ప్రతాప భావాలు! - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

గృహస్థు

ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు. నిజమే, భర్తకు తగిన ఇల్లాలిగా, ఇంటిని చూడముచ్చటగా అలంకరించి, పిల్లాపాపల్ని అందంగా ముస్తాబు చేసి ఇంటిల్లిపాదికీ అలుపు సొలుపు లేకుండా అన్ని అవసరాలు తీర్చే స్త్రీ మూర్తి సాక్షాత్తు భగవంతుని ప్రతిరూపం. అయితే ఆ ఇంటిని నిలబెట్టే ఒంటి రాట మాత్రం గృహస్థు. గృహస్థు ధర్మం నిర్వహించడం అంత సులభం కాదు. కుటుంబ సభ్యుల కడుపు నింపడానికి, కంచెలా కాపుకాయడానికి, అవసరాలు తీర్చడానికి అహర్నీశలూ రెక్కలు ముక్కలు చేసుకునేది, మానసికంగా నలిగిపోయేదీ ఆయనే. కాళ్లు తడవకుండా ఏరు దాటొచ్చు కాని కళ్లు తడి కాకుండా సంసారాన్ని ఈదలేమని అనుభవజ్ఞులు చెప్పింది ఆ వ్యక్తి గురించే.

ఎన్నో సమస్యలు మరెన్నో బాధలు. అన్నీ మునిపంట భరిస్తూ జీవన గమనంలో ముందుకు సాగాల్సిందే తప్ప విచారిస్తూ క్షణం విశ్రాంతి తీసుకోడానికి వీలుండదు. తన చేత తాళి కట్టించుకుని పుట్టింటినొదిలి తనను నమ్ముకుని వచ్చిన ఇల్లాలు మొదలు పుట్టిన పిల్లల ఎదుగుదల, చదువు, ప్రయోజకత్వం అన్నీటి వెనకాల ద్యోతకమయ్యేది గృహస్థు కృషి, వ్యూహత్మకతే.

కుటుంబం- సంఘంలో ఒదిగిపోయి ఆదర్శప్రాయంగా నిలిచి పదుగురి ప్రశంసలకు కారకమైందంటే అది ఆయన ఆశలు, ఆశయాలను నిర్మాణాత్మకంగా, నేర్పుగా కూర్చిన అందమైన కూర్పు.  

గృహస్థు తన బాధ్యతలను సంతృప్తిగా నెరవేర్చి తన వయసు ఉడిగిపోయిందని విసుగు, విరక్తి చెంది ఎక్కడ చతికిలపడి పోతాడో అని ఆయనలో ఉత్సాహం రేకెత్తించడానికి, ముందుకు ఉరకలెత్తించడానికి మన ధర్మ శాస్త్రాలు కొన్ని ఉత్సవాలను, వేడుకలను రూపొందించాయి.

మనిషి తన నూరేళ్ల జీవిత కాలంలో ప్రతి పది ఏళ్లకీ ఏదో ఒక మార్పుకి గురౌతాడని ఆయుర్వేదశాస్త్ర పితామహుడు ధన్వంతరి తెలియజేశాడు.

వ్యక్తికి పది సంవత్సరాల వయసు వరకు బాల్యంగా పరిగణిస్తారు. ఏదైనా చేయకూడని పని చేసినా బాల్య చేష్ట అని అందరూ సర్దుకుపోయే వయసది. పదకొండు నుంచి ఇరవై వరకు బుద్ధి వికసిస్తుంది. ఈ పదేళ్ల కాలంలో ఏవి నేర్చుకుంటే అవి గాఢంగా మనసులో నాటుకుపోతాయి. ఇరవై ముప్పై మధ్య శరీరబలం పెరుగుతూ ఏ సమస్యనైనా శారీరకంగా సాధించవచ్చనే ధ్యాసలో ఉంటారు. ముప్పై నుంచి నలభై వరకు శరీర, బుద్ధి బలాలు తేజోవంతంగా ఉంటాయి. నలభై నుంచి యాభై లోపల మాత్రం చక్షుర్బలం తగ్గుతుంది. శరీర పటుత్వం తగ్గి, ముడతలు పడ్డం, జుత్తు నెరవడం మొదలై శరీరానికి, మనసుకు పెద్దరికం అలవడవలసిన వయసది.

ఇక్కడిదాకా వ్యక్తి ఏ ఉత్సవం జరుపుకోవలసిన అవసరం లేదు.

వ్యక్తి వయసు అరవైకి చేరగానే షష్టిపూర్తి చేసుకోవాలంటుంది శాస్త్రం. ఎందుకంటే ఆ వయసులో మనిషి పడమటికి వాలుతున్న సూర్యుడు. చిక్కడం, వృద్ధాప్యలక్షణాలు ప్రస్ఫుటమవడం, వ్యాధులకు గురవడంలాంటి కారణాలతో ఆలోచనలు, బుద్దులు, మాటలు తరచుగా మారుతుండడం జరుగుతుంది. సహజ స్థితిని కోల్పోయి ప్రవర్తించే వయసు ఇది. చాదస్తం, విసుగు, చిరాకు, మనోవ్యధలతో అన్యమనస్కంగా ఉంటాడు. ఇంట్లోవాళ్లతో సహా బంధువులందరూ ఆ వయసులో షష్టిపూర్తి అనే శుభకార్యం చేసి- దిగులు పడకు, మేమంతా నీవెంట ఉన్నాం అని ధైర్యన్ని కలిగించాలి. అలాగే డెభ్బై చివర్లో సప్తతి, ఎనభై నిండాక అశీతి, ఎనభై నాలుగు నిండాక సహస్ర చంద్రదర్శనం, నూరేళ్లు నిండాక శతమాన ఉత్సవం, ఆ తర్వాత జీవించి ఉంటే ప్రపౌత్రశాంతి ఉత్సవం జరుపుతారు.

ప్రాచీనులు ఏ వైదిక కార్యక్రమం సూచించినా అందులో వ్యక్తి క్షేమం దాంతోపాటు దేవతల అనుగ్రహం, అతణ్ని ఆశ్రయించిన అన్ని కుటుంబాల సుఖ శాంతులు నిబిఢీకృతమై ఉంటాయి తప్ప నిరర్థకం, నిష్ప్రయోజనం కాదు.

డెభ్బై, ఎనభై, ఎనభై నాలుగు సంవత్సరాలు నిండిన శుభ సందర్భాల్లో ఆయన సంతానం పూనుకుని గృహస్థు అయిన ఆ మహానుభావుడికి శుభకార్య వేడుకలు నిర్వహిస్తే ఆయనకి ఆనందం, బంధుమిత్ర దర్శనం కారణంగా నిండు నూరేళ్లు తనవాళ్లు తనను కనిపెట్టుకుని ఉంటారని, సుఖంగా తనవాళ్ల మధ్య జీవించగలననే ధైర్యం వస్తుంది. మరణభయం తొలగి అంతర్యామి మీద మనసు నిలబడుతుంది.

 

***

 


 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు