ప్రతాపభావాలు - ..

pratapabhavalu

కథలు

కథలు కేవలం కాలక్షేపం కోసం ఒకరు చెప్పడానికి మరొకరు విని ఊ కొట్టడానికి కాదు. కథలు చదువరుల దాహం తీర్చే సాహితీ సెలయేళ్లు. మానసిక వికాసానికి ఎంతగానో దోహదం చేస్తాయి. అందుకే తాతయ్యలు అమ్మమ్మలు పసిమనసుల్లో కమ్మని కథల విత్తనాలు నాటేవారు. అవి మొలకెత్తి మొక్కలై, పుష్పించి, ఫలించి మానవుల్ని మంచి నాగరీకుల్ని చేసేవి. నిన్నటి తరానికి చందమామ కథలే చక్కటి పునాదన్నది జగమెరిగిన సత్యం.

కథల్లో వాస్తవంగా జరిగిన సంఘటనల్ని విన సొంపుగా చెప్పేవి కొన్నయితే, కల్పితాలకు చిలవలు పలవలు కలిపి కమనీయంగా చెప్పేవి మరికొన్ని.

కథ అంటే మనకు తెలియని వింతలు, విశేషాలను కళ్లకు కట్టి, మనుషుల మనస్తత్వాలకు అద్దం పట్టడమే కాదు, ఆలోచనలకు రూపాన్నిచ్చి మనలోని సృజనాత్మకతకు సానబట్టడం.

అనగనగా అంటూ మొదలయ్యే చిన్నప్పటి కథలు భారత, భాగవత, రామాయణాల్లోని చిన్న చిన్న ఇతివృత్తాల్ని తీసుకుని మనోహరంగా, మనసుకు హత్తుకునేలా చెప్పే తీరు అద్భుతం. పేదరాశి పెద్దమ్మ, పూటకుళ్లమ్మ, తెనాలి రామలింగడు, నసీరుద్దీన్, బీర్బల్, మర్యాదరామన్న కథల్లో పాత్రలైనా మనందరి మనసులతో మమేకమైన వాళ్లే.

దెయ్యాలు చేసే మంచి పనులు, మనుషుల మనస్తత్వంతో మసిలే జంతువులు, మానవత్వం చాటుకునే మహారాజులు, దేనికైనా తెగించే సాహస వీరులు, మూర్ఖ శిఖామణులైన పరమానందయ్య శిష్యులు కథల్లో పాత్రలై ఉత్తేజ పరుస్తాయి. నవరస భావాలకీ మనసును వేదిక చేస్తాయి.

యువతను చైతన్య పరచిన వివేకానందుడు, స్వాతంత్ర్య సమరంలో పోరాట పటిమ కనబరచిన భగత్‍సింగ్, మన్నెం ప్రజలకు దన్నుగా నిలిచిన అల్లూరి సీతారామరాజు, జాతిపిత మహాత్మగాంధీల కథలు మనందరికీ నిత్య స్ఫూర్తిదాయకాలు, స్మరణీయాలు, అనుసరణీయాలు.
అరేబియన్ నైట్స్, పట్టువదల్ని విక్రమార్కుడు, భోజరజు కథలు అవిశ్రాంతంగా సాగినప్పటికీ మనకు విసుగు తెప్పించవు. ఆ కథల్లోని ఆసక్తికర మలుపులు, ఆద్యంతం కొనసాగే ఉత్కంఠ, కొసమెరుపుగా మన మేధస్సుని మథించే ప్రశ్నలు, ఇప్పుడు మనం పెద్ద పీట వేస్తున్న వ్యక్తిత్వ వికాసానికి అప్పుడే విత్తు పడిందని చెప్పక తప్పదు.

కథలు విని కలతలు లేని కమ్మని కలల నిద్రపోయి, పొద్దున్నే లేచి మర్చిపోవడం, కథలు కంచికి చేరతాయని నిట్టూర్చడం కాకుండా వాటిలోని విషయాన్ని అవగతం చేసుకుని మన మనో వికాసానికి దోహదపడేలా చూసుకుంటే కథల పారమార్థికత నెరవేరినట్టే!

***
 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు