న్యూ ఇయర్ డే వెళ్లిపోయింది. సంక్రాంతి హాలీడేస్ కూడా వచ్చి వెళ్లిపోయాయి. ఎంజాయ్‌మెంట్ డేస్ ఖతమ్. ఇక మిగిలుంది ఎగ్జామ్స్ టెన్షన్. అది కూడా రానే వచ్చేసింది. రివిజన్ లిస్టుల ప్రిపరేషన్స్‌లో టీచర్లు, పిల్లల్ని ఎగ్జామ్స్‌కి ఎలా సిద్ధం చేయాలా.? అనే టెన్షన్‌లో పేరెంట్స్ తలమునకలవుతున్నారు. ప్రాక్టీసింగ్ లిస్టులు పట్టుకుని పేరెంట్స్ తమ తమ ఫ్యామిలీ డాక్టర్స్ దగ్గరికి పరుగులు తీస్తున్నారట. అదేంటీ ఎందుకా.? అనుకుంటున్నారా.?
అవును మరి తమ పిల్లాడు ఎన్ని గంటలు చదవాలి.? ఎన్ని గంటలకు నిద్రపోవాలి.? అనే వివరణ కూడా ఆ ఎగ్జామ్స్ లిస్టులో పొందుపరిచారు మరి టీచర్లు. సో ఆ టైంని మ్యానేజ్ చేయడంలో ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల దృష్ట్యా తమ తమ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు మానసిక వైద్య నిపుణుల వద్దకు పేరెంట్స్ ఉరుకులు పరుగులు పెడుతున్నారట. అదీ సంగతి.
ఇక చదువుకోవడం అనేది ఒకప్పటి మాట. చదువు'కొనడం' అనేది ఇప్పటి మాట. ఎక్కువ ఖర్చు పెడుతున్నాం కాబట్టి, అంతకన్నా ఎక్కువ చదువు వచ్చేయాలి అని తల్లితండ్రులు, ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా విద్యార్ధుల్ని బాదేయాలని విద్యా సంస్థలు.. వెరసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేస్తున్నారు. ఒకటో తరగతి నుండి, ఉన్నత విద్య వరకూ ఈ ఒత్తిడి అనేది విద్యార్ధుల మీద సర్వసాధారణమైపోయింది. మానసిక వైద్య నిపుణులు చెబుతున్న దాన్ని బట్టి తమ వద్దకు వస్తున్న పేషెంట్లలో ఎక్కువమంది విద్యార్ధులే ఉంటున్నారని తెలుస్తోంది. టీచర్లు ప్రిపేర్ చేసిన స్టడీస్ టైమ్ టేబుల్ లిస్టు ప్రిపరేషన్‌లో భాగంగా టైం టూ టైమ్ తిండి, నిద్ర లేకపోవడంతో, తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారనీ, ఒకానొక సిట్యువేషన్‌లో ఈ పరిస్థితి పిల్లల్లో విపరీత ధోరణులకు దారి తీస్తోందనీ మానసిక నిపుణులు లేటెస్ట్ సర్వే ద్వారా చెబుతున్నారు.
విద్యలేని వాడు వింత పశువు' అనే మాట సంగతేమో కానీ, విద్య ఎక్కువైపోయినవాడి పరిస్థితి కూడా ఓ వింత జంతువుకి ఏమాత్రం తక్కువ కాదిప్పుడు. చదివిన చదువుకీ చేస్తున్న ఉద్యోగానికి పొంతన లేని రోజులివి. ఎంటెక్ చేసిన ఓ కుర్రాడు ఫుడ్ డెలివరీ బోయ్‌లా పని చేస్తున్నాడు. ఎంబీఏ చేసిన కుర్రోడు రైల్వేలో చాలా కింది స్థాయి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటున్నాడు. అంటే విద్యా వ్యవస్థ విద్యార్ధుల్ని ఎటువైపు నడిపిస్తోంది.? ఈ పరీక్షలు, పరీక్షలు తెచ్చే తలనొప్పులు విద్యార్ధుల్ని ఎక్కడి దాకా తీస్కెళ్లిపోతున్నాయి. నాలెడ్జ్‌తో సంబంధం లేకుండా, మార్కుల కొలబద్దే ప్రామాణికం అయితే పరిస్థితులు ఇలాగే ఉంటాయి మరి. ఎగ్జామ్స్ వస్తున్నాయంటే చదవాలి తప్పదు. కానీ ఆ చదువు మరీ బుర్ర పేలిపోయేలా ఉండకూడదంతే.!