అతి సర్వత్రా వర్జ్యయేత్ అంటారు పెద్దలు. కానీ నిద్ర విషయంలో అతి అయినా, మితమైనా కష్టమే. అయితే నేటి యువత స్మార్ట్ ఫోన్లు పేరు చెప్పి నిద్రకు బాగా దూరమైపోతున్నారు. పగలూ, రాత్రీ తేడాల్లేకుండా స్మార్ట్ ఫోనుకు అంకితమైపోతున్నారు. దేనికైనా లిమిట్స్ ఉంటాయి కానీ, మొబైల్ సెర్చింగ్‌కి మాత్రం లిమిట్స్ లేకుండా పోయాయి. అదే నిద్రను లైట్ తీసుకునేలా చేస్తోంది. తద్వారా వచ్చే అనారోగ్య పరిస్థితుల్ని సైతం యువత లెక్క చేయడం లేదు. ఒక్కరోజు నిద్ర చాలకుంటే ఏమవుతుందిలే అనుకుంటే పొరపాటే. ఒక్క రోజు నిద్ర వారం రోజుల నిద్రకు సమానం అంటారు. కానీ నేటి రోజుల్లో ఆ లెక్క అస్సలు లెక్కకు రాదు. ఒక్కరోజు కాదు కదా, వరుసగా వారం రోజులైనా నిద్రను మర్చిపోతున్నారు.
ఇక సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణం. టార్గెట్స్‌ని అనుకున్న టైంలో పూర్తి చేయాలన్న కసితో, డే అండ్ నైట్ సిస్టమ్స్‌కి అతుక్కుపోతున్నారు. తద్వారా చిన్న వయసులోనే లివర్, కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. మనిషి ఆరోగ్యంగా బతకాలంటే సరైన సమయానికి సరిపడా తిండి, నిద్ర ప్రధానమైన అంశాలుగా గుర్తించాలి. దురదృష్టవశాత్తూ, ఆ రెండింటినే నిర్లక్ష్యం చేస్తున్నాం. మనిషి సగటున 6 నుండి 8 గంటలు నిద్రకు కేటాయించాల్సి ఉంటుంది. కానీ 4 నుండి, 6 గంటలు.. అంతకన్నా తక్కువ టైంనే నిద్ర కోసం కేటాయిస్తున్నాం ఈ గజిబిజి బిజీ రోజుల్లో.
చిన్న వయసులో పిల్లలు ఎక్కువగా నిద్రపోయేవారు. కానీ ఆ వయసులో కూడా నిద్ర తగ్గిపోయిందిప్పుడు. చిన్నపిల్లలకు కూడా సరిపడా నిద్ర ఉండట్లేదు. ఇదిలా ఉంటే, సోషల్ మీడియా వచ్చాక టైం అస్సలు తెలీయడం లేదు. ఎంత సేపు కూర్చున్నా, ఇంకా ఏదో సెర్చ్ చేయాలన్న తపన ముఖ్యంగా యూత్‌ని నిద్రకు పూర్తిగా దూరం చేసేస్తోంది. ప్రపంచాన్ని తెచ్చి మన గుప్పిట్లో పెట్టేస్తోంది సరే, కానీ మన చేతుల్లోనే ఉన్న నిద్రకు కేటాయించాల్సిన సమయాన్ని మాత్రం మనకు తెలియకుండానే మింగేస్తోంది. తక్కువే కాదు, ఎక్కువ నిద్ర అయినా కష్టమే. ఎక్కువ నిద్ర కారణంగా వచ్చే సమస్యలు మరెన్నో. కొన్ని అధ్యయనాల ప్రకారం సర్వ రోగాలకు నిద్రే కారణం అని తేలింది. అతిగా నిద్ర పోయే వారిలో ఎక్కువగా ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు, నీరసంలాంటివి బాధిస్తున్నాయట.
నిద్రలేమి కారణంగా మెదడుపై తీవ్ర ఒత్తిడి, కండరాలు, కీళ్లు నొప్పులు, ముఖ్యంగా సంతానలేమి సమస్యలు వేధిస్తున్నాయని తేల్చారు. అంతేకాదు, దీర్ఘకాల వ్యాధుల బారిన పడుతున్నారు కొంతమంది. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం ఎంత అవసరమో. కంటి నిండా నిద్ర కూడా అంతే అవసరం. సో నిద్ర విషయంలో నిర్లక్ష్యం అస్సలు పనికి రాదు సుమీ.!