ఆ రాత్రి కోళ్ళు నిద్ర పోలేదు . తెల్లారితే భోగి. అప్పటికే పండక్కొచ్చిన కూతుళ్ళు, అల్లుళ్ళతో ఇళ్ళన్నీ కోలాహలంగా ఉన్నాయి .
తెల్లారితే ఏ కోడి పకోడీ అయిపోతుందో? ఏ కోడి మిగుల్తుందో? ‘నేనుంటానో ఊడతానో?’ భయపడసాగేడు కోడీశ్వర్.
తనని నాలుగు నెలల నించి రకరకాల గింజలు పెట్టి బలిష్టంగా పెంచుతున్నారు. ఈ రోజు చికెన్ కోసమా? లేక పందెం కోసమా? రాత్రంతా ఇవే ఆలోచనలతో నిద్ర పోక తెల్లరగట్ల తను కుయ్యాల్సిన టైం కి కునుకు తీసాడు.
ఇంటి యజమానే వచ్చి లేపాడు. అంటే ఉరి శిక్షకి టైం అయిందన్నమాట!
అయితే తను భయపడినట్టు ఏమీ కాలేదు. జీడి పప్పుల గిన్ని తెచ్చి ముందు పెట్టాడు యజమాని. అంటే మధ్యాహ్నం పందేనికన్న మాట.
అనుకున్నట్టే మధ్యాహ్నం - ఊరవతల చేనుగట్ల మధ్య ఖాళీ స్థలంలో చేరారందరూ. పాతిక ముఫ్హై కోళ్ళు యజమానుల చంకల్లో కూర్చుని దిక్కులు చూస్తున్నాయి.
పందెం గాళ్ళు, పై పందేల వాళ్ళు, బేరగాళ్ళు, చూసేవాళ్ళు - వందా నూటయాభై మంది వరకూ పోగయ్యారు . రూపాయల భాషలో మాట్లాడుకుంటున్నారు కొందరు.
మాజీ సర్పంచి గారోస్తే పందెం స్టార్ట్ చెయ్యొచ్చు. అరుగో వచ్చేసారాయన.
పెద్ద పొట్టతో, గుబురు మీసాలతో, అన్ని వేళ్లకీ బొంత ఉంగరాలతో, బ్రేసులెట్స్ తో గున గున వచ్చి కుర్చీలో కూర్చున్నారాయన.
ఆయన అనుచరుడు పెద్ద కర్రతో నేల మీద కొట్టి ‘కానివ్వండ్రా’ అని అరిచేడు.
ఇద్దరు మనుషులు చంకల్లో కోడి పుంజుల్నితెచ్చి వాటి ముక్కులు కరిపించారు. అలా చేస్తే వాటికి పౌరుషం వస్తుందట. కరిపించి నేల మీద వదిలి దూరం జరిగేరిద్దరూ.
కోళ్ళు రెండూ రెండు అడుగులు వెనక్కి వేసి, మెడలు వంచి అదనుచూసి ఎగిరి తన్నుకున్నాయి. ఒకసారి, రెండు సార్లు, మూడు సార్లు!! కాళ్ళకి కట్టిన కత్తులు రక్తం కళ్ళ చూసాయి . ఒక కోడి నేలమీదికి ఒరిగిపోయింది.
జనాలు, పందెగాళ్ళు హాహాకారాలు చేసి కోళ్ళను తీసుకుని డబ్బులు పంచుకున్నారు . వందలూ, వేలూ మార్పిడి అయ్యాయి .
తరవాతి వంతు కోడీశ్వర్ దే.
కత్తులు కట్టేరు. ముక్కులు కరిపించి వదిలేరు . కోడీశ్వర్ అదను చూసి ఒకే ఒక దేబ్బకోట్టేడు ఎదుటి కోడి గుండెల మీద. అంతే రక్తం ధారలు కట్టింది. నేల మీద వాలిపోయింది.
ఇంతలో - “పోలీసులు పోలీసులు” అంటూ గట్టిగా అరిచారెవరో.
అంతే. జనాలు వికావికలై పరుగులు తీసారు. డబ్బుల్ని, కోళ్ళని, సైకిళ్ళని తీసుకుని చేల గట్ల వెంబడి, పడుతూ లేస్తూ పరుగులే పరుగులు.
అంతా ఉట్టిదే పోలీసులూ లేరు ఎవరూ లేరు. ఎవరో కావాలనే అలా అరిచేరు.
కోడీశ్వర్, అతడి ప్రత్యర్ధి మాత్రమే అక్కడ మిగిలేరు.
నేలకి ఒరిగిపోతూ ఎదుటి కోడి చూసిన చూపు కోడీశ్వర్ గుండెల్ని తాకింది. అతడి మనసు వికలం అయిపోయింది.
ఎందుకీ మారణ హోమం? మనలో మనకి వైషమ్యాలు పుట్టించి మనల్ని మనమే చంపుకునేలా చేస్తున్నారే ఈ మనుషులు! ఏమిటీ ఘోరం! మన జాతిని మనం రక్షించుకోలేమా? ఈ ఆలోచనలతో కోడీశ్వర్ లో ఒక ‘వివేక కోడి’ లేచాడు. తన ప్రబోధంతో కోడీశ్వర్ ని ‘జ్ఞాన కోడి’ గా మార్చేడు.
ఆ రాత్రి కోడీశ్వర్ నిద్రపోలేదు. తాడు తెంపు కుని ఊళ్ళో ప్రతి ఇంటికీ వెళ్లి సోదర కోళ్ళన్నిటినీ కలిసి చర్చించాడు.
మనలో మనం ఇలా ఆవేశపడి హత్యలు చేసుకోకూడదని, సమైక్యంగా ఉండి జాతిని పరి రక్షించుకోవాలని గంభీరంగా ఉపన్యాసాలు ఇచ్చాడు.
“పందెంలో సావకపొతే ఇంట్లో సస్తాం. ఎట్టాగైనా సావు తప్పదు.” అందొక సందేహ కోడి.
“ఎన్ననుకుని ఏం లాభం. మన జాతే అసుమంటిది” అందొక నిరుత్సాహ కోడి.
“ఎప్పుడో ఆల్లు సంపుతారని మనలో మనం కొట్టుకు సావడమే కరెక్ట్ అంటావా?’ నిలదీసింది ఇంకో ధైర్య కోడి .
“ఆగండెహ. పెద్దాయన సెప్పేది ఇనుకోండి” అంటూ సర్ది చెప్పింది ఒక అనుభవ కోడి.
“నాకొక ఉపాయం తోచింది. మనం అది ఫాలో అయ్యామంటే పందేల్లో మనం చావం . చంపం. అదేమిటంటే …” అంటూ చుట్టూ చూసి, “చెవిలో చెబుతా పట్టండి. సీసీ కెమేరాలుంటాయి” అంటూ రెండు మూడు కోళ్ళ కి రహస్యంగా ఏదోచెప్పేడు కోడీశ్వర్. అవి వేరే ఇతర కోళ్ళకి చెప్పి, అలా అలా మొత్తం అందరికీ తెలిసిపోయింది .
మర్నాడు సంక్రాంతి.
జనాలు విపరీతంగా వచ్చారు. ఎవరి చేతుల్లో చూసినా డబ్బు సంచులే. వేలు, లక్షలు పందెం కాయడం కోసం రెడీగా ఉన్నాయి .
కోళ్ళ కాళ్ళకి కత్తులు కట్టేరు. ఒళ్ళు దువ్వి నోటితో వేడిగా ఊది ఉత్సాహం తెచ్చే ప్రయత్నం చేసారు.
మొదటి పందెం స్టార్ట్ అయింది. రెండు కోళ్ళకి ముక్కులు కరిపించి నేల మీద వదిలేరు.
అవి ఇప్పుడు ఎగిరి తన్నుకుని, గుద్దుకుని రక్తాలు కక్కుకుంటాయి అని అందరూ ఎదురు చూస్తూ ఉండగా ఆశ్చర్యంగా ఆ రెండు కోళ్ళూ ముందుకు వచ్చి ‘షేక్ హ్యాండ్’ ఇచ్చుకున్నాయి .
భుజాల మీద చేతులు వేసి కావిలించు కున్నాయి . కోడి భాషలో ‘స్నేహమేరా జీవితం’ అంటూ పాడుకున్నాయి .
పందెగాళ్ళు అదిరి పడ్డారు.
కోపం, పౌరుషం తెచ్చుకోవాల్సిన కోళ్ళు చేతులు కలిపి నవ్వుకుంటున్నాయేవిటి?
వేరే రెండు కోళ్ళని తెచ్చి ట్రై చేసారు. అవీ అంతే. షేక్ హ్యాండ్ ఇచ్చుకుని నిలబడి దిక్కులు చూస్తున్నాయి .
దిబ్బయి పోయాంరో దేవుడో అంటూ పందేగాళ్ళు, అందరూ గోలెత్తారు.
“కోళ్ళు కొట్టుకోకపోతే ఇక పందేలేంట్రా.. ఛీ నీ యవ్వ” అంటూ బూతులు తిట్టుకుంటూ అందరూ లేచిపోయారు .
కోళ్ళ మొహాల్లో వెలుగులు! అవధుల్లేని ఆనందం !!
“సమస్త కోడి సోదరులారా ఏకం కండు. కోడి జాతి సమైక్యత వర్ధిల్లాలి” అంటూ కొన్ని కోళ్ళు నినాదాలిచ్చాయి . అన్ని కోళ్ళు గొంతు కలిపాయి!
కోడీశ్వర్ ని ‘కోడి జాతిపిత’ గా గుర్తిస్తూ అన్ని కోళ్ళూ తీర్మానం చేసాయి!!
*********