చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

చాలా మందిలో ఈరోజుల్లో సహనశక్తి తగ్గిపోతోందేమోననిపిస్తోంది.. పిల్లలకి, పెద్దవారికీ తేడాలేదు. ఒకానొకప్పుడు దేశం సహనశక్తికి పేరుపొందింది. బహుశా వాతావరణం లోని మార్పులే కారణమయుండొచ్చు. పైసపైసా కూడబెట్టి ధనవంతులయినవారు ఎందరో ఉండేవారు.. అలాటిది ఈ రోజుల్లో రాత్రికిరాత్రే కోటీశ్వరులైపోవాలనే యావ ఎక్కువైపోయింది. దానికోసం, కొందరైతే నైతికవిలువలు కూడా పోగొట్టుకోడానికి సిధ్ధపడుతున్నారు. ఎంత త్వరగా పైకొచ్చారో, అదేవేగంతో పాతాళంలోకి కూడా దిగబడుతున్న ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి.
వచ్చిన గొడవేమిటంటే ఈ “ అసహనం “ అన్నది ప్రతీరంగంలోనూ , విషయంలోనూ కనిపించడం. ఉదాహరణకి , ఒకానొకప్పుడు ప్రయాణాలు చేయడానికి, మొదట్లో కాలినడకనా, ఆ తరవాత ఎడ్లబళ్ళు, గుర్రబ్బళ్ళు, తరవాత్తరవాత పడవల్లోనూ, రైళ్ళల్లోనూ ప్రయాణాలు చేసేవారు. విదేశాలకి మాత్రమే ఓడల్లోనూ, విమానాల్లోనూ వెళ్ళేవారు… విమానాల ఆధురీకరణ జరిగేదాకా, ఓడప్రయాణమే ఉండేది. కానీ విమానవేగానికి అలవాటు పడ్డవారికి, ఈ ఓడ ప్రయాణాలంటే విసుగొచ్చింది. కొన్ని గంటల్లో కొన్నివేల మైళ్ళ దూరం చేరడానికి సదుపాయాలుండగా, ఓడలమీద కొన్ని రోజుల ప్రయాణమెందుకూ అనే ఆలోచనొచ్చేసింది అందరికీ.

ఒకానొకప్పుడు డక్కామొక్కీలు తిని రైళ్ళలో ప్రయాణం చేసిన మధ్యతరగతి మనుషులుకూడా, ఈరోజుల్లోరైళ్ళుమానేసి, విమానాల్లోనే ప్రయాణం చేస్తున్నారు.. ఎందుకని అడిగితే, “ ఊరికే  రైళ్ళలో టైమువేస్టండీ.. “ అని సమాధానం. అలాగే ఒకానొకప్పుడు సిటీబస్సులకోసం పడిగాపులు పడి ఎండలో నుంచుని, బస్సు రాగానే , తోసుకుంటూ ఎక్కిన రోజులు మర్చిపోయి, ఇప్పుడు OLA, UBER  ఉంటేనేకానీ, అడుగుబయటపెట్టరు… సదుపాయాలూ, సౌకర్యాలూ ఉన్నప్పుడు, తాహతుని బట్టి ఉపయోగించుకోవాలి, ఎవరూ కాదనరు… కానీ వీటివలన మనుషుల్లో అసహనం పెరిగిపోయింది… దానికి సాయం, ఏదైనా పొరుగూరికి వెళ్ళాల్సొస్తే, వాళ్ళేచెప్పేస్తారు.. “ పోనీ  flight  లో వచ్చేసేయండి అంటూ.. అక్కడికేదో వాళ్ళు రానుపోనూ ఖర్చుపెట్టుకునేట్టు. ఏదైనా అత్యవసరాల్లో అంటే, ఏ దగ్గరివారో స్వర్గస్థులైనప్పుడు వెళ్ళాల్సొస్తే  flight  లో వెళ్ళడంలో అర్ధముంది. కానీ పిడిక్కీబియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్టు, ప్రతీదానికీ విమానయానమే అన్నప్పుడు , కొంచం ఇబ్బందిగానే ఉంటుంది.

ఒకానొకప్పుడు ఏ యాత్రలకైనా వెళ్ళినప్పుడు, ఏ సత్రంలోనో దిగేవారు, వంటసామగ్రికూడా తమతో తీసికెళ్ళి. అలాటిది, ఈరోజుల్లో ముందర ఆ వెళ్ళే చోట  ఓ పేద్ద హొటలేమైనా ఉందోలేదో చూసుకునిమరీ వెళ్తారు. దైవదర్శనం కంటే, మన  comforts  కే ప్రాధాన్యం.
ఈరోజుల్లో పెద్దపెద్ద జీతాలు తెచ్చుకుంటున్న, తల్లితండ్రుల ధర్మమా అని, వారి పిల్లలూ ఇదేబాట పడుతున్నారు. కనీసం ఆ తల్లితండ్రులు , పుట్టడం ఒకానొకప్పటి మధ్యతరగతి లోనే, తరవాత్తరవాత  ఆదాయం పెరిగింది. కానీ వారి పిల్లలు అలా కాదే, పుట్టడమే ధనిక కుటుంబంలో, వారి అలవాట్లూ అదే స్థాయిలో,  వాళ్ళకి ప్రపంచమంతా, తమలాగే ఉన్నట్టనుకుంటారు. రైళ్ళల్లో వెళ్ళేవారంటే చిన్నచూపు, అసలు రైళ్ళలో ప్రయాణం చేయడమన్నదే ఓ ఘోర పాపంకింద భావిస్తారు…

ఇంక ఆ పిల్లలకి ఈ తల్లితండ్రులు , కొండమీద కోతినైనా తెచ్చి ఇవ్వాలనుకుంటారు. ఉదాహరణకి, కాలేజీకి వెళ్ళే పిల్లాడికి మార్కెట్ లో అతిఖరీదైన మోటార్ సైకిలే ఇస్తారు. దాన్నేమో ఇష్టంవచ్చిన స్పీడులో నడిపి, ప్రమాదాలకు లోనైన ఎన్నో సంఘటనలు చూసాము… ఒక్కోప్పుడైతే ప్రాణాలుకూడా పోగొట్టున్నవారినీ చూశాము. అలాగే లక్షలరూపాయిల మొబైల్ ఫోన్లూనూ.. “వాళ్ళకి డబ్బులున్నాయీ ఖర్చుపెట్టుకుంటున్నారూ, మీకెందుకూ” అనొచ్చు…నిజమే.. కానీ ఆ పిల్లల్ని కొంతలోకొంత క్రమశిక్షణలో పెంచితే, వీళ్ళ సొమ్మేంపోయిందో? ఇన్నిన్ని సౌకర్యాలు,  ఈ పిల్లలు జీవితాంతం అనుభవించగలరని గారెంటీ ఏదైనా ఉందా? అలా అనుభవించలేకపోతే , ఆ పిల్లలు భరించగలరా? అప్పుడు వాళ్ళూ “ అసహనానికి “  లోబడరూ? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎర్ర లైటుంటే ఆగే సహనం ఉండదు.. ఇంకెవరూ తనను దాటి వెళ్ళకూడదూ…ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీదాంట్లోనూ సహనశక్తు క్షీణించిపోతోంది.

మరో అసహనానికి ఉదాహరణ… ఒకానొకప్పుడు దీపావళి వచ్చిందంటే, టపాసుల ధ్వని ఉండాల్సిందే.. కానీ ఈరోజుల్లో అవే టపాసులు కాలిస్తే తట్టుకోలేరుట.. కారణానికేముందిలెండి.. ధ్వని కాలుష్యమని పేరుపెట్టారు. మరి సినిమాహాళ్ళలో గుండెలదిరిపోయేట్టు అవేవో  Dolby Sound  లు పరవాలేదుటా? అలాగే హొటళ్ళలో మామూలునీళ్ళు తాగడానికి అసహనం.. అవేవో మినరల్ వాటర్ లోనే పెరిగిపెద్దయినట్టు ప్రవర్తనా, అడిగితే   water pollution  అంటారు.

ఆతావేతా చూస్తూంటే, ఈ “ అసహనాని” కీ , వాతావరణ కాలుష్యానికీ, ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టు కనిపిస్తోంది.
వాతావరణం బాగుపడే సూచనైతే కనుచూపుమేరలో కనిపించడం లేదాయే.. మరి మనుషుల్లో సహనశక్తి తిరిగివచ్చే రోజే లేదంటారా … ?

సర్వేజనా సుఖినోభవంతూ

 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు