హాస్య నట నవాబు - రాజబాబు ( పుణ్యమూర్తుల అప్పలరాజు) - జె. వి. కుమార్ చేపూరి

Haasya Nata Navabu - Rajababu

రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు.  రాజబాబు, రాజమండ్రిలో పుణ్యమూర్తుల ఉమా మహేశ్వరరావు రమణమ్మ దంపతులకు 20 అక్టోబర్ 1937వ సంవత్సరాన జన్మించారు.  ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన తరువాత టీచర్ ట్రైనింగ్ చేసి కొంత కాలం  బడి పంతులుగా కాలం వెళ్ళ బుచ్చారు రాజబాబు.  నటన పట్ల ఉన్నమక్కువతో ఆ రోజుల్లోనే కుక్కపిల్ల దొరికింది, నాలుగిళ్ళ చావిడి, అల్లూరి సీతారామ రాజు మొదలయిన నాటకాలలో కీలక పాత్రలు పోషించారు రాజబాబు.

ప్రముఖ నట దర్శక నిర్మాత,  ప్రజా నాట్య మండలి వ్యవస్థాపక సభ్యుడు అయిన డాక్టర్ గరికపాటి రాజా రావ్ గారు, రాజబాబు లోని నట జిజ్ఞాసను, ప్రతిభను గమనించి మద్రాసుకు ఆహ్వానించారు. ఆ విధంగా రాజబాబు 1960 లో మద్రాసు చేరడం జరిగింది. మద్రాసు చేరిన కొత్తలో అనేక ఆటు పోట్లను ఎదుర్కొని, కొంత కాలం ట్యూషన్లు చెప్పుకుని కాలం వెళ్ళ దీసారు.  దర్శకులు అడ్డాల నారాయణ రావు 1960 లో నిర్మించిన “సమాజం”  సినిమాలో రాజబాబుకు ఒక పాత్రనిచ్చి వెండి తెరకు పరిచయం చేసారు.  కొత్తలో కొన్ని వోడుదుడుకులను ఎదుర్కున్నప్పటికీ,  రాజబాబు తన నటనా కౌశలంతో విజ్రుంభించి, ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఆయన నట ప్రస్తానం 589 సినిమాలలో అప్రతిహంగా సాగిపోయింది. ఒక చోట కుదురుగా నిలుచోకుండా, మెలికలు తిరిగిపోతూ ఆయన ప్రదర్శించిన నటన, సంభాషణల ఉచ్చారణ అలనాటి ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది.

లీలారాణి ప్రసన్న రాణి, గీతాంజలి, రమాప్రభ మొదలయిన వారు రాజబాబు పక్కన నాయికలుగా నటించిన ప్రముఖ హాస్య నటీమణులు. వీరిలో రమాప్రభ  ఎక్కువ  చిత్రాలలో రాజబాబు సరసన జంటగా నటించింది.  వీరి జంట ఆ రోజులలో  విపరీతమైన  హాస్యాన్ని పండించి తెలుగు చలనచిత్ర రంగంలో ఉత్తమ హాస్య జంటగా నిలిచింది. వీరిద్దరి పై ఆ రోజుల్లో ప్రతి చిత్రంలోనూ ఒక హాస్య గీతం కూడా తప్పకుండ ఉండేది. ఆ హాస్య గీతానికి ప్రేక్షకుల నుండి విపరీతమయిన  స్పందన లభించేది. ఇల్లు ఇల్లాలు చిత్రంలో వీరి జంటపై చిత్రీకరించిన "వినరా సూరమ్మ కూతురు మొగుడా విషయము చెబుతాను"  అన్న హాస్య గీతం ఆ చిత్రానికే తలమానికంగా నిలిచి, ఆ చిత్ర రజతోత్సవ విజయానికి దోహదపడి  ప్రేక్షకుల హృదయాలను నేటికీ రంజింప జేస్తున్నది.

ఆనాటి అగ్ర కధానాయకులతో సమానంగా రాజబాబు పారితోషికం ఉండేది. ఒక విధంగా చెప్పాలంటే అగ్ర కధా నాయకులతో సమానంగా పారితోషికం తీసుకున్న ఏకైక హాస్య కధానాయకుడు రాజబాబు ఒక్కడే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆ రోజుల్లో రాజబాబు సినిమాలో లేకపోతే పంపిణీ దారులు ఆ చిత్రాన్ని కొనడానికి వెనుకంజ వేసేవారు. వారి కోరిక మేరకు రాజబాబుతో కొన్ని దృశ్యాలు చిత్రీకరించి, అవి జతచేసి విడుదల చేసిన చిత్రాలు కూడా వున్నాయి.  ఆరోజుల్లో ఆయన పాత్రలన్నీ ఎక్కువగా కధానాయకుడి కుడి భుజంగా ఉంటూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కధానాయకుడికి సహాయ పడుతూ సాగేవి.  రాజబాబు ఆనాటి అగ్ర కదానాయకులయిన రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబుల సరసన అనేక చిత్రాల్లో నటించి మెప్పించి ఆయా చిత్ర విజయాలకు దోహద పడ్డారు. ఆయన తాతా మనవడు, పిచ్చోడి పెళ్లి, ఎవరికి వారే యమునా తీరే, తిరుపతి, మనిషి రోడ్డున పడ్డాడు వంటి  పలు చిత్రాలలో కధానాయకుడిగా నటించి మెప్పించారు. పై చిత్రాలలో నవరస నటనను ప్రదర్శించడమే కాకుండా  రాజబాబు ప్రేక్షకుల చేత కంట తడి పెట్టించాడు. ఇందులో ఎవరికి వారే యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు చిత్రాలు ఆయన స్వీయంగా నిర్మించిన చిత్రాలు. దాసరి నారాయణ రావు తొలిసారి దర్శకత్వం వహించిన తాతా మనవడు చిత్రంలో మనవడుగా, తండ్రి కళ్ళు తెరిపించే అత్యంత కీలక పాత్రను సమర్ధవంతంగా పోషించి అందరిచేత శభాష్ అనిపించుకున్నారు. ఈ చిత్రం రజతోత్సవం జరుపుకుంది.

రాజబాబు వివాహం 1965లో లక్ష్మి అమ్మలు తో జరిగింది. వీరికి నాగేంద్ర బాబు మహేష్ బాబు అనే ఇద్దరు కుమారులు. రాజబాబు సోదరులు చిట్టిబాబు, అనంత్ ఇద్దరూ తెలుగు చలన చిత్ర రంగంలో ప్రముఖ హాస్య నటులుగా కొనసాగుతున్న వారే. సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మలల  వివాహానికి రాజబాబే తెరచాటు పౌరోహిత్యం జరిపాడని చెప్పుకుంటారు. పుట్టినందుకు కొన్నైనా మంచి పనులు చేయాలనే తపన గల వ్యక్తి రాజబాబు. అందుకే తన ప్రతి పుట్టిన రోజున ఒక సీనియర్ కళాకారుని స్వయంగా సన్మానించే వాడు. సావిత్రి,, బాలకృష్ణ (హాస్య నటుడు), రేలంగి, రమణారెడ్డి మొదలయిన సీనియర్ నటులు అందరూ ఆయన సన్మానాలు అందుకున్నవారే. ఎంతో మందికి చదువుకోడానికి సహాయం చేసిన విద్యా దాత. రాజబాబు తన  పేర ఒక జూనియర్ కళాశాలను కూడా ఏర్పాటు గావించాడు.

మనిషి జీవితాన్ని అలవాట్లే శాసిస్తాయి అన్నదానికి రాజబాబు ఒక నిలువెత్తు నిదర్శనం. రాజబాబు ఉజ్వల సినిమా పర్వం దెబ్బతినడానికి మద్య పానమే ప్రధాన కారణమి చెబుతారు. ఈ వ్యసనమే రాజబాబును సినిమా రంగానికి దూరం చేసిందని చెబుతారు. కష్టాల్లో ఉన్న వారి భుజం తట్టి నేనున్నానని ఆదుకున్నమంచి మనసున్న రాజబాబు అందరినీ విడచి అనారోగ్య కారణంగా 1983 ఫిబ్రవరి 7న చిన్న వయసులోనే హైదరాబాద్ లో గుండె పోటుతో కన్నుమూసారు.

రాజబాబు తన నట జీవితంలో అందుకున్న 14 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు ఆయన హాస్య నట ప్రతిభకు నిదర్శనాలు, దక్కిన చిరు గౌరవాలు, కలికితురాళ్ళు. రాజబాబు తన ఊరికి, చలన చిత్ర రంగానికి చేసిన మరపురాని సేవలకు చిహ్నంగా ఆయన 9 అడుగుల కాంస్య విగాహాన్ని రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన ప్రతిష్టించి రాజబాబు పట్ల తమకున్న గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకుంది పరిశ్రమ. అక్టోబర్ 20 రాజబాబు జయంతి. ఆ హాస్య నట నవాబు జయంతి సందర్భంగా తెలుగు చలన చిత్ర రంగంతో బాటు మనమూ ఒకసారి ఆయనను స్మరించుకుందాం, ఆయన  జ్ఞాపకాలను నెమరు వేసుకుందాం.

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి