వైవిధ్యం
సృష్టి మొత్తం వైవిధ్యభరితమే! కంటికి అగుపడని చిన్న క్రిముల నుంచి తిమింగాల వరకు, శిలీంద్రాల నుంచి మర్రిమానులదాకా, గులక రాయి నుంచి మేరు పర్వతాల వరకు, పిల్ల కాలువల నుంచి సముద్రాల దాకా, సస్యశ్యామల అడవుల నుంచి నీటి చుక్క ఎరగని ఎడారుల వరకు, అగుపించే ఆకాశం నుంచి ఖగోళం దాక అనూహ్యంగా విస్తరించిన సృష్టిని అందరూ కళ్లు విప్పార్చుకుని చూడాల్సిందే! మానవుల్లో శైశవ, బాల్య, కౌమార, యవ్వన, వృద్దాప్య దశలు, కీటకాల్లో ప్యూపా దశ నుంచి రంగు రంగుల రెక్కలున్న సీతకోక చిలుక వరకు, గుడ్డు నుంచి బలిష్ఠంగా ఎదిగిన గద్దదాకా జీవ పరిమాణ క్రమం మనకు ఆశ్చర్యం కలిగించకపోదు. హఠాత్తుగా సంభవించే వాతావరణ మార్పులు, క్షణ క్షణం రూపం మార్చుకునే ప్రకృతిని చూడ రెండు కళ్లు చాలవు.
ప్రకృతి మనకు చెప్పే పాఠం వైవిధ్యం. వైవిధ్యమే కృత్రిమత్వానికి సహజత్వానికి తేడా! జీవ నిర్జీవ స్థితిలకు అదే నిదర్శనం. పురాణాల్లో అంతమంది రాక్షసులెందుకు, భగవంతుడి అన్ని అవతారాలెందుకు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ వైశిష్ట్యాన్ని చాటి చెప్పడానికి ఒక్క రాక్షసుడు, ఒక్క అవతారం చాలదూ. అక్కడా వైవిద్యమే. ఒక్కో అవతారానికీ ఒక్కో ప్రాధాన్యత. ఏక పత్నీ వ్రతం ఒక అవతార గుణ సంపద అయితే, పదారువేల మంది గోపికలతో అమలిన శృంగారం మరో అవతార రాసలీల. ఆది గురువుగా జగతికి గీతోపదేశం. రాముడి సర్వ సమర్థ మార్గం మనకు చూపడానికి ఒక్క రామాయణం సరిపోదూ. రామనామ రుచిని ఎవరికి వారు అనుభూతించిన రచయితలు, తమదైన శైలితో భిన్న రామాయణాలను అందించారు.
మనిషిగా జన్మించిన తర్వాత ఒడి దుడుకులు, కష్ట నష్టాలు, బాధలు భయాలు సహజం. వైవిధ్య జీవన విధానంలో అవి భాగం. నల్లేరు మీద బండి నడకలా సాగుతున్న జీవితంలో ఏర్పడే ఒక చిన్న అపశృతి మనిషిని తీవ్ర అసంతృప్తికి గురిచేస్తుంది. నిరంతరం మెదడులో సుడులు తిరిగే అనవసర ఆలోచనలలు వర్తమానాన్నే కాదు భావి జీవితాన్నీ కోల్పోయేలా చేస్తాయి. జరిగింది ఓ పీడకలని మర్చిపోయి, నిత్య జీవిత వికాసంలో మమేకమైపోతే, మళ్లీ ఆసక్తికర కొత్త జీవిత ప్రయాణం మొదలవుతుంది. గమ్యం చేరుస్తుంది. గడ్డిపోచ సైతం తుపానును తట్టుకుని నిటారుగా నిలబడుతుంది. మనిషి మాత్రం చిన్న చిన్న విషయాలకు బెంబేలుపడతాడు.
సకల జీవరాశిలో విచక్షణ కలిగిన మనిషి ప్రకృతికి అనుగుణంగా ఉండకుండా, తనకున్న ఆలోచనా పరిథితో సుఖాలను కోరుకుంటూ, సౌకర్యవంతమైన జీవనశైలికై వస్తు ఆవీష్కరణలు చేసుకుని ప్రకృతి నుంచి క్రమంగా విడివడుతున్నాడు. అది నాగరిక ఎదుగుదల అనుకుంటున్నాడు.
ఋతుసంబంధ మార్పులు చెట్టు చేమలు, పశుపక్ష్యాదులకు మనిషికి సమానమే. మనిషి మాత్రం ఎండకి, వానకి, చలికి అసహనం ప్రదర్శిస్తాడు. తను నెరపవలసిన నిత్య కార్యాలకు అడ్డంకి అని చిరాకు పడతాడు. వానొచ్చి వెలిసిన ఆహ్లాదకర ప్రకృతిలో నెమలి పురివిప్పుతుంది. నిప్పులు చెరిగే ఎండలో, ఇసుక ఎడారిలో అలుపు సొలుపు లేకుండా ఒంటెలు తిరుగుతాయి. ప్రకృతి పట్ల జంతువులు కనబరచే ఆరాధనను, అన్నీ తెలిసిన మనిషి కనబరచడు.
జీవితంలో సఫలీకృతం కాగోరువారు వివిధ పనులను చేయరు, చేసే పనుల్లో వైవిధ్యం చూపిస్తారంటారు ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస వక్త షివ్ ఖేరా. రోజూ చేసే పనయినా కాస్త వైవిధ్యం చూపెడితే కొత్తదనం గోచరిస్తుంది. మనిషిలో పనిపట్ల ఆసక్తీ సన్నగిల్లదు. ఉత్సాహం ఉరకలేస్తుంది.
యాంత్రిక నిత్యపూజల భక్తి కన్న, వైవిధ్య భక్తినే భగవంతుడు ఇష్టపడతాడని తిన్నడు, శబరి, పోకల దమ్మక్క నిరూపించారు. వైవిధ్యపూరిత జీవన విధానమే మానవ జీవిత సార్థకత అన్నది యథార్థం.