ఈ వారం ( 15/2 – 21/2 ) మహానుభావులు
జయంతులు
ఫిబ్రవరి 16.
శ్రీ నోరి గోపాల కృష్ణ మూర్తి : వీరు, ఫిబ్రవరి 16 , 1910 న బాపట్లలో జన్మించారు. వీరు అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న ప్రఖ్యాత ఇంజనీరు. సివిల్ ఇంజనీరింగులో వీరి సేవలను గుర్తించిన భారతప్రభుత్వం 1963లో పద్మశ్రీ పురస్కారం, 1972లో పద్మభూషణ పురస్కారాలను ఇచ్చి సత్కరించింది. మహారాష్ట్రలోని కొయినా డ్యాంకు రూపకల్పన చేశారు.. భాక్రానంగల్ డ్యాం మేనేజ్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఈ రెండు డ్యాములను అత్యధ్భుతంగా తీర్చిదిద్దడంలో వీరి కృషి ఉంది. వీరు రెండవ ప్రపంచ యుద్ద కాలంలో పూనా, బెల్గాం విమానశ్రయాలకు లోనోవాలాలో నావల్ ఇంజనీరింగ్ సెంటర్‌కు రూపకల్పన చేశారు..ఇంకా ప్రపంచ భారీ డ్యాముల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, ఇండో బంగ్లాదేశ్ జాయింట్ రివర్ కమిషన్ అధ్యక్షుడిగా సేవలను అందించారు. సివిల్ ఇంజనీరింగ్ రంగంలో ఎన్నో పరిశోధనా పత్రాలను వివిధ సదస్సులలో సమర్పించారు.
ఫిబ్రవరి 19
.శ్రీ వెంపటి సదాశివ బ్రహ్మం : వీరు ఫిబ్రవరి 19, 1905 న తుని లో జన్మించారు. పేరుపొందిన చలన చిత్ర రచయిత. వీరు పంచకావ్యాలు చదివి, ఆంధ్ర, సంస్కృత భాషలలో అపారమైన పాండిత్యాన్ని సంపాదించారు. తిరుపతి వేంకటకవుల ప్రభావంతో అవధాన విద్యపై మొగ్గు చూపారు.. అష్టావధానాలు, శతావధానాలు జరిపి, గద్య, పద్య రచనలు చేసి బాలకవిగా పేరుపొందారు.
1950 దశకం సదాశివబ్రహ్మం సినిమా ప్రస్థానంలో స్వర్ణయుగం. ఈ కాలంలో సంసారం (1950), దాసి (19520, పెంపుడు కొడుకు (1953), కోడరికం (1953), వద్దంటె డబ్బు (1954), కన్యాశుల్కం (1955), చరణదాసి (1956), ఉమాసుందరి (1956), భలేరాముడు (1956), భలే అమ్మాయిలు (1957), సువర్ణ సుందరి (1957), చెంచులక్ష్మి (1958), దొంగల్లో దొర (1957), ఇంటిగుట్టు (1958), స్త్రీ శపథం (1959), శభాష్ రాముడా (1959), కృష్ణలీలలు (1959), అప్పుచేసి పప్పుకూడు (1958), శరద (1957) మొదలైన చిత్రాలకు కథ, మాటలు, కొన్ని పాటలు, పద్యాలు రాసి సినీ రచయితగా తారాపథంలో దూసుకెళ్లారు. ఈ చిత్రాలన్ని ఘనవిజయం సాధించినవే! ఇక ఇల్లరికం (1959) కథను అల్లిన వారు వెంపటి వారే! లలితా శివజ్యోతి వారి 'రహస్యం' (1967) ఈయన చివరి చిత్రం
2. శ్రీ తిక్కవరపు పఠ్ఠాభిరామి రెడ్డి : వీరు ఫిబ్రవరి 19, 1919 న , నెల్లూరు లో జన్మించారు. ప్రముఖ తెలుగు కవి, తెలుగు, కన్నడ సినిమా నిర్మాత, దర్శకుడు. పఠాభిగా ఆయన ప్రసిద్ధుడు. ఫిడేలు రాగాల డజన్, పఠాభి పన్‌చాంగం అనేవి ఆయన ప్రసిద్ధ రచనలు. ఆయన తెలుగులో పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణార్జున యుద్ధం, భాగ్యచక్రం సినిమాలు నిర్మించారు.. కన్నడ సినిమా రంగానికి తొలి స్వర్ణ కమలం సాధించిపెట్టిన సంస్కార చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించారు.. చండ మారుత, శృంగార మాస, దేవర కాడు అనే కన్నడ సినిమాలను నిర్మించారు.. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహిత్యం, సినిమాలేగాక రాజకీయ, సామాజిక రంగాల్లో కూడా కృషి చేసారు.
వర్ధంతులు.
ఫిబ్రవరి 16 :
శ్రీ నార్ల వెంకటేశ్వర రావు : తెలుగునాట ప్రముఖ పాత్రికేయులు మరియు రచయిత. వీ.ఆర్.నార్లగా కూడా వీరు ప్రసిద్ధులు. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలకు చాలా కాలం సంపాదకులుగా ఉన్నారు. పత్రికా రచనలే కాక వారు పలు నాటికలు, కవితలు మరియు కొన్ని కథలు రాసారు. ఆయన వివిధ దేశాల చరిత్రల రచన చేసినా, ఎందరో మహానుభావుల జీవితాలను చిత్రించి సామాన్య ప్రజానికి పరిచయం చేసినా - మరేది చేసినా జర్నలిజానికి ఎనలేని సేవ చేసారు. హేతువాది గా, మానవతావాదిగా జీవించారు. వేల సంఖ్యలో వైవిధ్యభరితమైన వ్యాసాలు రాసారు.
వీరు ఫిబ్రవరి 16, 1985 న స్వర్గస్థులయారు.
ఫిబ్రవరి 17
- శ్రీ పాలగుమ్మి పద్మరాజు : వీరు ప్రముఖ తెలుగు రచయిత. కేంద్ర సాహిత్య ఎకాడెమీ ఎవార్డ్ గ్రహీత.. వీరి కథ “ గాలివాన “ ప్రపంచ కథానికల పోటీలో ద్వితీయ బహుమతి పొందింది. తన జీవిత కాలములో ఈయన 60 కథలు, ఎనిమిది నవలలు, ముప్పై కవితలు ఇంకా ఎన్నెన్నో నాటికలు మరియు నాటకాలు రచించారు. మూడు దశాబ్దాల పాటు , ఎన్నో తెలుగు సినిమాలకి , కథ, మాటలు రాసారు.
వీరు ఫిబ్రవరి 17 , 1983 న స్వర్గస్థులయారు.
- శ్రీ జిడ్డు కృష్ణమూర్తి : ఆయన ఓ ప్రముఖ తత్వవేత్త. 1929 నుండి 1986 లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశారు.. ఆయన స్పృశించిన ముఖ్యాంశాలు – “మానసిక విప్లవం, మనోభావ విచారణ, ధ్యానం, మానవ సంబంధాలు, సమాజంలో మౌలిక మార్పు” చిన్నప్పట్నుంచీ ఆయన ఏవిషయాన్ని పూర్తిగా నమ్మక, ప్రతీ విషయాన్నీ శంకించేవారు.. తనకు ప్రత్యక్ష ప్రమాణం దొరికినప్పుడు మాత్రమే దాన్ని నమ్మేవారు.
వీరు ఫిబ్రవరి 17, 1986 న స్వర్గస్థులయారు.
ఫిబ్రవరి 18
శ్రీ దగ్గుబాటి రామానాయుడు : వీరు ప్రముఖ చలనచిత్ర నిర్మాత, నటుడు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత. మాజీ పార్లమెంట్ సభ్యుడు. ఒకేవ్యక్తి శతాధిక సినిమాలు నిర్మించి, గినెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం సంపాదించారు.
వీరు ఫిబ్రవరి 18, 2015 న స్వర్గస్థులయారు.
ఫిబ్రవరి 19
శ్రీ జయంతి రామయ్య పంతులు : కవి మరియు శాసన పరిశోధకులు. తెలుగులో వ్యవహారిక భాషోద్యమం జరిగినప్పుడు ఆయన గ్రాంథికవాదులకు నాయకత్వం వహించి పోరాడారు. దీని కారణంగా ఆయన తెలుగు సాహిత్య చరిత్రలో ముఖ్యమైన స్థానం పొందారు. ఆంధ్ర వాజ్ఞ్మయానికి ఎంతో సేవ చేసారు.
వీరు ఫిబ్రవరి 19, 1941 న స్వర్గస్థులయారు.
ఫిబ్రవరి 21
శ్రీ స్థానం నరసింహారావు : ప్రసిద్ధ రంగస్థల మరియు తెలుగు సినిమానటుడు. సత్యభామ, చిత్రాంగి మొదలైన అనేక స్త్రీ పాత్రలను సుమారు 40 సంవత్సరాలకు పైగా ధరించి ప్రేక్షకాభిమానంతో సహా పద్మశ్రీ పురస్కారంపొందారు. వీరు సుమారు 3000 నాటకాల్లో స్త్రీపాత్ర ధరించారు. “ నటస్థానం “ పేరుతో తన నాటకానుభవాలు రచించారు.
వీరు ఫిబ్రవరి 21, 1971 న స్వర్గస్థులయారు.