గాయకులే 'సంగీత' దర్శకులు! - కె. సతీష్ బాబు

singers as musicians

సినిమాల్లో విలన్లుగా నటించినవారు తర్వాతి కాలంలో హీరోలుగా, హీరోలుగా ఉన్నవారు నిర్మాతలు, దర్శకులుగా మారి అన్నిరంగాల్లో తమ విజయప్రస్థానం కొనసాగిస్తారు. అలాగే గాయకులుగా ఉన్నవారు కొన్నిసార్లు సంగీతదర్శకునిగా అవుతారు. అలా గాయకులుగా ఉండి సంగీతదర్శకులుగా మారిన కొందరి గురించి కొన్ని సంగతులు...

ఘంటసాల నేపధ్య గాయకునిగా కొన్నివేల పాటలు పాడారు. అలా గాయకునిగా కొనసాగిస్తూ సుమారు 125 చిత్రాలకు సంగీతం కూడా అందించారు. ఆయన స్వరరచన చేసిన 'లవకుశ', 'రహస్యం', 'చిరంజీవులు', 'మాయాబజార్', 'గుండమ్మ కథ', 'పాతాళ భైరవి', మొదలైన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను, సంగీతాభిమానులను అలరించాయి.

బాల సుబ్రహ్మణ్యం అనగానే నేపధ్యగాయకుడిగా తెలుసు అందరికీ. కానీ బాలులో ఒక ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడు కూడా ఉన్నాడు. ఆయన సంగీతం చేసిన సినిమాల్లో దాసరి 'కన్యాకుమారి', బాపు 'తూర్పు వెళ్ళే రైలు', 'జాకీ', జంధ్యాల 'పడమటి సంధ్యారాగం', 'వివాహ భోజనంబు', సింగీతం శ్రీనివాసరావు 'మయూరి', విజయ బాపినీడు 'మగధీరుడు', వంశీ 'లాయర్ సుహాసినీ', 'కళ్ళు' సినిమాలు ఎన్నో ప్రశంశలు పొందాయి.

'బాచి' సినిమా ద్వారా గాయకుడిగా పరిచయమైన రఘు కుంచె ఎన్నో పాటలు పాడి 'బంపర్ ఆఫర్', పూరి జగన్నాధ్ 'దేవుడు చేసిన మనుషులు' సినిమాలకు సంగీతం అందించాడు.

గాయకుడుగా కొన్ని మంచి పాటలు పాడిన హేమచంద్ర అల్లరి నరేష్ 'అహనా పెళ్ళంట' సినిమా గాక ఇంకో రెండు సినిమాలు సంగీత దర్శకత్వం చేసాడు.

తన అద్భుతమైన గానంతో ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు ఆలపించిన జానకి కూడా శ్రీకాంత్ నటుడుగా పరిచయమైన 'ఫీఫుల్స్ ఎన్ కౌంటర్' సినిమాకు సంగీతం అందించారు.

శంకర్ 'జెంటిల్ మేన్' సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో 'చికుబుకు చికుబుకు రైలే అదిరెను నీ స్టైలే' పాట బాగా ప్రేక్షకాదరణ పొందింది. ఆ పాట పాడిన సురేష్ పీటర్స్ జగపతిబాబు, అర్జున్, వేణులు నటించిన సూపర్ హిట్ చిత్రం 'హనుమాన్ జంక్షన్' కు మ్యూజిక్ అందించాడు.

ఇలా గాయకులే సంగీత దర్శకులుగా మారి కొన్ని సినిమాలకు సంగీతం అందిస్తే, కొందరు సంగీత దర్శకులు కూడా అప్పుడప్పుడు కొన్ని మధురమైన, ప్రేక్షకుల అభిమానుల మెప్పుపొందిన పాటలు ఆలపించారు. వారెవరంటే...

ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన కీరవాణి 'మాతృదేవోభవ' సినిమాలో 'రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే' పాటను, 'ఈ అబ్బాయి చాలా మంచోడు' లో 'ఒక మనసుతో ఒక మనసుకి' లాంటి మంచి పాటలు పాడాడు.

'బద్రి', 'తమ్ముడు', 'ప్రేమంటే ఇదేరా', తదితర సినిమాలకు మ్యూజిక్ అందించిన రమణ గోగుల తను సంగీతం చేసిన చిత్రాల్లో తప్పకుండా కొన్ని పాటలు పాడాడు.

తన స్వరరచనతో సంగీతాభిమానుల్ని అలరించిన ఇళయరాజా కూడా కొన్ని పాటలు పాడాడు. 'కూలీ నెం.1' సినిమాలో ఒకపాటను ఈ మధ్యనే వచ్చిన 'గుండెల్లో గోదారి' సినిమాలో టైటిల్ సాంగ్ ఆలపించాడు. 'కిక్'తో 'దూకుడు' మొదలెట్టి 'బిజినెస్ మెన్' అయిన ఎస్.ఎస్. థమన్ కూడా 'సారొస్తా రొస్తారా' పాటనే కాకుండా తన సినిమాల్లోనే ఒకటో రెండో పాటలు ఆలపిస్తాడు.

భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుల్లో ఒకరైన ఎ.ఆర్.రెహమాన్ కూడా అప్పుడప్పుడు కొన్ని పాటలు పాడతాడు. 'ప్రేమదేశం' లోని 'ముస్తఫా ముస్తఫా' ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. 'నీకోసం' చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అయిన ఆర్.పి.పట్నాయక్ 'మనసంతా నువ్వే', 'నువ్వు లేక నేను లేను', 'నువ్వు - నేను', 'నీకు నేను నాకు నువ్వు' సినిమాల్లో మంచి పాటలు ఆలపించాడు. విక్రమ్ 'శివపుత్రుడు' లో 'చిరుగాలి వీచెనే' పాట సూపర్ హిట్ గా నిలిచింది.

'వందేమాతరం' సినిమాతో సంగీత దర్శకుడిగా మారిన 'శ్రీనివాస్' ఎన్నో సినిమాలకు సంగీతం ఇవ్వడమే కాకుండా గాయకుడుగా కూడా కొన్ని మంచి పాటలు పాడారు. వాటిలో 'మల్లెతీగకు పందిరివోలె', 'ప్రియురాలి అడ్రస్సేమిటో', 'చుక్కల్లో కెక్కినాడు చక్కనోడు' వంటివి కొన్ని.

'బాచి' సినిమాతో సంగీతదర్శకుడిగా పరిచయమయిన 'చక్రి' కూడా కొన్ని మంచి పాటలు ఆలపించాడు. వాటిలో 'వెన్నెల్లో హాయ్ హాయ్', 'నువ్వెక్కడుంటే నేనక్కడుంటా', 'గో గో రయ్ రయ్', 'నూజివీడు సోనియా', 'నీ పలుకులు', 'నీవే నీవే' కొన్ని పాటలు.

కీరవాణి  సోదరుడు కళ్యాణి మాలిక్ కూడా సంగీత దర్శకుడే కాక గాయకుడు కూడా. 'ఈ అబ్బాయి చాలా మంచోడు' సినిమాలోని 'చందమామా కథలో చదివా' పాట సంగీతాభిమానులను విశేషంగా అలరించింది.

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు