"ఎక్కడ ఉన్నా ఏమైనా....నీ సుఖమే నే కోరుకున్నా " అనేది ఒకప్పటి ప్రేమ జీవుల అంతరంగం...తాము ఏ రోగానికో, పరిస్థితులకో బలైపోతున్నా తాము ప్రేమించిన వ్యక్తి నిండు నూరేళ్ళూ సుఖంగా జీవించాలని కోరుకునేది నిజమైన ప్రేమ...ఇదంతా ఒకప్పటి మాట....ప్రేమకు రెండో పార్శ్వాన్ని చూపిస్తున్నారు ఇప్పటి యువత. నువ్వు నన్ను ప్రేమించక పోతే చస్తాను అనే స్థాయి నుంచి, ప్రేమిస్తావా చస్తావా అనేంత తారా స్థాయికి చేరుకుంది ప్రేమోన్మాదం. ఇది ఎంత మాత్రం మంచి పరిణామం కాదు...రాబోయే రోజుల్లో మనం ప్రేమపేరుతో దాడులను, హత్యలను నిత్యం చూడాల్సి వస్తుంది....సమాజం హింసాత్మకమై పోతుంది...ఇరవైలు దాటని యువకులు కరుడు గట్టిన నేరగాళ్ళను తలపించేలా వాళ్ళని మించి పోయేలా కత్తులతో హింసించడం చూస్తూంటే భయంతో ఒళ్ళు గగుర్పొడుస్తుంది....
ఆడపిల్లలున్న ప్రతి తల్లిదండ్రులకూ గుండె దడ కలిగిస్తుంది...ఏ కౌన్సెలింగ్ లు వీళ్ళని మార్చాలి? ఏ చట్టాలు వీళ్ళని శిక్షించాలి? అసలేమిటి వీళ్ళ ధైర్యం? పువ్వు లాంటి ఒక అమ్మాయిని అంత కిరాతకంగా దారుణంగా హింసించడానికి వీళ్ళదెంత క్రూరమైన మనస్తత్వమనుకోవాలి? తనకిష్టమైన వారిని ప్రేమించే హక్కు అమ్మాయిలకు లేదా? వెంటపడి వేధించినంత మాత్రాన ప్రేమించి తీరాలా? లేకుంటే పగబట్టి వెంటాడి చంపేస్తారా? ఏ సమాజం వీళ్ళనిలా తయారు చేస్తోంది? తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులు - ఎవ్వరూ వీళ్ళని మార్చలేరా? ఇలాంటి కౄరమృగాల బారి నుండి ఆడ పిల్లలు తమను తామెలా కాపాడుకోవాలి? తల్లిదండ్రులు వాళ్ళనెలా కాపాడుకోవాలి? ఇదొక పరిష్కారం లేని సమస్యగా...సమాధానం లేని ప్రశ్నలా మిగిలి పోవాల్సిందేనా?