అనగనగా ప్రశాంతి పుర రాజ్యాన్ని శాంత వర్మ అనే రాజు పాలించే వాడు. ఆయన తన కుమారుడైన సత్యవర్మను విద్యభ్యాసం కోసం వేదవిదుడనే పండితుని ఆశ్రమంలో చేర్పించాడు. కొద్ది కాలం లోనే సత్య వర్మఅందరితో కలసి పోయాడు.
వేదవిదుని ఆశ్రమంలో సత్యవర్మ మిగతా విద్యార్ధులతో పాటుగా అడవికెళ్ళి వైద్యం కోసం వనమూలికలూ, రోజూ గురువు గారు చేసే యజ్ఞం కోసం హోమ ద్రవ్యాలు, వంట చెరకు, ఆహార దుంపలూ, పండ్లూ వగైరాలన్నీ సేకరించే వాడు.
గురుపత్ని పక్వం చేసి వడ్డించే భోజనం అందరితో కూర్చుని భుజించే వాడు. మిగిలిన విద్యార్ధుల్లా తుంగ చాప మీద నేల మీద పవళించే వాడు. తన కంటే ముందు ఆశ్రమంలో చేరిన వినయునితో సత్య వర్మకు బాగా దోస్తు కుదిరింది.
ఒక రోజున వినయుడు గురువు గారిని ఏదో అడగుతుండగా విన్నాడు. గురువు గారు "మంచిది వినయా! సాయంకాలం ఏర్పాటు చేస్తాను" అని చెప్తుండగా అదేదో తెలుసుకోవాలనే కుతూహలంతో ఆ సంధ్య వేళ వినయుడు గురువు గారి వద్దకు వెళ్ళడం చూసి తానూ అనుసరించాడు.
గురువు గారు "వినయా! ఇదో నీవు కోరిన రెండవ వస్త్రం. మరి నీ పాత వస్త్రాన్ని ఏం చేశావు?" అని అడిగారు.
వినయుడు "గురుదేవా! దాన్ని గవాక్షానికి అడ్డుగా కట్టాను."
"మరి అక్కడ అంతకు ముందు ఉన్న వస్త్రాన్ని ఏం చేసావు."
"గురుదేవా! దాన్ని నేను విద్యాభ్యాసం కోసం కూర్చునే తుంగ చాప మీద వేసుకున్నాను."
"మరి నీవు అప్పటి వరకూ కూర్చోను వాడిన వస్త్రాన్నేం చేశావు?"
"దాన్ని తమ పర్యంకము ముందు తమరు కాళ్ళు తుడుచుకోను వేసాను"
"మరి అంతకు ముందున్న అక్కడున్న దాన్నేం చేసావు?"
"గురుదేవా! దాన్ని బాహుదా నదిలో బాగా ఉతికి ఆరేసి దారాలుగా ఊడదీసి ఆ దారాలను ఒక ఉండగా చుట్టి పూలు కట్టనూ, మరి కొన్నింటిని దీపం వెలిగించను వత్తులుగానూ చేశాను. తమ ముందు వెలుగుతున్న ఆముదం దీపంలోని వత్తి అదే గురుదేవా!"
"మంచిది వినయా! "వెళ్ళిరా!" అని గురువు దీవించి పంపడం విన్న సత్యవర్మ, తమ అంతఃపురంలో ఎన్ని వస్త్రాలూ, ఎన్ని ద్రవ్యాలూ వృధా అవుతున్నాయో యోచించి, తాను విద్యాభ్యాసం పూర్తయి వెళ్ళాక ఆ అనవసర వృధానంతా అరికట్టి గురువు గారి బోధనలను అమలు పరచాలనీ, తన సహోధ్యాయి అయిన వినయుని తనకు సలహా దారుగా ఎంపిక చేసుకోవాలనీ నిర్ణయించుకున్నాడు.
పొదుపే వ్యయానికి అదుపు. సుఖాలకూ, కోరికలకూ అడ్డుకట్ట.