ఒక్కసారి ఇంటర్నెట్‌లోకి ఎంటర్ అయితే చాలు బూతు ప్రపంచం మొత్తం ముంగట వాలిపోతోంది. చేతిలోనే స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఆన్ చేస్తే బూతులోకం చేతిలోనే. అదీ ఇప్పుడు పరిస్థితి. అయితే ప్రత్యేకంగా యూత్ పేరు చెప్పి బూతు సినిమాల హవా ఎక్కువైపోయింది. ఎప్పుడో ఒకటీ అరా వచ్చేవి ఇలాంటి సినిమాలు. కానీ ఇప్పుడు ఏ సినిమాలోనైనా బూత్ కంటెన్ట్ లేకుండా సినిమా తెరకెక్కించలేకపోతున్నారు మూవీ మేకర్స్. ముఖ్యంగా చిన్న సినిమాలకు బూతు కంటెన్ట్ పెద్ద ఆదాయ వనరుగా మారిపోయింది. విచ్చలవిడి శృంగారం చూపించి, యూత్‌ని ఎట్రాక్ట్ చేసే పనిలో నిమగ్నమై పోతున్నారు. ఇంటర్నెట్‌లోనే బూతు పురాణమంతా అందుబాటులో ఉంటున్నప్పుడు మరి ఈ సినిమాల గోలేంటీ.? అందులోని శృంగారం గోలేంటీ.?
అన్ని సినిమాలూ 'అర్జున్‌రెడ్డి'లా సంచలనాలు కావు. కానీ అర్జున్‌రెడ్డినే ఆదర్శంగా తీసుకుని స్టార్ట్ అయిన ఈ బూతు ఫార్ములా ఇప్పుడు అన్ని చిన్న సినిమాలకీ వైరస్‌లా పాకేసింది. ఏ సినిమా తీసుకున్నా అందులో లిప్ టు లిప్ కిస్‌లు, శృతిమించిన శృంగార దాడి లేకుండా పని కావడం లేదు. అలా యూత్ పేరు చెప్పి బూతు సినిమాలు మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. తక్కువ ఖర్చు, ఎక్కువ లాభం.. సినిమా పోయిందా, పెద్దగా నష్టం లేకపోవడం, ఇదీ ఈ తరహా కంటెన్ట్‌ని ఎంచుకోవడానికి ముఖ్య కారణం. శాటిలైట్ రైట్స్ లేకపోయినా, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఎవైలిబుల్‌గా ఉండడంతో ఈ యూత్ మూవీస్‌కి, సారీ.. బూతు మూవీస్ మరింత డిమాండ్ పెరిగింది. మరి ఈ యూత్ (బూతు)ఫుల్ ఎంటర్‌టైనర్స్‌ని కట్టడి చేసేవారా లేరా.? చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి.? అందుకే ఎందుకొచ్చిన గొడవలే అని స్టార్ హీరోలే ఈ తరహా మూవీస్‌ని సపోర్ట్ చేస్తూ తమ పెద్ద మనసు చాటేసుకుంటున్నారు.
బాలీవుడ్ సినిమాల్లోనే ఎక్కువగా ఈ కంటెన్ట్ మూవీలు చూసేవాళ్లం. కానీ ఇప్పుడు బాలీవుడ్‌ని మించిపోయింది టాలీవుడ్. కూసింత టాలెంట్ ఉంటే చాలు, డైరెక్టర్‌గా ప్రమోట్ చేసుకోవడం, తనకి తెలిసిన సబ్జెక్ట్ చుట్టూ అడల్డ్ కంటెన్ట్ జోడించేసి, జనాల్లోకి వదిలేయడం. యూత్‌కి నచ్చిందా ఇక అంతే సంగతి సెన్సేషనల్ అయిపోవడం. న్యూస్ ఛానెల్స్ ఈ సినిమాలపై డిబేట్స్ పెట్టి ఫ్రీగా పబ్లిసిటీ అందించేయడం.. ఇదీ వరస. ఈజీ మనీ వ్యవహారంగా మారిపోయిందిది. ఓ పక్క యువత ఎవరెస్టు శిఖరాల వంటి అభివృద్ధి మార్గాలను అన్వేషిస్తూ, ఆయా మార్గాల ద్వారా సంచలన విజయాలను అందుకుంటూ అద్భుతాలు సృష్టిస్తుంటే, ఇంకో పక్క యువత ఇలా బూతు సినిమాల పేరు చెప్పి పెడదోవ పెడుతున్నారు. అలాగని అన్ని బూతు సినిమాలూ యూత్ పైనా, సమాజంపైనా ప్రభావం చూపిస్తాయని చెప్పలేం. కానీ ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం వీటి వల్ల ఉంటుందని మాత్రం నిక్కచ్చిగా చెప్పగలం.