పుడు మాల్స్, వాటిలో ఎన్నో స్క్రీన్స్ ఉన్నాయి కదా అందులో ఏదో ఓ సినిమా కచ్చితంగా చూస్తాం. మా పండగ ఓ సెలవు రోజుకు కాస్త చెమ్కీ అద్దినట్టుంటుందే తప్ప నిజమైన పండగలా ఉండదు.
మీరందరు ఒక పని చెయ్యొచ్చు కదా!
ఈసారి పెద్ద పండక్కి పల్లెలోని అందర్నీ ఇక్కడకు తీసుకొచ్చి ఇక్కడ మనందరం కలసి సంబురాలు చేసుకుందాం. ఎంతైనా మనదంతా ఒక కుటుంబమే కదా.
మా పట్నానికి ఓ సారి పల్లె రుచి చూపిద్దాం. అప్పుడు పట్నమే పల్లెగా మారిపోతుందని నా నమ్మకం. అందరి మూలాలు అక్కడే కదా!
కొండంత ఆనందాన్ని గుప్పెడు గుండెలో దాచుకుని మధుర స్మృతులను నెమరేసుకుంటూ వచ్చే మీ కోసం ఎదురు చూస్తూ..మా పట్నానికి మళ్లీ కళ తీసుకొస్తారని ఆశిస్తూ..
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!