విమర్శ--రంధ్రాన్వేషణ - టీవీయస్.శాస్త్రి

Vimarsa - Randhranveshana

ఈ రోజుల్లో చాలామందికి విమర్శకు, రంధ్రాన్వేషణకు తేడా తెలియటం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే-- రచయిత వ్రాసింది పూర్తిగా చదివి, అందులో రచయిత ఏమి చెప్పాడో , అది ఎంతవరకు స్పష్టంగా చెప్పగలిగాడో, అతని భావమేమిటో, అతని వేదన ఏమిటో... వీటన్నిటినీ సమగ్రంగా విశ్లేషించి చేసే వ్యాఖ్యానమే విమర్శ అంటే, నా దృష్టిలో! అన్నిటినీ మించీ ఆ వ్యాఖ్యానం/విమర్శ రచయిత మనోభావాలు దెబ్బతినకుండా చెప్పటానికి చాలా విజ్ఞత, సంస్కారం కావాలి. విమర్శ చేసేవారికి సాహితీ ప్రక్రియలలో చక్కని ప్రావీణ్యంతో పాటు సంస్కారం కూడా ఉండాలి. వారు చేసే విమర్శలను చదువుకొని రచయిత ఆనందంతో మనసారా నవ్వుకుంటూ, ఇంకా మంచి విషయాలు నేర్చుకుంటాడు.

ఒక విధంగా చెప్పాలంటే -- సద్విమర్శకులు చేసే సాహితీసేవ , రచయితల చేసే సేవకన్నా చాలా గొప్పది. చేసే విమర్శ--చక్కని భాషలో, సహృదయతో ఉండాలి. సునిశితంగా, సున్నితంగా ఉండాలి. అర్ధం పర్ధం లేని విమర్శలను రచయిత పట్టించుకోడు. అటువంటి విమర్శకులు నలుగురిలో వారిని వారే చులకన పరుచుకుంటారు. ఈ మధ్య నేను కొన్ని విమర్శలను పత్రికలలో చూస్తున్నాను. పత్రికల వారు అటువంటి వారి చేత 'గ్రంధ సమీక్షలు' ఎలా చేయిస్తున్నారో నాకు అర్ధం కాదు. ఉదాహరణకు, ఒక చిన్న రచయిత తాను వ్రాసిన 'శ్రీ విద్య' అనే గ్రంధాన్ని ఒక పక్ష(వాత) పత్రికకు సమీక్ష కోసం (పొరపాటున) పంపాడు. ఆ గ్రంధాన్ని సమీక్ష చేసిన విమర్శకునికి మామూలు 'విద్య' అంటేనే తెలియదు, ఇక 'శ్రీ విద్య' అంటే ఎలా తెలుస్తుంది? అటువంటి వాటిని విమర్శలు అందామా? 'శ్రీవిద్య'లో కొంతైనా ప్రావీణ్యముండిన వారు చేసే విమర్శ చదవటానికి చాలా కుతూహలంగా ఉంటుంది.

మరికొంతమంది విమర్శకులు ఉంటారు. వీరు చేసే విమర్శ ఎంత చదివినా మనకు అర్ధంకాదు. ఎందుకంటే, విమర్శ చేసేవారికే, తాము చెప్పే విషయం గురించి స్పష్టత లేకపోవటం ఒక ముఖ్య కారణం. అటువంటి వారి విమర్శలు ఎలా ఉంటాయో కొంత క్లుప్తంగా చెబుతాను. ఒకటో రెండు తెలుగు వాక్యాలు, చాలా ఇంగ్లీష్ వాక్యాలు, వీలుంటే కొన్ని హిందీ వాక్యాలు కూడా వ్రాస్తారు. వీటన్నిటినీ మించి వారికి తెలిసిన రెండు మూడు సంస్కృత శ్లోకాలను కూడా ఉటంకించుతారు. రచయిత అక్కడ కామా(, ) పెట్టలేదు, బండి'ర' వ్రాయవలసిన చోట మామూలు 'ర' వ్రాసాడు. రచయితకు వ్యాకరణం అసలు తెలియదు. (గ్రామానికి కరణం, భాషకు వ్యాకరణం --అభివృద్ధికి ఆటంకాలు అని ఒక ప్రఖ్యాత కవి ఎప్పుడో వ్యంగ్యంగా చెప్పినట్లు నాకు గుర్తు. ) కొన్నిచోట్ల అచ్చుతప్పులున్నాయి--ఇలా చెప్పుకుంటూ వ్రాసిన రచయిత కన్నా, తమకే ఎక్కువ తెలుసనీ, తమ 'పాండిత్యాన్ని'చూపించుకోవటం కోసమే అటువంటి విమర్శలు చేస్తారేమోనని నాకు అనిపిస్తుంది.

నేను మాత్రం, సద్విమర్శకులకు ఒక్క నమస్కారంచేస్తే , వీరికి మాత్రం వేయి నమస్కారాలు చేస్తాను. ఎందుకంటే, మనం వ్రాసింది ఎక్కువ సార్లు చదివేది వీరే! ఎక్కువ నచ్చేది కూడా వీరికే! వారు తమను మించిన మేధావులు లేరని వారే భావించుకుంటారు. మేధావులంటే గుర్తుకొచ్చింది. ఆ మధ్య కొందరు మేధావులు పోతన గారి భాగవతంలోని ఒక పద్యమైన- 'నల్లని వాడు పద్మనయనంబులవాడు....' ను తీసుకొని, కొందరు కృష్ణుడు నలుపు అని, మరికొందరు నీలమేఘశ్యాముడని, ఇంకొందరు నలుపు అన్నా నీలం అన్నా ఒకటే అని, కొంతమంది వేరని... ఇలా పోతన గారిని తెగ నలిపేసారు. వీరిలో మరికొంతమంది మేధావులు-నలుపు, నీలం గురించి వారి శాస్త్ర పరిజ్ఞానాన్ని తెలియచేయటంకోసం ultraviolet rays ప్రస్తావన కూడా తీసుకొని వచ్చారు. వారు పొరపాటున నన్నుకూడా మేధావని అనుకున్నారేమో ఏమో, ఆ విషయానికి సంబంధించిన ప్రతి (అనవసర) విషయాన్నినాకు కూడా తెలియపరచారు. అటువంటి వాటిమీద నేను స్పందించను. ఈ దేశప్రజలు కృష్ణుడు నల్లని వాడా, తెల్లనివాడా లేక నీలఘశ్యాముడా అనే విషయాలను ఆలోచించరు. చల్లనివాడని కొలుస్తున్నారు. 'బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడే' అని భావిస్తున్నారు. ఇటువంటి మేధావులను దృష్టిలో ఉంచుకొనే , శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు దేవుడుని ప్రార్ధిస్తూ ఏమన్నారో చూడండి ---

"దేవుడా
రక్షించు నా దేశాన్ని
పవిత్రులనుండి పతివ్రతలనుండి
పెద్దమనుషులనుండి పెద్ద పులులనుండి
..............
..............
సిద్ధాంత కేసరులనుండి సిద్దులనుండి"

ఇలా వ్రాసుకుంటూ పోయారు. ఈ జాబితాలోని 'సిద్ధాంత కేసరులు'అంటే మేధావులే!సాహితీ స్రష్టలంతా, సాహితీ ద్రష్టలు కారు, కాలేరు. ఇలాంటి కువిమర్శకులకు భయపడి ఒక మహా రచయిత అయిన జేమ్స్ జోయిస్, తన స్నేహితునితో ఇలా అన్నాడట--నేను ఈ రోజంతా ఏమి చేసానో తెలుసా, ఒక చోట పెట్టిన కామాను(, ) తొలగించాను. మరుసటి రోజు ఇలా అన్నాడట, ఈ రోజు అంతా బాగా అలోచించి నిన్న తొలిగించిన కామాను(, ) మళ్ళీ అక్కడే ఉంచాను, అని. ఎంత వృధా చేసుకున్నాడో పాపం తన విలువైన కాలాన్ని!లేకపోతే వారి నుండి మరిన్ని విలువైన గ్రంధాలు వచ్చి ఉండేవి! చక్కని వ్యాఖ్యలే రచయిత అభివృద్ధికి తోడ్పడుతాయి.

మంచి విమర్శలు ఎంత గొప్పగా ఉంటాయో, విమర్శలలో ఎంత సాహితీ నైపుణ్యం చూపించవచ్చో, సంస్కారవంతంగా ఎలా విమర్శించవచ్చో తెలుసుకోవాలంటే శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రి గారు రచించిన 'చలువ మిరియాలు' అనే గ్రంధం చదివి తీరవలససిందే! ముళ్ళపూడి వెంకట రమణ గారు మొదట్లో ఆంద్ర పత్రికలో సినిమా సమీక్షలు వ్రాసేవారు. వారు వ్రాసే సమీక్షలే తరువాతి రోజుల్లో వారికి రచయితగా మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. అలా సమీక్షలు వ్రాయటం నిజంగా కత్తిమీద సాములాంటిది. సినిమా బాగాలేదని వ్రాస్తే, ఆ పత్రికకు సినిమా వారి ప్రకటనలు రావు. బాగాలేని సినిమాను బాగుందని వ్రాసి ప్రేక్షకులను మోసం చేయటం ఆయనకు ఇష్టం ఉండదు. ఆ రోజుల్లో కొందరు ప్రేక్షకులు వారి సమీక్షలు చూసి సినిమాలకు వెళ్ళేవారు. శ్రీ నందమూరి తారక రామారావు గారు రావణ పాత్రలో అద్భుతంగా నటించి, దర్శకత్వం వహించిన 'శ్రీ సీతారామ కళ్యాణం' సినిమాకు సమీక్ష వ్రాస్తూ, రమణ గారు ఒక చోట ఇలా వ్రాసి ముగించారు. 'తప్పక చూడవలసిన గొప్ప చిత్రం 'శ్రీ సీతారామ కళ్యాణం(అను శ్రీరామారావణీయం)' అని. అందులో శ్రీ రామారావు గారు పోషించిన రావణ పాత్రను బాగా elevate చేసారు. ఆ సమీక్ష చదివిన వెంటనే, రామారావు గారు రమణ గారికి ఫోన్ చేసి-- ఒక సారి వెంటనే రాగలరా! అని ఫోన్ పెట్టేసారు.

రమణ గారు బిక్కు బిక్కు మంటూ వారి వద్దకు వెళ్ళారు. శ్రీ రామారావు గారు వారిని సాదరంగా కూర్చోపెట్టి, ఏమీ చెప్పకుండా మనసారా నవ్వుకుంటున్నారట! 'సింహం నవ్వింది' అంటే అదేనేమో! రమణ గారికి అక్కడి పరిస్థితి అర్ధం కావటం లేదు. వారి ముఖంలో నవరసాలూ కనిపిస్తున్నాయి. నవ్వునుంచి తేరుకొని రామారావు గారు ఇలా అన్నారట--మీరు వ్రాసిన 'శ్రీ సీతారామ కళ్యాణం' సినిమా సమీక్ష చదివాను. మీ సునిశితమైన వ్యాఖ్య నాకు బాగా నచ్చింది. ప్రస్తుతం, నేను 'రక్త సంబంధం' అనే సినిమాలో నటిస్తున్నాను. దాని మాతృక ఒక తమిళ సినిమా. ఆ సినిమాకు మీరు సంభాషణలు వ్రాయండి, నిర్మాతలకు నేను చెబుతాను, అని చెప్పి వారిని సాదరంగా పంపించారు. శ్రీ ముళ్ళపూడివారు ఆ సినిమాతోనే సినీరంగ ప్రవేశం చేసారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమే కాకుండా, తరువాతి రోజుల్లో రమణ గారు శ్రీ రామారావు గారికి పరమ ఆప్తుడు అయ్యారు. శ్రీ రామారావు గారికి రమణ గారితో ఉన్న అనుబంధం, అవగాహనను గురించి మరొక్క చిన్న సంఘటనను తెలియచేస్తాను. అవి రమణ గారు, రామారావు గారు నటిస్తున్న'గుడిగంటలు' సినిమాకు సంభాషణలు వ్రాస్తున్న రోజులు. అది వారికి రామారావు గారితో రెండవ చిత్రం. అంతకు ముందు రమణ గారు వ్రాసిన 'రక్త సంబంధం'లో రామారావు గారికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అందుచేత, రమణ గారంటే రామారావు గారికి ప్రత్యేకమైన అభిమానం.

