
ఈ రోజుల్లో మీరు ప్రతి దాన్నీ ఓ యంత్రం లాగా మలచే ప్రయత్నమే చేస్తున్నారు. కేవలం ఇతగాడిని 'ప్రయోజనకరంగా' ఎలా వినియోగించుకోవాలి?” అన్న భావనను మించి ఎన్నో ఇతర అంశాలు ఒక మనిషిలో ఉన్నాయి. మనిషి మరెవరికో ప్రయోజనకరంగా ఉండి తీరాలనేమీ లేదు. అదెలా ఉంటుందంటే, బండికి కట్టిన ఎద్దులు బండిని లాగుతూ, అడవిలో స్వేచ్ఛగా గంతులు వేసే జింక పిల్లలను చూసి , 'అయ్యో, పాపం వీటి జీవితమంతా వ్యర్థం చేసుకొంటున్నాయి. వీటివలన ఎవరికీ ఏ ఉపయోగమూ లేదు కదా! ఎలాంటి దుస్స్థితి !' అని దిగులుపడినట్టుగా ఉంటుంది. జింక పిల్లలలో ఆనందం ఉంది. మిమ్మల్ని మీరే ఒక లాగుడు బండికి తగిలించుకొంటే ఇక మీలో ఆనందం ఉండదు.
మీరు ఏదో రకంగా ప్రయోజనకరంగా ఉండాలనే ఆరాటంతో ఆనందమే ఎరగని మనిషిగా అయిపోతే, జీవితానికి ఉద్దేశించిన ప్రయోజనాలన్నీ కోల్పోయినట్టే. మీరు చేసే పనికి అర్థమంటూ ఉండదు. మీ ముఖంలో నిరంతరం విషాదాన్ని నిలుపుకొని , ప్రపంచం కోసం ఏదేదో చేసినందుకూ మెచ్చుకొని, సంఘం మీకు ఏవైనా బిరుదులూ, బహుమతులూ ఇస్తే ఇవ్వచ్చు కానీ అది మీ జీవితములో వాటికి ఏ విలువా ఉండదు.
సూచనల పుస్తకాలు అవతల పారేయండి
మీ జీవితాన్ని మరెవరి తెలివితోనో చూడటం మానండి. మీ జీవితాన్ని మీరే మరింత తెలివిగా గమనించుకోండి. ఇతరుల ప్రభావాలు దూరంగా పెట్టగలగాలే గానీ, ఎవరి జీవితాన్ని వారు వివేకంతో పరీక్షించుకొనే పాటి తెలివితేటలు ప్రతివారికీ ఉంటాయి. ఎందరో ప్రాచీన, ఆధునిక ఆదర్శ పురుషులతో ప్రభావితం అవ్వడమన్నదే మీ సమస్య. దీని వల్ల మీ మనస్తత్వం 'అభిమానుల సంఘం' మనస్తత్వంగా మారిపోతున్నది. అభిమానుల సంఘం మనస్తత్వం ఇంకా అంతగా పరిణితి చెందని స్థితిలో ఉంటుంది.