సాధారణంగా ప్రమాదాలన్నవి చెప్పి రావు. కానీ ప్రమాదాలు జరగడం మాత్రం , నూటికి తొంభై సార్లు, మన అజాగ్రత్త వలనే జరుగుతాయన్నది పచ్చి నిజం. అవడం చిన్నవే అయినా, కొన్నిటిని , తెలిసికూడా జాగ్రత్త తీసుకోకపోవడం వల్లే జరుగుతాయి.. ఒక్కోప్పుడు ప్రాణాలు పోవడమో, లేక అంగవైకల్యమో జరుగుంది.
ఉదాహరణకి రోడ్డు ప్రమాదాల విషయమే తీసుకుంటే, వాహనాలు అతివేగంగా నడపడమో, లేక డ్రైవరు మద్యపానం మత్తులో వాహనాన్ని నడపడం ఓ కారణం.. ఒకానొకప్పుడు మన దేశంలోని రహదారులు, గతుకులతో నిండుండేవి, కాలక్రమేణా, జాతీయ రహదార్లు , వెడల్పుగానూ, గతుకులు లేకుండానీ మారిపోయాయి… బస్సో, కారో నడిపేవారికి పండగే పండగ. అలాటి రోడ్లు చూసేసరికి, డ్రైవర్లకి ఒళ్ళు తెలియదు. ఖాళీ రోడ్డూ, తాగిన మైకమూ కలిసేటప్పటికి , కంట్రోల్ తప్పి ఏ డివైడరునో కొట్టేయడం.. దేశంలో మొబైల్ ఫోన్లు వచ్చేసరికి, ప్రతీ డ్రైవరూ, వాహనం నడుపుతూ, ఈ మొబైళ్ళలో, ఎవరితోనో మాట్టాడడం చూస్తూంటాము… బండి నడిపేటప్పుడు, మొబైల్ లో మాట్టాడకూడదని చట్టం కూడా ఉంది. కానీ పట్టించుకునేవారే కరువయారు.. అలాగే రైల్వే లెవెల్ క్రాసింగు దగ్గర కొన్ని చోట్లైతే అసలు గేటే ఉండదు, ఉన్నా దానికిందనుండి దాటి, అవతలివైపుకి వెళ్ళేవారు కొందరు, చెవిలో మొబైల్ లో మాట్టాడుతూ వెళ్ళేవారు కొందరూ…. గమనించే ఉంటారు, కొందరు స్కూటర్, బైక్ లకు Stand పూర్తిగా తీయరు.. ఏ స్పీడు బ్రేకర్ దాటేటప్పుడో, దానికి స్టాండ్ కొట్టుకుని, ఎన్నో ప్రమాదాలు జరుగుతూంటాయి. అలాగే ఆడవారు స్కూటరు మీద వెనకాల సీటుమీద కూర్చున్నప్పుడు కొంచం ఒబ్బిడిగా కూర్చుంటే , అంటే చీరకొంగో, చున్నీయో మరీ వేళ్ళాడకుండా కూర్చుంటే, పరవాలేదు కానీ, మరోలా జరిగితే, వెనుక చక్రంలో ఆ కొంగు పడేందుకు అవకాశాలుంటాయి…
ఇంక కర్మాగారాల్లో, పనిచేసేవారికి, మెషీన్లు నడిపేముందర safety గురించి అన్ని జాగ్రత్తలూ చెప్పడమే కాక, సాధనాలు కూడా ఉంచుతారు. మొదట్లో కొత్తకాబట్టి వాడతారు. కానీ రోజులుగడిచేకొద్దీ ఓరకమైన overconfidence వచ్చేస్తుంది… “ పరవాలేదూ..” అనుకునే లోపల ప్రమాదంలో పడతారు.
నూటికి తొంభై పాళ్ళు, ఈ ప్రమాదాలకి ముఖ్యకారణం, మన overconfidence అనడంలో సందేహం లేదు..రోజూ చూస్తూంటాం పేపర్లలో, ఫలానా చోట ఘోరప్రమాదం జరిగిందీ, ఇంతమంది చనిపోయారూ, అంతమంది చనిపోయారూ అంటూ… ప్రభుత్వం వారు, వెంటనే ఓ విచారణా కమెటీని నియమించేసి చేతులు దులిపేసుకుంటారు. ఏడాదో, ఏణ్ణర్ధమో విచారించి, ఓ నివేదికకూడా సమర్పిస్తారు… ఫలానా కారణాలవలన ప్రమాదం జరిగిందీ, ఫలానా ఫలానా జాగ్రత్తలు తీసుకోవాలీ భవిష్యత్తులో అంటూ… కానీ , ఎవరూ పట్టించుకోరు వాటి గురించి, మళ్ళీమామూలే.. మన పాలకులలో ఉన్న మరో విచిత్రమేమంటే, ఏదైనా ప్రమాదం జరిగేంతవరకూ ఎవరూ పట్టించుకోరు, జరిగినవెంటనే చేసే ప్రకటనలు మాత్రం కోటలు దాటేస్తాయి… అది ఎలాటి ప్రమాదమైనా సరే. ఉదాహరణకి పెద్దపెద్ద భవనాల్లో, అగ్నిమాపక సాధనాలు తప్పనిసరిగా ఉండాలని చట్టం మాత్రం ఉంది. పట్టించుకునేవారే లేరు.
ఆమధ్యన గుర్తుండేఉంటుంది.. దేశంలోని చాలా ప్రాంతాల్లో, బోరుబావులకోసం తవ్వకాలు ప్రారంభించి, నీళ్ళు పడలేదని, మరో చోట తవ్వేవారు. ముందు తవ్విన గొయ్యిని పూడ్చాలని , ఆలోచనే లేదాయె. వాటిలో చిన్నపిల్లలు పడిపోయి, ఎన్నిరకాల ప్రమాదాలు చోటుచేసుకున్నాయో అందరికీ తెలుసు. వారి వారి అదృష్టాన్నిబట్టి, కొందరు పిల్లలు బతికి బయట పడ్డారు. దేశంలో సర్వే జరిపి, ఎక్కడెక్కడ పూడ్చబడకుండా ఉంచేసిన బోరు గొయ్యిలున్నాయో, వాటన్నిటినీ పూడ్చేస్తామని ఓ ప్రకటనైతే చేసారు. కానీ ఇప్పటికీ ఎక్కడో అక్కడ ఇలాటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
అలాగే ఈ రోజుల్లో టెక్నాలజీ ధర్మమా అని, మొబైళ్ళ్తో ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు తీసుకోవడం, ఓ వేలం వెర్రైపోయింది… స్కూలు, కాలేజీ పిల్లలు విహార/ విజ్ఞాన యాత్రలకు వెళ్ళినప్పుడు, వారిమీద ఎటువంటి నియంత్రణా లేకపోవడంతో, ప్రమాదమైన ప్రదేశాల్లోకూడా, ఈ సెల్ఫీలు తీసుకోవడంలో, ఎక్కడలేని అత్యోత్సాహమూ ప్రదర్శించడం ధర్మమా అని, ప్రమాదాలు ఎక్కువయ్యాయి.
చెప్పొచ్చేదేమిటంటే , ప్రమాదాలు చాలామట్టుకు, మన అజాగ్రత్త, over confidence మూలానే జరుగుతాయి.. ఈ విషయం అందరికీ తెలిసిందే, కానీ , ఆ జాగ్రత్తలేవో తీసుకోవాలనే విషయం మాత్రం, ఎవరూ పట్టించుకోరు.
సర్వేజనా సుఖినోభవంతూ…