సంబరాల సంక్రాంతి - కర్రా నాగలక్ష్మి

sambarala sankranti

సంక్రాంతి ప్రతీ సంవత్సరం జనవరి నెలలో 13, 14 , 15 తేదీలలో హిందువులు జరుపుకొనే మూడురోజుల పండగ అని మన ఇళ్లల్లో చిన్న పిల్లలు కూడా చెప్తారు .

దిన పత్రికలు , వార పత్రికలు నాకు జ్ఞానం వచ్చిన దగ్గరనుంచి సంక్రాంతి సంచిక అనగానే ప్రత్యేకంగా వేసిన బొమ్మలు , సంక్రాంతి సంబరాలను తెలియజేసే సమాచారంతోనూ , రంగురంగుల రంగవల్లులతోనూ తీర్చి దిద్దేవారు . ప్రత్యేక వ్యాసాలు , కవితలు కూడా వుండేవండోయ్ , రేడియో తిప్పితే సంక్రాంతిని గురించిన పాటలు , కవితలూ వచ్చేవి .

అన్ని పత్రికలూ ఒకే విషయాన్ని ప్రతీ సంవత్సరం చెప్తూవుంటారెందుకో అప్పట్లో తెలిసేది కాదు , అలా చెప్పబట్టే మన పండుగలలోని విశేషం కొంతమందికైనా తెలుకునే అవకాశం కలుగుతోంది . లేకపోతే యివాళటి బీజీ జీవితాలలో మన పండుగలు మరుగున పడిపోయేవి , యిప్పటికే  చాలా పండుగలు అటకెక్కేయి , మిగతావి యెక్కడానికి యెంతో కాలం అక్కరలేదు .

ముందు సంక్రాంతి గురించిన వివరాలు తెలుసుకుందాం .

మనిషి నాగరికతను నేర్చుకొని అడవిలో దొరికిన పదార్ధాలను వండుకొన తినడం తో   సరిపెట్టుకోక పంటలు పండించుకోడం తినడం మొదలుపెట్టిన తరువాత మనిషి మనుగడపై సూర్యచంద్రుల ప్రభావం తెలిసింది , కాలాల ప్రాముఖ్యత తెలిసింది .కొందరు తెలివైన వారు సూర్యచంద్రుల గతులను అంచనా వేసి రాత్రీపగల యేర్పడుతున్నాయని తెలుసుకున్నారు , భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల కాలాలు యేర్పడుతున్నాయని భావించేరు . అలా పున్నమికి చంద్రుడికి పూజలు చెయ్యడం , సూర్యుని ప్రత్యక్ష దైవంగా భావించి పూజలు చెయ్యడం చెయ్యసాగేరు .

సాధారణంగా పూర్వకాలంలో మార్గశిర మాసం లో పంటచేతికొచ్చేది . పంట యింటిక రాగానే వారి దగ్గర పనిచేసేవారికి ధాన్యం యివ్వడం బంధువులకు కానుకలు యివ్వడం చేసేవారు . అందరి దగ్గరా పుష్కలంగా ధాన్యం వున్నప్పుడు అందరూ పండగచేసుకొనేవారు . అలా సంక్రాంతి పండుగగా చేసుకోడం మొదలయి వుంటుంది .

అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం చూస్తే సూర్యుడు నెలకొకసారి ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడు . అంటే ప్రతీనెలా సంక్రాంతి వస్తుందన్నమాట , మనం పండుగగా జరుపుకొనే సంక్రాంతికి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు . సూర్యుడు మకరరాశిలోక ప్రవేశించినపుడు ఆయనం మారుతుంది , మనకి నెలలు పన్నెండు , ఋతువులు ఆరు , ఆయనాలు రెండు . దక్షిణాయనం , ఉత్తరాయణం . జూన్ 14 నుంచి దక్షిణాయనం , జనవరి 14 నుంచి ఉత్తరాయణం . ప్రముఖ మందిరాలలో దక్షిణాయనంలో దక్షిణద్వారం గుండా వెళ్లి స్వామివారు దర్శించుకుంటాం , అలాగే ఉత్తరాయణంలో ఉత్తరద్వారం గుండా స్వామిని దర్శించుకుంటాం . అయితే ఆయనాలలో ఉత్తరాయణం ప్రముఖమైనది , ఉత్తరాయణం లో చేసే పూజలు నోచే నోములు యెక్కువ ఫలితాలను యిస్తాయట , ఉత్తరాయణం లో మరణించిన వారికి తిన్నగా స్వర్గప్రాప్తి కలుగుతుందట , అందుకే మహా భారతంలో భీష్ముడు గాయపడి అంపశయ్యపై ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేక ఏకాదశినాడు ఇఛ్చామరణం పొందుతాడు .      సులువుగ అర్దమయేటట్లు చెప్పుకోవాలంటే మకరసంక్రమణం రోజున సూర్యుని గతిమారి సూర్యుని కిరణాలు భూమిని తిన్నగా తాకడం వల్ల వేడి పెరిగి పగటి గంటలు పెరగడం రాత్రి గంటలు తగ్గడం జరుగుతుంది  , అలాగే దక్షిణాయనంలో సూర్యుని కిరణాలు యేటవాలుగా భూమిని చేరడం వల్ల వేడి తగ్గి క్రమంగా చలిపెరగడం పగలు తగ్గి రాత్రులు పెరగడం జరుగుతుంది .

సూర్యమానాన్ని పాటించే తమిళులకి సంక్రమణంతో నెలమొదలవుతుంది . మేష సంక్రమణం రోజు వారికి కొత్తసంవత్సరం మొదలవుతుంది . సాధారణంగా ఏప్రెల్ 14 న తమిళకొత్త సంవత్సరాది వస్తుంది .

సంక్రాంతి గురించి కొంత తెలుసుకున్నాం కదా ? యిక యీ పండగని వివిధ ప్రాంతాలలో యెలా జరుపుకుంటారో తెలుసుకుందాం .     సంక్రాంతి హిందువుల పండగ అని చెప్పుకున్నాం కదా ? మనదేశంలోనే కాదు నేపాలు , థాయ్ లాండు , మయన్మారు , ఇండోనేషియా లలో కూడా సంక్రాంతిని జరుపుకుంటారు .

దక్షిణ రాష్ట్రాలయిన ఉభయతెలుగు జిల్లాలు , కర్నాటక , తమిళనాడు , కేరళ లలో యించుమించుగా ఒకేలా జరుపుకుంటారు .      దక్షిణాది రాష్ట్రాలవారికి సంవత్సరంలో వచ్చే పెద్దపండగయిదే , మొత్తం నాలుగురోజులు జరుపుకుంటారు . అయితే సంక్రాంతి సంబరాలు హడావుడి నెల ముందునుంచే మొదలవుతుంది , అంటే డిసెంబరు 14 వతేదీ తో మొదలవుతుంది , సూర్యుడు ధనురాశిలో ప్రవేశించినది మొదలు మకరరాశిలోకి ప్రవేశించేవరకు అన్నమాట . ప్రతీరోజూ సూర్యోదయానికి ముందు ముంగిలిని రంగురంగుల ముగ్గులతో తీర్చిదిద్ది ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను బంతి , చేమంతి పూలతో అలంకరించి పూజలు చేస్తారు , మరునాడు వాటిని పిడకలు చేసి కొత్తగొబ్బెమ్మలను చేసి పూజచేస్తారు అలా నెలరోజులూ చేసిన గొబ్బెమ్మలను భోగిమంటలో వేస్తారు . మొదటి రోజు భోగి అని అంటారు . మూడవ ఝాము ముగియకముందే ఎండుకట్టెలు పనికిరాని పాతసామాను వేసి మంటపెడతారు , అందులో పిడకలనుదండలా చేసి వేస్తారు , ఆవు పిడకలు కాల్చితే గాలిలో వున్న అనేక రోగకారక క్రిములు నశిస్తాయని శాస్త్రజ్ఞులు యిప్పుడు చెప్తున్నమాట , కాని మన సంసృతిలో యెప్పటినుండో వున్న ఆచారం యిది . భోగి నాడు నువ్వులనూనె తలకు వంటికి రాసుకొన తలస్నానం చెయ్యడం వల్ల చర్మరోగాలు రావని పెద్దలమాట . స్నానం చేసిన తరువాత కొబ్బరికాయ , అరటిపళ్లు , సుగంధ ద్రవ్యాలు అగ్నిదేవునికి కానుకగా మంటలో వేస్తారు , ఒకరకంగా చెప్పాలంటే కమ్యూనిటీ హవన్ అన్నమాట . ఉత్తరాది రాష్ట్రాలలో భోగినాటి రాత్రి మంటవేస్తారు , అగ్ని దేవునిక పూజలు చేసి నువ్వులు , పేలాలు , వేరుశనగలు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా వారుకూడ తింటారు , వీరు యీరోజుని లోఢి అని అంటారు . పండగ అంటే పిండివంటలు వుండాలికదా ? మధ్యాహ్నం బంధుమితృలతో కలసి భుజిస్తారు .

సాయంత్రం ఇంట్లో వుండే చిన్నపిల్లలకు రేగుపళ్లు , పంచదార గుళ్లు నానబెట్టిన శనగలు రాగి డబ్బులు , అక్షతలు కలిపి ముత్తైదువలు దిగతుడిచి తలమీదుగా పోస్తారు , దీనివల్ల పిల్లలకు నరదృష్టి బాధలు తొలగిపోతాయనే నమ్మకం . దీనిని భోగిపళ్లు పొయ్యిండ అని అంటారు

రెండవ రోజు మకరసంక్రాంతి , సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సమయాన్ని సంక్రాంతి పుణ్యకాలం అంటారు . ఆ సమయంలో చేసే దానధర్మాలు , శ్రాద్ధకర్మలు విశేషపుణ్యాన్నిస్తాయని హిందువుల నమ్మకం . సంక్రాంతి పుణ్యకాలంలో ఆచరించే నది లేక సముద్ర స్నానం , విడిచే తర్పణం విశేష పుణ్యాన్ని యిస్తుందనేది హిందువుల నమ్మకం . ముత్తైదువలు కొత్త పసుపు , కుంకుమ , పళ్లు , కొత్తబట్టలు , తాంబూలం మొదలయినవి శక్తానుశారం ముత్తైదువలకు యివ్వడం కూడా ఓ ఆచారం .

ఉత్తరాది రాష్ట్రాలలో నదీస్నానం చేసి సూర్యునికి నువ్వులు బెల్లంతో చేసిన పదార్ధాలను నివేదిస్తారు , నువ్వులు బెల్లం నలుగురికీ పంచుతారు . బియ్యం , కొబ్బరికోరు , నువ్వులు , బెల్లం వేసి చేసిన మీఠీభాత్ తప్పకచేస్తారు . గోధుమ కంకులు , గాజర్ , పచ్చి శనగలు లాంటివి దానం చేస్తారు .

సంక్రాంతినాడు చెరుకు , పసుపు మొక్కలకు పూజించడం కూడా కొన్ని కుటుంబాలలో కనిపిస్తుంది . ఇంటిగిమ్మానికి చెరుకుగడలను కడతారు . ముంగిట్లో రధం ముగ్గువేస్తారు . వ్యవసాయదారులు తమపొలాలకు  పసుపు కుంకుమలతో పూజలు చేసి రాళ్లతో పొయ్యచేసి కర్రలతో మంటపెట్టి పాలుపొంగించి కొత్తబియ్యం , పెసరపప్పు , చెరుకురసం తో చక్కెరపొంగలి చేసుకొని అక్కడే నైవేద్యంచేసి అక్కడేతింటారు . దీనినే తమిళులు పొంగల్ అంటారు , అందుకే వారు సంక్రాంతిని పొంగల్ అని అంటారు . పల్లెలు పట్నాలుగా మారేక యీ అలవాటు తగ్గింది కాని యింకా చాలా చోట్ల యీ అలవాటు కొనసాగుతోంది . పొలంలో యెర్రన్నం , పచ్చన్నం జల్లుతారు . పిల్లలూ పెద్దలూ కొత్తదుస్థులు ధరించి పెద్దల ఆశీస్సులు పొందుతారు . ఒకరికొకరు బహుమతులు యిచ్చుకుంటారు .          ఇక మూడవనాడు కనుమ , ఆరోజు ఊరి అమ్మవారికి చల్దులు పెడతారు . అన్నం , కొత్తబట్టల , కానుకలు అమ్మవారిక సమర్పిస్తారు . ఆరోజు మినుముతో చేసిన వంటకాలు తినాలని అంటారు . ఇంటిముందు రథం వెళ్లిపోతున్నట్టుగా ముగ్గులు వేస్తారు . ఈ రోజున కొందరు బొమ్మలుపెడతారు , బొమ్మల నోము నోచుకుంటారు . పొలాలలో తమకు సహాయంగా పనిచేసే పశువులకు , పాడి నందించే పశువులకు పసుపు కుంకాలతో పూజిస్తారు . సాయంత్రం కోడి పందాలు , యెడ్ల పందాలతో కాలం గడుపుతారు . పలానాటియధ్దానికి యీ కోడి పందాలే కారణం కదూ ? , కాలక్షేపానికి మొదలుపెట్టిన ఆటలు పంతాలకు పట్టింపులకు దారితీయడం అప్పటినుంచే మొదలయిందేమో ? . కోళ్లకు కత్తి కట్టడాలు లాంటివి , బెట్టింగులు పెరిగిపోవడంతో యీ మధ్య వీటిపై ఆంక్షలు విధించడం మనకు తెలిసినదే .

           నాలుగవరోజు సూర్యోదయానికి ముందు జిల్లేడాకు , రేగిపండు తలపై వుంచుకొనిపెద్దలూ పిల్లలూ స్నానాలు చేస్తారు . దీనివల్ల వున్న చర్మరోగాలు పోతాయని , యకపైన చర్మరోగాలు రావని అంటారు . తెల్లజిల్లేడు యెన్నోరకాలైన చర్మరోగాలను నిరోధిస్తుందనేది నిరూపించబడిన నిజం .

           తమిళనాడు లో జల్లికట్టు పోటీలు నిర్వహిస్తారు .

            సంక్రాంతి పండుగులకు అల్లుళ్లు అత్తవారిల్లు రావడం , కానుకలను అందుకోవడం యెన్నాళ్లగానో వున్న ఆచారం . 

         గుజరాతులో సంక్రాంతి పండుగలలో గాలిపటాలు యెగరవెయ్యడం ఆనవాయితీ . గాలిపటాల ద్వారా పంపిన సందేశాలు పితృదేవతలకు చేరుతాయని నమ్ముతారు .

         అలాగే గంగిరెద్దులాటలు , హరిదాసుల పాటలు , నగరాలలో కనిపించకపోయినా పల్లెలలో యింకా చూడొచ్చు .

         మొత్తానికి సంక్రాంతి అంటే రంగురంగుల రంగవల్లులు , భోగీమంటలు , పాడిపంటలు , విందులు వినోదాలు , సరదాలు సాంప్రదాయాలూ మాత్రమే గుర్తురావాలి , అంతేకాన పంతాలు పట్టింపులు , పట్టుదలలు పౌరుషాలు కావని తెలుకొని మన సాంప్రదాయాలను కాపాడుకుందాం . ఈ. సంవత్సరం మనలోని అజ్ఞానాన్ని భోగీమంటలో వేసి కాల్చి జ్ఞానాన్ని పెంచుకొని సంక్రాంతిని జరుపుకుందాం .

             

           

కర్రా నాగలక్ష్మి

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు