తమిళనాడు తీర్థయాత్రలు - కర్రానాగలక్ష్మి

(  రాహుగ్రహ స్థానం తిరునాగేశ్వరం )

గ్రహాలలో 8వది అయిన రాహుగ్రహం గురించి తెలుసుకుందాం .రాహువు గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం అమృతమథనం గురించి తెలుసుకుందాం .

దేవతలు రాక్షసులచేతులలో తరచు ఓడిపోయి దేవేంద్రుడి తో సహా అడవులలో తలదాచుకుంటూ వుండడం , తిరిగి యుధ్దంలో గెలుపొందినపుడు స్వర్గంలో వుండడం చేస్తూవుండేవారు , దానవుల గురువైన శుకృడు మృత సంజీవని మంత్రం తెలిసిన వాడవడంతో మృత దానవులను పునఃర్జీవితులను చేయడంతో దానవుల సంఖ్య అలాగే వుండేది , కాని దేవతల గురువైన బృహస్పతికి మృతసంజీవని మంత్రం తెలియకపోవడమ వల్ల దేవతల సంఖ్య తగ్గిపోసాగింది . దేవతలు విష్ణుమూర్తి సలహాతో రాక్షసుల సహాయంతో అమృతమథనం చెయ్యసాగేరు . కల్పవృక్షం , కామధేనువు , చంద్రుడు , లక్ష్మీదేవి , హలాహలం మొదలయిన వాటితో పాటు అమృతం కూడా వుధ్భవిస్తుంది . అమృతం వుద్భవించేక యెవరుముందు అమృతం సేవించాలనే వాదన జరుగుతుంది .

అప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపధారణచేసి దేవతలను ఒకవైపు దానవులను ఒకవైపు కూర్చుండపెట్టి అందరకీ సమానంగా అమృతం పంచుతానని చెప్పి ముందుగా దేవతలకు అమృతం పంచసాగేడు . అమృతం అయిపోతూవుండడం గమనించిన సింహిక , విప్రచిత్తి ల పుతృడు స్వరభాను అనే రాక్షసుడు దేవతల వరుసలో కూర్చుంటాడు . మోహిని దేవతల వరుసలో వున్న దానవుని గుర్తించక అతనికి అమృతంపోస్తుంది . విషయం గమనించిన సూర్యచంద్రులు మోహినీరూపధారియైన విష్ణుమూర్తికి సంజ్ఞ చెయ్యగా విష్ణుమూర్తి తనచక్రంతో స్వరభాను  శిరస్సు ఖండిస్తాడు . అప్పటికే స్వరభాను  అమృతపానం చేసివుండడంతో అతను అమరుడైయేడు . కాని విష్ణుమూర్తి చక్రం అతనిని రెండు ఖండాలుగా చేస్తుంది , రెండు భాగాలూ జీవించేవుంటాయి .

శిరస్సు భాగం రాహువుగాను మిగతాభాగం కేతువుగాను దేవతలలో స్థానం పొందేరు . కాని జన్మరీత్యా దానవుడు కావడంతో యీగ్రహ ప్రభావం చెడుగా వుంటుంది . ఇది రాహుకేతువుల వృత్తాంతం .హిందూపురాణాలప్రకారం సూర్య గ్రహణం , చంద్రగ్రహణం యేర్పడటానికి వారు రాక్షసులు అమృతం సేవించిన విషయం విష్ణుమూర్తికి చెప్పడం వలన వారు పగబట్టి రవిచంద్రులను మ్రింగడానికి ప్రయత్నించడం వలననే అని అంటారు . తలభాగం వల్ల యేర్పడ్డ రాహువు గురించి యీవారం తెలుసుకుందాం . రాహువు మహా దశ 18 సంవత్సరాలు వుంటుంది . రాహువును ఛాయా గ్రహం అని అంటారు . రాహువు జాతకచక్రంలో దోషంతో వుంటే ఆరోగ్య , ఉద్యోగాలలో గొడవలు , మనఃశ్సాంతి లేకపోవట , కార్యసిద్దిలోపం , ఆటంకాలు కలుగుతూ వుంటాయి , అదే కేతువుతో కూడివుంటే కాలసర్పదోషమేర్పడుతుంది . కాలసర్పదోషం నివారించే మందిరాలు మనదేశంలో యెన్నోవున్నా రెండుమూడు బాగాపేరుసంపాదించుకున్నాయి .

అవి శ్రీకాళహస్తి మందిరం , తిరునాగేశ్వరంలోని నాగనాధ్ మందిరం తమిళనాడు , రాహూరీ రాహుగ్రహ క్షేత్రం మహరాష్ట్ర . మనం యీవారం తిరునాగేశ్వరం గురించి చదువుదాం .తిరునాగేశ్వరం కుంభకోణానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో వుంటుంది . కోవెల వెనుకవైపు పెద్ద పార్కింగు , అక్కడనుంచి నేరుగా కోవెల రెండో ప్రాకారంలోకి ప్రవేశిస్తాం . మొదటి ప్రాకారం నాలుగు వైపులా పెద్దపెద్ద గోపురాలతో వుంటుంది . మూడువైపుల గోపురాలు మూసివేసారు బజారులో వున్న గోపురం మాత్రమే తెరచివుంటుంది . చాలా పెద్దకోవెల , ముఖ్య గోపురంలోంచి లోపలకు వచ్చేకా కుడిచేతివైపు మూడు ఓ మోస్తరు మందిరాలు వుంటాయి . అందులో ఒకటి దుర్గా దేవి మందిరం మిగతారెండూ కూడా మూసివేసి వుండడంతో లోపల వున్నది యేదేముడో తెలియలేదు . రెండో ప్రాకారంలో గోపురానికి యెడమ చేతివైపు వెలుపల వినాయకుడికి చిన్న మందిరం వుంటుంది . లోపల ఓపక్క నాగతీర్థం ,  యెదురుగా ( పుష్కరిణి ) ద్వజస్థంబం , వినాయకుడు గుడి , యెదురుగా పెద్దపెద్ద మండపాలు  , పక్కగా టికెట్ట్ కౌంటరు , నాగదోష  నివారణార్ధం రాహువు పూజ , పాలాభిషేకాలు నిర్వహిస్తారు . ముందుగా శివదర్శనం చేసుకొని తరువాత రాహువు ని దర్శించుకోవాలి .

ఈ కోవెలలో ఈశ్వరుని నాగేశ్వరుడు అని అంటారు . శివలింగం స్వయంభువు , 274 పాతాళపేత్రస్థలం .స్థలపురాణం యేమిటంటే పూర్వం ఈ ప్రదేశం చంపక వృక్షాలతో నిండి నాగులకు నివాసంగా వుండేదట . ఈ ఈశ్వరుని నాగరాజు , వాసుకి , తక్షకుడు మొదలయిన నాగ ప్రముఖులు  పూజలుచేసుకున్నారట . నాగరాజు పూజించుకున్న ఈశ్వరుడు కావడం వల్ల నాగనాథుడు గా పేరుపొందేడు .సంతానం లేని వారు రాహువుకి పాలాభిషేకం చేసుకుంటే నాగదోషనివారణ జరిగి పిల్లలు పుడతారని నమ్మకం .

నాగకన్నెల సమేతుడైన రాహువుకి ప్రతీరోజూరాహుకాలంలో పాలాభిషేకం నిర్వహిస్తారు , ప్రతీ అమావాస్యకు కాలసర్పదోష నివారణ పూజలు జరుగుతాయి . రాహుకాల పూజకు టికెట్ వున్నవారినే అనుమతిస్తారు . భక్తుల గోత్రనామాలతో పూజలు నిర్వహించేక నాగకన్నెల సమేత రాహువుకు పాలాభిషేకంచేస్తారు , యివి రాతి విగ్రహాలు , అభిషేకం చేస్తున్న పాలు విగ్రహాలమీదుగా జారుతున్నప్పుడు అవి లేత నీలం రంగు లోకి మారుతాయి , అది ఒక అధ్భుతమే , ఆదృశ్యాన్ని చూస్తున్న భక్తులు తమ దోషనివారణ జరిగిందని సంతోషిస్తారు . అభిషేకం చేసిన పాలు , పంచామృతాలు ప్రసాదంగా యిస్తారు .రాహువు దర్శనం చేసుకున్నతరువాత అమ్మవారిని దర్శనం చేసుకోవాలి . పార్వతీదేవి ‘ పిరైసోడిఅమ్మ ‘ గా పూజలందుకుంటోంది . ఈ కోవెలలో శివునిక అభిషేకాదులు నిర్వహించరు . పునుగు అద్దుతారు . గిరిజ , లక్ష్మి , సరస్వతినాగనాథుని పూజించుకున్నారట , యిప్పటికీ గిరిజాదేవి శివుని ఆరాధిస్తూ వుంటుందట , అమ్మవారిన రక్షించడానికి భైరవుడు ఆమెకు రక్షగా తిరుగాడుతూ వుంటాడని నమ్ముతారు . గౌతమున శాపం నుండి విముక్తిపొందడానికి ఇంద్రుడు యిక్కడ గిరిజాదేవిని 45 రోజులు పునుగుతో అర్చించేడట . గౌతముడు , పరాశరుడు మొదలగు మునులు కూడా నాగనాథుని సేవించుకొని తరించేరు . అమృతకలశం నుంచి జారిపడిన అమృతబిందువులు యీ మందిరంలోకూడా పడ్డాయని అంటారు . అందువల్ల యీ మందిరానికి , పుష్కరిణికి కూడా విశేష శక్తులు వున్నాయని అంటారు .

దక్షిణామూర్తి , లింగోద్భవం , దుర్గాదేవి , సంధికేశ్వరుడు , సూర్యచంద్రులు , భైరవుడు మొదలయిన విగ్రహాలను చూడొచ్చు . చుట్టూరా వున్న పెద్దపెద్ద మంటపాలలో ముఖ్యంగా ముఖ్యమండపానికి వున్న స్థంబాలకు వున్న శిల్పకళ చూడదగ్గది . వచ్చేవారం కేతువు గురించి తెలుసుకుందాం అంతవరకు శలవు .

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు