గత కొన్ని సంచికలలో నవగ్రహ స్థానాల గురించి తెలుసుకున్నాం కదా , ఈ వారం నుంచి తిరిగి మనం కుంభకోణం చుట్టుపక్కల వున్న మరికొన్ని మందిరాల గురించి తెలుసుకుందాం .
రాహుగ్రహ స్థానం గురించి చదివి నప్పుడు మనం తిరునాగేశ్వరం పట్టణం గురించి చదివేం . తిరునాగేశ్వరం గురించి చెప్పుకొనేటప్పుడు అక్కడ వున్న మరో పెద్ద కోవెల గురించి కూడా చెప్పుకు తీరాలి . రాహుగ్రహస్థానం కోవెలంత పాతది , ఆకారంలో అంతపెద్దది అయిన ‘ ఉప్పిళియప్పన్ ‘ కోవెల గురించి కూడా చెప్పుకోవాలి . ఓ పాటి పట్టణమైన తిరునాగేశ్వరంలో యింత పెద్ద మందిరాలు వుండడం వింతనే చెప్పుకోవాలి .
ఈ మందిరాన్ని ‘ వెంకటాచలపతి ‘ , ‘ ఉప్పిళియప్పన్ ‘మందిరమని కూడా అంటారు . అయిదంతస్థుల రాజగోపురం చుట్టూర రాతితో నిర్మించిన ప్రహారీగోడ , రాజగోపురం దాటి లోపలకు వెళితే లోపల పుష్కరిణి , పెద్ద పెద్ద కళ్యాణమంటపాలు , అయిదారు గదులతో వున్న గెస్ట్ హౌసు , మరో రెండు చిన్న గెస్ట్ హౌసులూ వుంటాయి , అవన్నీ చూస్తే యిక్కడ భక్తులు తమ సంతానానికి వివాహాలు జరిపిస్త వుంటారని తె. లుస్తూ వుంటుంది . పెద్ద ఆవరణ దాటి రెండో ప్రాకారం లోకి వెళితే వంద స్థంబాల మండపం , వెయ్యిస్థంబాల మంటపం వుంటాయి , స్థంభాలమీద శిల్పాలు శిల్పుల ప్రతిభను చాటుతూ వుంటాయి , కళ్లు తిప్పుకోలేం , ఒక స్థంబం మీద వున్న శిల్పాలు మరో స్థంబం మీద కనిపించవు . దేనికదే సాటి , విశాలమైన మంటపాలు దాటుకొని వెళితే ఓ పక్క పెద్ద రథం , మరో పక్క చిన్న రథం వుంటాయి , ఓ పక్కగా మందిరానికి చెందిన ఏనుగులు గొలుసులతో కట్టి వుంటాయి , తమిళనాడు మందిరాలలో ముఖ్యంగా విష్ణుమూర్తి మందిరాలలో ఆలయానికి చెందిన ఏనుగులు , ఆవులు వుంటాయి , స్వామి వారికి ‘ గజసేవ ‘ చెయ్యడం , పూజారులు గోమాతకు పూజలు నిర్వహించడం చూసేం .
రెండవ ప్రాకారంలో తులసివనం పెంచుతున్నారు . ఈ తులసి వనం మధ్యలో రాతి మంటపం వుంటుంది , ఈ మంటపంలో వసంతోత్సవం సమయంలో ఉత్సవమూర్తులను ఓ వారం రోజులు వుంచుతారు , ప్రతీ సంవత్సరం వసంతఋతువులో యీ వసంతోత్సవాలను నిర్వహిస్తారు బంగారు గర్భగుడిలో శంఖచక్రాలు ధరించిన నిలువెత్తు విష్ణుమూర్తి భూదేవి మార్కండేయుని తో దర్శనమిస్తాడు . అయితే ఈ విగ్రహం తిరుమల లోని వెంకటేశ్వరుని పోలి నామాలతో వుంటుంది , అందుకేనేమో స్వామిని ‘ వెంకటా చలపతి ‘ అని అంటారు .ఆళ్వారులైన ‘ దేశిక ‘ , ‘ రామానుజ ‘ , ‘ రామ ‘ లకు వేరు వేరు ఆలయాలువున్నాయి , ఆంజనేయుడు , గరుడాళ్వారు , సుదర్శనుడు లకు వేర్వేరు మందిరాలువున్నాయి , గర్భగుడి గోపురం మీద విష్ణు కథలు చెక్కివుంటాయి .
తిరుమల లోని వెంకటేశ్వరుని లాగానే ఈ స్వామి కూడా చాలా ధనవంతునిగా కనిపిస్తాడు . వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలతో స్వామివిగ్రహం కళకళలాడుతూ వుంటుంది . ఈ మందిరంలో మూలవిరాట్టుకే కాక ఆంజనేయుడికి కూడా వజ్రవైఢూర్యాలు పొదిగిన ఆభరణాలు వుండడం విశేషం .
ఈ స్వామికి తులసిదళం సమర్పిస్తే కోరిన కోర్కెలుతీరుస్తాడట .
ఈ కోవెలలో తులసికి యెక్కువ ప్రధాన్యత వుంది . ఇక్కడ అమ్మవారు భూమిదేవిగా పూజలందుకుంటోంది . ఈ మందిర నిర్మాణంలో ద్రవిడ , మలబారు శిల్పకళల మిశ్రమం కనిపిస్తుంది . ఈ మందిర పునః నిర్మాణం ఏడవ శతాబ్దానికి చెందిన చోళరాజులు చేసినట్లుగా శిలాశాసనాలు యీ మందిరంలో దొరికేయి , వారి తరువాత వచ్చిన పాండ్య , పల్లవులు , విజయనగర రాజులు , తంజావూరు నాయకర్లు మరమ్మత్తులు , మంటపాల నిర్మాణాలు చేసినట్లుగాను , కోవెలకు అనేక బంగారు ఆభరణాలు , మాన్యాలు సమర్పించినట్లగా చరిత్రలో పేర్కొన బడింది . మనం యిప్పుడు చూస్తున్న ఈ మందిరం 1900 లలో నిర్మింపబడింది .
ప్రతీ సంవత్సరం ఫాల్గుణ మాసం లో వేంకటాచలపతికి రథాయాత్ర నిర్వహిస్తారు .
ఈ కోవెల 108 దివ్యదేశాలలో 60 వ దివ్య దేశంగా పేర్కొనబడింది , ఈ మందిరాన్ని ‘ తిరువిన్నారు ‘ మందిరం అని స్వామిని ‘ తిరువిన్నారప్పన్ ‘ అని కూడా అంటారు .
కోవెల అంతా చూసేసేం కదా ? ఇప్పుడు మనం వెంకటా చలపతిని ‘ ఉప్పిళి యప్ప ‘ అని యెందుకు పిలుస్తున్నారో తెలుసుకుందాం , అంటే స్థలపురాణం అన్నమాట .
తులసీ దేవి విష్ణమూర్తి సన్నిథికోరి తపస్సుచేయనారంభిస్తుంది , ఆమె తపస్సును మెచ్చి విష్ణుమూర్తి ఆమ ఒడిలో లక్మీదేవి పెరిగేటట్లు వరమిస్తాడు, తులసి ‘ తిరువిన్నారు ‘ లో తులసివనంగా వెలుస్తుంది , కాలాంతరాన మార్కండేయముని లక్ష్మీదేవిని కూతురుగాను , విష్ణుమూర్తిని అల్లునిగా పొందగోరి తపస్సుచేయనారంభిస్తాడు , వెయ్యి సంవత్సరాలు తపస్సుచేయగా విష్ణుమూర్తి ప్రసన్నుడై మార్కండేయునకు లక్ష్మీదేవిని పుత్రికా పొందేవరాన్ని యిస్తాడు .
వరాన్ని పొందిన మార్కండేయుడు ‘ తిరువిన్నారు ‘ లోని తులసివనం సమీపించగానే అతనికి లక్ష్మీదేవి ఆప్రాంతంలోనే వున్నట్లుగా అనుభూతి కలుగు తుంది . అక్కడ పెరుగుతున్న బాలికను లక్ష్మిగా గుర్తించి ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వుంటాడు . బాలిక యుక్తవయసుకు రాగా ఓ నాడు ఓ వృద్ద బ్రాహ్మణుడు మార్కండేయముని వద్దకు వచ్చి బాలికను వివాహ మాడదలచినట్లు చెప్తాడు , విష్ణుమూర్తిని తన అల్లుడిగా పొందాలని అనుకొంటున్న ముని వృద్దబ్రాహ్మనునకు తన కూతురునివ్వలేక తన కూతురు యింకా పసిదని , ఆమెకు వంటచెయ్యడం కూడా సరిగారాదని , ఉప్పుకు పప్పుకు తేడాతెలియదని అంటాడు , దానికా బ్రాహ్మణుడు నీ కూతురుకు వంటరాకపోయినా ఫరవాలేదు , ఉప్పులేని వంటను కూడా నేను చాలా ప్రీతిగా తినగలనని జాగుచెయ్యక బాలికనియ్యమని అంటాడు . వృధ్దునకు కూతురుని యివ్వలేక మనసులో విష్ణుమూర్తిని తలచుకొని కన్నులు మూసుకొని పరిపరివిధాల స్వామిని వేడుకొని కనులు తెరువగా శంఖచక్రాలు ధరించిన స్వామి బ్రాహ్మణుడి జాగాలో వుండటం చూచి జరిగినదంతా విష్ణుమాయగా గుర్తించి స్వామికి సాష్టాంగ ప్రణామములుచేసి ఫాల్గుణ మాసంలో శ్రవణం నక్షత్రంలో తన కూతురును విష్ణుమూర్తికిచ్చి వివాహం జరిపించేడు .
అందుకే యీ కోవెలలో తులసి వనం పెంచుతున్నారు , స్వామికి చేసే నైవేద్యంలో ఉప్పు వెయ్యరు .
మందిర ప్రాకారంలో వున్న పుష్కరిణి మహిమను తెలియజేసే కథ తెలుసుకుందాం . పూర్వం ఓ రాజు ముని శాపం వల్ల పక్షిగా మారిపోతాడు . శాపవిముక్తి యెలాగో తెలియని రాజు పక్షిరూపంలో తిరువిన్నారు తులసివనంలో వున్న ఓ వృక్షం పై గూడు నిర్మించుకుంటాడు . ఓ నాడు తీవ్రమైన గాలివాన రాగా ప్రాణభయంతో గూడునంటిపెట్టుకొని వుంటుంది , రాత్రివీచిన గాలికి గూడుచెదిరి పట్టుతప్పి పక్షి క్రిందనున్న పుష్కరిణిలో పడిపోతుంది , నీటిలో పడ్డ పక్షి తిరిగి తన పూర్వ రూపాన్ని పొంది రాజుగా మారిపోతుంది . అప్పటినుండి యీ తీర్ధ మహిమను గుర్తించి యెందరో యీ తీర్ధం లో స్నానాలు చేసి సర్వరోగాలనూ పోగొట్టుకుంటున్నారు , యీ తీర్ధానికున్న మరో మహత్యం యేమిటంటే రాత్రీపగలు అనే తేడా లేకుండా యీ తీర్ధంలో స్నానాలు చెయ్యొచ్చట , అందుకే ఈ పుష్కరిణిని ‘ అహోరాత్రతీర్ధమని ‘ అంటారు .
వచ్చేవారం మరో ప్రసిధ్ద దేవాలయాన్ని దర్శించుకుందాం , అంతవరకు శలవు .