మరి ఏమైందో ఏమో! గుడిగంటలు షూటింగ్ సందర్భంలో ఒకరోజు రామారావు గారు చాలా కోపంగా ఉన్నారు. "రమణగారు తనను గురించి ఏమనుకుంటున్నాడు?జాగ్రత్తగా ఉండమనండి, లేకపోతే, ఆయనను తీసేసి సముద్రాల జూనియర్ తో వ్రాయిస్తాను." విషయం తెలుసుకున్న తర్వాత దర్శక నిర్మాతలు మధుసూదనరావు , డూండీ గార్లు, రమణ గారి వద్దకు వెళ్లి, "రామారావు గారికి క్షమాపణలు చెప్పండి" అని చెప్పారు. అందుకు రమణ గారు, "నేనేమి తప్పు చేసానని క్షమాపణలు చెప్పాలండి! నేనేమన్నా తప్పు చేస్తే, నన్ను పిలిచి మందలించే చనువు రామారావు గారికి ఉంది. నన్ను తీసేసి సముద్రాల జూనియర్ ను పెట్టుకుంటారన్నారట! ఏమో ఏదో ఒక నాటికి నేనూ అంతకన్నా పెద్ద రచయితను కావచ్చు. అప్పుడు, రామారావుగారితో కాకుండా నాగేశ్వరరావుగారితో సినిమాను తీస్తానేమో! ఎవరికెరుక?" ముళ్ళపూడి వారు అన్న మాటలన్నీ యధాతధంగా దర్శక, నిర్మాతలు రామారావు గారికి తెలియచేసారు.

ఆ మాటలను విన్న తరువాత రామారావుగారికి ఏ మాత్రం కోపం రాలేదు సరికదా, పైగా పెద్దగా నవ్వారట. "రమణ గారు అలా అన్నారా? అయితే, నేను విన్నది ఖచ్చితంగా అబద్ధం అయి ఉంటుంది. ఆయన అలా మాట్లాడి ఉండరు. నేనే తొందరపడ్డాను." అన్నారట రామారావు గారు. అటుపై కాలంలో రమణగారు అనుకున్నట్లే పెద్ద రచయిత అయ్యారు. నిర్మాతగా కూడా మారారు. కానీ, NTR గారితో కాకుండా ANR తోనే సినిమాను తీసారు. అయితే, రమణ గారికి రామారావు గారికి ఉన్న సంబంధాలేవీ చెడిపోలేదు. రామారావుగారి మనసులో రమణ గారి మీద ఉన్న గౌరవం అలానే ఉండిపోయింది. రమణ గారు మాటలు వ్రాసిన మొదటి సినిమా కథానాయకుడు రామారావు గారైతే, రామారావు గారి చివరి సినిమా 'శ్రీనాధ కవి సార్వభౌముడు'కి మాటలు వ్రాసింది కూడా రమణ గారే! అంతే కాదు రామారావు గారికి బంగారు నందిని తెచ్చిపెట్టిన 'కథానాయకుడు' సినిమాకు కూడా రమణ గారే కథను సమకూర్చారు.

శ్రీ రామారావుగారు ముఖ్యమంత్రి అయిన తరువాత పిల్లల కోసం వారి చేత వీడియో పాఠాలను తయారు చేయించారు. చూసారుగా ఒక సద్విమర్శ విమర్శుకుడి జీవితాన్నే మార్చటమే కాకుండా, స్వీకరించిన వారికి కూడా ఎంత పేరు ప్రఖ్యాతలు తెచ్చిందో! విమర్శను గురించి ఇంత విపులంగా చెప్పిన తరువాత, 'రంధ్రాన్వేషణ' గురించి ప్రత్యేకంగా చెప్పటం అనవసరం, కాలయాపన అని అనుకుంటాను. ఎందుకంటే, రంధ్రాన్వేషణ అంటే ఏమిటో ఈ పాటికి మీకే అర్ధమయి ఉంటుంది.

శ్రీ ముళ్ళపూడి వెంకట రమణగారికి, రామారావుగారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ....

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు