దసరా పండుగను యావత్ భారత దేశములోనే కాక దక్షిణ ఆసియా లో చాలా దేశాలలో ఘనముగా జరుపుకొంటారు. ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు ఆబాలగోపాలం ఆనందంగా జరుపు కొను ఈ పండుగ కు గల పౌరాణిక ప్రాముఖ్యము, సంప్రదాయము విశేషాలు తెలుసుకొందాము. ఇవి అందరకూ తెలిసిన విషయములే. కాని మరో మారు మననము చేసుకొనుటలో తప్పులేదు కదా!.
సంస్కృతమున దశ+హర = దసరాగా వ్యవహరింపబడు చున్నది. దశ హరము అనగా పది విషయములను సంహరించుట అని అర్ధము. ఈ పది ఏవి? కామ, క్రోధ, లోభ మొ. అరిషడ్వములు మనస్సు, బుద్ధి, చిత్తము అహము అను మరి నాలుగు కలిపి పది గా గుర్తించి, మనలను సతతమూ, ఆహహించి, దిగజార్చి నాశన హేతువులయిన వీనిని సంహరించి దహించి మనలను మనము కాపాడు కొనుట ఈ పండుగ ప్రధాన ఉద్దేశ్యము. ఈ పండుగ దుర్గా దేవిని వివిధ రూపాలలో ఆరాధించి సకల మంగళ దాయిని అయిన ఆ అమ్మవారి కృపకు పాత్రులగుటకు చేయు ప్రయత్నం. షష్టి నాడు మూలపూజలతో దుర్గా దేవిని పూజించుట ప్రారంభించి, తరువాత అయుధపూజనాడు అన్ని వర్ణముల వారు వారి జీవనోపాధి అయిన వస్తువులకు పూజ జరుపుట సరస్వతి పూజ గాను, పదవ రోజున విజయ దశమిగా పది రోజులు జరుపుకొని జగన్మాత ఆశిస్సులు పొందిన సకల శుభములు సౌభాగ్యము కలుగు నని హిందువుల నమ్మకము. ఏ విషయమయిన ఒక పురాణ గాధ చెప్పి ఒప్పించుట సామాన్యము. ఈ పండుగ వెనుక ఉన్న కొన్ని అట్టి గాధలను చూద్దాం.
మహిశాసురుడను రాక్షసుడు దేవలోకము పై దండెత్తి సమస్త దేవతలకు, ముని గణమునకు కంటకుడయి పీడించు సమయమున, వరప్రసాది బలవంతుడు నగు అతనిని సంహరింప దేవతలకు త్రిమూర్తులకు సాధ్యపడలేదు. గత్యంతరము లేక వారు జగన్మాతను శరణు కోరి, ఆ దానవుని సంహరించి దేవముని గణమును కాపాడమని కోరిరి. కరుణాసాద్యి జగన్మాత త్రిమూర్తులు చేయు ఆహాకారమును అగ్ని రూపము ధరించి వారి నోటినుండి వెలువడి అనంతరము స్త్రీ రూపమున సింహ వాహనము నధిరోహించి మహిశాసురిని తో యుద్ధమునకు తలపడెను, ఈ ఘోర యుద్ధము పది రోజులు సాగినది. మహిషాసుర సంహారము జరిగినది. ఈ ఆనందము పంచుకొని సకల దేవతలు మునులు పది రోజులు పండుగ చేసుకొనిరి. మునులు హోమములు, యాగములు జరిపిరి మరల శాంతి స్తితి నెలకొన్నది. ఆదుర్మార్గుల సంహార సూచకముగా ఈ దసరా పండుగ చేసుకొనుట సంప్రదాయ మయినది. జగన్మాతను పదిరోజులు పది రూపములలొ వివిధ నామములతో పూజించు చున్నాము. ఇది ప్రధానమయిన పురాణగాధ.
పాండవులు వనవాసానంతరము తమ ఆయుధములను ఒక జమ్మి చెట్టు పై దాచి అజ్ఞాతవాసము చేయుటకు విరాట రాజు కొలువులో చేరి ఎవరికీ వారి గత విషయములు బయటపడకుండా ఆ సంవత్సర కాలము గడిపిరి. ఆ సమయములో కౌరవులు విరాట రాజు జైత్రయాత్రలో ఉండగా వారి రాజ్యము, వారి గోవులు ఆక్రమించు నెపముతో యుద్ధమునకు దిగిరి. ఆ సమయమున రాణివాస స్త్రీలు, యువరాజు ఉత్తరుడు, నాట్యాచార్యుడు, సైరంద్రి, వంటలవాడు, గో, ఆశ్వ పాలకులు మాత్రమూ ఉన్నారు. యువరాజుకు యుద్ధమునకేగు పరిస్థితి తప్పలేదు, సారధిగా బృహన్నలను తీసుకుపొమ్మని జననా సలహా పై బయలుదేరి వెళ్ళెను. కౌరవ సేన రాజులు, వీరులను చూచి సైన్యం వెనుదిరుగు సమయమున, అజ్ఞాత వాస దీక్ష ముగిసినదని గ్రహించిన, నాట్యాచార్యుడు జమ్మి చెట్టుపై నున్న గాండివము, అస్త్రములు శస్త్రములు ధరించి జగదేక వీరుడయిన అర్జనుని గా మారి కౌరవ సైన్యమును రాజలను తరిమికొట్టి విరాట రాజును కాపాడెను. ఇదియు నందరికీ తెలిసి కధయే. ఆరోజు విజయ దశమి అనియు, అర్జనునికి విజయుడను నామము వచ్చెనని ఈ పండుగ చేసుకోను ఆచారము పాటించు చున్నాము.
రామాయణ పరముగా శ్రీరాముడు రావణ సంహారం చేసినది ఈరోజే అని అందుచే ఆదినమును విజయ దశమి గా చెప్పు కధయూ ఉన్నది. దీనిని పురస్కరించుకొని ఉత్తర భారతమున ఆ రోజున రావణుని విగ్రహము బాణసంచాతో నిప్పు పెట్టి రావణ సంహార మయినటుల ఆనందించుట ఒక ఆచారము. అశోకుడు కళింగ యుద్ధానంతరము మనస్తాపము చెంది తను చేసిన మారణ హోమమునకు మిక్కిలి చింతించి ఈ విజయ దశమి రోజున బౌధమతము స్వికరించే ననియూ ఒక వాదమున్నది, అందుచే బౌద్దులు ఈ దినమున ఎట్టి బాణసంచా గాని ఇతరములగు వస్తువులు గాని దహనము చెయ్యరు.
మరియెక గాధ - కౌతసుడను బ్రాహ్మణుడు వరాతంతు అను గురువు దగ్గర విద్యనేర్చుకొని గురుదక్షిణ గా పదునాలుగు విద్యలకు సరిపడగల గురుదక్షిణ చెల్లించలేక రఘు మహారాజు నాశ్రయించి అర్ధించెను, రఘు మహారాజు వద్ద అంత ధనము లేకున్నను ఇష్టదేవతను ప్రార్ధించగా బంగారు కాసుల వర్షము పడెను. అది అంతయు తీసుకొమ్మని రఘు మహారాజు కోరినను కౌతసుడు గురుదక్షిణ మాత్రమే తీసుకుని మిగిలినవి రాజ్యములోని వారికి పంచెను. ఈ పవిత్ర దినమును కూడా కొందరు దసరా పండుగగా చేసుకోను ఆచారమున్నది. ఇవి కొన్ని పురాణ గాధలు మాత్రమె.
దేశము మొత్తము మీద బెంగాలు, ఒరిస్సా రాష్ట్రములలో 5 రోజులు ఈ పండుగను చాలా ఘనముగా జరుపుదురు. ఆసమయమున దేశములో నున్న ఆ ప్రాంత వాసులు, వారి స్వగ్రాములకు పోయి ఈ పండుగలో పాలు పంచుకొందురు. ఈ రాష్ట్రములలో ఈ పండుగ దేశమంతటికీ తలమానికము ఈ రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో 16 రోజులు షోడశోపచార పూజలుగా చేయు అచారమూ ఉన్నది... .
ఉత్తర భారత దేశమున కొన్ని ప్రాంతములలో మరియొక ఆచారము ఉన్నది. అక్కడివారు తొమ్మిది మట్టి కుండల్లో నవ ధాన్యములు నాటి పాడ్యమి మొదలు దశమి వరకు నీరు పోసి పెంచుదురు.దశమి నాడు అన్ని గింజలు మొలకలయిన అవి పవిత్రమని శిరస్సున ధరించి దసరా పండుగ చేసుకొండురు.. తెలంగాణా ప్రాంతములో దసరా పది దినములూ సంప్రదాయ బద్ధముగా జరుపుకొని పదవరోజున జోన్నగింజలను బంగారమని చెప్పుచు పెద్దలకిచ్చి వారికి పాదాభి వందనము చేసి ఆశీర్వాదము తీసుకొనుట అందరకూ తెలిసినదే. అదే రోజన గ్రామము లోని వారందరూ పొలాల లోనికి, తోటల లోనికి వెళ్లి పాలపిట్టను దర్శించు ఆచారము కలదు.
దక్షిణ భారత దేశములో ఈ పండగకు మరికొంచము ప్రముఖ్యమున్నది. తమిళనాడు లోని కాలసేఖర పట్టణానికి 20 కిలో మీటర్ల దూరంలో తిరుచందూరు లో ఈ పండుగ అత్యంత వైభవముగా జరిపించెదరు. కన్నడమున ఆంద్రదేశమున కూడా విజయదశమి నాడు పలు రకాల బొమ్మలను అందముగా కొలువు దీర్చి ఆనందించుట దేశములో మరెక్కడా కనిపించదు. ఈ బొమ్మల కొలువు ఆంతర్యము, అందరూ కలసికట్టుగా సఖ్యతగా ఒకే కుటుంబమని అరమరికలు లేకుండా జీవించాలి పది మందికీ చెప్పుటయే.