లవ్ అంటే ప్రేమ. ఆ పదంలోనే ఎన్నో వైబ్రేషన్స్ ఉన్నాయి. తల్లీ - తండ్రీ, అక్కా - చెల్లీ, అన్నా - తమ్ముడు ఇలా అందరి మధ్య ఉండేది ప్రేమే కానీ, ముఖ్యంగా రెండు మనసుల కలయికనే ప్రేమగా అభివర్ణిస్తుంటాం. అసలీ ప్రేమంటే ఏంటీ.? ఎందుకు ప్రేమ వెకిలిగా మారుతోంది. ప్రేమకు అర్ధం మారిపోయింది. దేవదాసు - పార్వతి, లైలా - మజ్ను వంటి ఎందో గొప్ప ప్రేమికుల అపురూపమైఊ ప్రేమకథా చరిత్రలున్న మన సమాజంలో ఇప్పుడెందెకీ లవ్వుకి కొవ్వెక్కింది.? నేటి సమాజం, నేటి తరం యువత విచ్చలవిడితనం, వాటిని ప్రోత్సహిస్తున్న తల్లితండ్రులదే నేరం అనడంలో తప్పు ఎంత మాత్రమూ కాదు,
ప్రతీరోజూ ఎన్నో ప్రేమకథలు విషాదాంతమవుతున్న వార్తల్ని వింటూనే ఉన్నాం. ఒకటీ, రెండు, మూడు ఇలా లెక్కపెట్టుకుంటూ పోతే ఈ ప్రేమతప్పుల చిట్టాకి పేజీలు చాలవు చివరికి. ఓ యువతి ఏ కారణంగానైనా చనిపోయింది అంటే ఆ కారణాల్లో మొదట వెతికే కారణం లవ్. ప్రేమలో మోసగించబడడం వల్లనే ఆమె చనిపోయింది. లేదా, తనను ప్రేమించడం లేదంటూ యువకుడు ఆ యువతిని నరికి చంపేశాడు.. లేదా యువతి మోసగించడం వల్లే యువకుని ఆత్మహత్య.. ఇలాంటి వార్తలే లవ్ ఫెయిల్యూర్స్ మరణాల ఖాతాగా చెప్పుకుంటున్నాం. లవ్ పేరు చెప్పి, డేటింగ్స్ అంటారు. షికార్లు చేస్తారు. ఏదో ఒక చిన్న కారణం విచక్షణ కోల్పోయేలా చేస్తోంది. ఆ క్షణం ప్రాణం తీసుకునేలా లేదా, మరొకరి ప్రాణం తీసేందుకు ప్రేరేపిస్తోంది. నవమాసాలు మోసి, 25 ఏళ్లు ప్రేమతో పెంచిన తల్లితండ్రులది ప్రేమ కాదా.? ఆరు నెలలు, ఏడాది లోపల పరిచయమైన ఓ అబ్బాయి, లేదా అమ్మాయిదేనా ప్రేమంటే. అది టీనేజ్ ప్రేమలోని తియ్యదనమే అనాలో, లేక కొవ్వుతనమే అనాలో డేటింగ్ పేరు చెప్పి ఎలాగూ దాన్ని తీర్చేసుకుంటున్నారు. కానీ తల్లితండ్రులది అలాంటి ప్రేమ కాదా మరి.
తమ జీవితాంతం పిల్లల కోసమే ఆలోచిస్తారు. శారీరకంగా, మానసికంగా ప్రతీక్షణం తన పిల్లాడు, లేదా పిల్ల బాగుండాలనే తాపత్రయపడుతుంటారు. ఒక్క క్షణం ఆగి ఈ ఒక్క ఆలోచన ఎందుకు చేయరు.? పిల్లల ప్రేమ విషయంలో తల్లితండ్రులకూ కొంత రెస్పాన్సిబులిటీ ఉండాలి. మొక్క స్టేజ్‌లో ఉన్నప్పుడే ఆ ప్రేమలోని నిజాయితీ ఎంతో పిల్లలు కనిపెట్టుకుని మసలేలా వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన బాధ్యత తల్లితండ్రులది. అదే సమయంలో తల్లితండ్రుల ప్రేమను అర్ధం చేసుకుని, టీనేజ్‌లో తమ ప్రేమకున్న ప్రాధాన్యత గుర్తించాల్సిన కనీస బాధ్యత పిల్లలది. ఏది ఏమైనా ఒంట్లో పెరిగిన కొవ్వును దించుకోవడానికి వ్యాయామాలు చెయ్యొచ్చు. మరీ డబ్బులు ఎక్కువైతే సర్జరీలు చేయించుకుని మరీ ఆ కొవ్వును తగ్గించుకోవచ్చు. కానీ మారుతున్న సమాజంలో ఈ లవ్వు కొవ్వును దించుకోవడానికి మందూ లేదు. మరో మార్గమూ లేదేమో.