పుణ్యభూమి నాదేశం నమో నమామి.! - ..

mera bharata mahan

సినిమా అంటే 6 పాటలు, 4 ఫైట్లు మిగతాదంతా అర్ధం పర్ధం లేని హంగామా.. అనే అభిప్రాయం అందరిలో ఉండొచ్చు కాక. జస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అని ఇంకొందరు లైట్‌ తీసుకోవచ్చు గాక. కానీ సినిమా కూడా ఓ బలమైన మాధ్యమం. సమాజంలోని మంచి చెడుల్ని వెండితెరపై చూపించగలగడం ఓ కళ. ఎప్పుడూ ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే కాదు, సమాజానికి ఉపయోగపడే ఎన్నో ముఖ్యమైన అంశాలతో సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి. భవిష్యత్తులోనూ వస్తాయి. రాజకీయ నేపథ్యమున్న సినిమాలు, సాంఘిక దురాచారాల్ని ఎండగట్టే సినిమాలు, వీటితో పాటు దేశభక్తి నిండిన సినిమాలు మనకి కొత్తేం కాదు. ఇప్పుడు దేశమంతా సైన్యానికి మద్దతుగా నిలబడింది. పుల్వామా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. ఎప్పుడు తీవ్రమైన సంఘటనలు జరిగినా, ఆ సంఘటనలపై సినిమాలు వస్తూనే ఉంటాయి. పుల్వామాకి ముందు యురీ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. పాకిస్థానీ ముష్కరుల ఘాతుకానికి పలువురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనపై ఇటీవల 'యురీ' పేరుతో సినిమా వచ్చింది హిందీలో.

పొక్రాన్‌ అణు పరీక్షల పైనా ఓ సినిమా వచ్చింది. ఇవి కమర్షియల్‌ ఆలోచనతో చేసిన సినిమాలు కావు. తమవంతు బాధ్యతగా ప్రజల్లో దేశభక్తిని మరింత పెంపొందించడానికి సినీ జనాలు పడే తాపత్రయం మాత్రమే. దాన్ని వారొక బాధ్యతగా భావిస్తారు. తెలుగులో దేశభక్తి నేపథ్యంలో లెక్కలేనన్ని సినిమాలొచ్చాయి. వస్తూనే ఉన్నాయి. సినిమాల నేపథ్యం ఏదైనా, ఒక్కోసారి ఆయా సినిమాల్లో ప్రత్యేకంగా దేశభక్తి గీతాల్ని జొప్సిస్తుంటారు. అలాంటి పాటలు ప్రతీ పౌరుడిలోనూ దేశభక్తిని రగులుస్తాయి. వీటిల్లోనూ కొన్ని ఆలోచింపజేస్తే, మరికొన్ని దేశం పట్ల అంకిత భావాన్ని పెంచేలా, దేశం కోసం ఏమైనా చేయాలనే కసితో రగిలిపోయేలా చేస్తాయి. అలనాటి మేటి దేశభక్తి గీతాల్లో 'జననీ జన్మభూమిశ్చ', 'నా జన్మభూమి ఎంత అందమైన దేశము..' అనే ఈ రెండు పాటల గురించి ప్రముఖంగా చెప్పుకుంటుంటాం. 'మేజర్‌ చంద్రకాంత్‌' సినిమాలోని 'పుణ్యభూమి నాదేశం నమోనమామి..' పాట వింటే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయ్‌. తెలుగువీర లేవరా..' పాట కూడా ఆ కోవలోనిదే. కృష్ణవంశీ తెరకెక్కించిన 'ఖడ్గం'లోని 'మేమే ఇండియన్స్‌..' పాట సరదాగా చురకలంటిస్తూనే దేశభక్తి ఉప్పొంగేలా చేస్తుంది. 'మహాత్మా' సినిమాలోని 'గాంధీ' పాట. జై సినిమాలోని 'దేశం మనదే..' పాట ఇప్పటికీ చాలా మందికి హాట్‌ ఫేవరేట్స్‌. చెప్పుకుంటూ పోతే చాలా చాలా పాటలున్నాయ్‌. పాట మనసుని కదిలిస్తుంది. సినిమా ఆలోచింపచేస్తుంది.

పుల్వామా ఘటన తర్వాత కనిపిస్తున్న కథనాలు వాటికి తోడుగా వినిపిస్తున్న దేశభక్తి గీతాలు యువతలో స్ఫూర్తిని రగిలిస్తున్నాయ్‌. సరిహద్దుల్లో సైన్యం ప్రాణాలు తెగించి పోరాడుతోంటే, వారిచ్చే భద్రత నడుమ హాయిగా జీవిస్తున్న పౌర సమాజం అవసరమైతే ఆ సైన్యంతో కలిసి కదన రంగంలో దూకడానికి సిద్ధంగా ఉంది. 'మేరా భారత్‌ మహాన్‌'.! 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు