జోహారు జోహారు ఓ భారత జవాను
జోహారు జోహారు ఓ భారత జవాను
ఇహపరాన సాటిరారు నీకు ఎవరూను
ఎముకలు కొరికే చలి ఓ ప్రక్క
ఎత్తైన పర్వతాలలో నడక మరో ప్రక్క
కావేవీ అడ్డంకు దేశ రక్షణకై నడుము కట్టుకున్నాక
కన్న భూమి కోసం ప్రాణార్పణం నీకు తృణప్రాయం
మనసంతా దేశ రక్షణే తప్ప; లేదు మరో అభిప్రాయం
మన భూభాగాన్ని కబళించే వారంటే కంటక ప్రాయం
భరత భూమిలో అంగుళమైనా పోనీయనంటావు
ప్రాణాలు అర్పించడానికైనా సరే ముందుంటానంటావు
ముష్కరులను అంతమొందించడానికి ముందడుగేస్తావు
ఓ భారత జవాను నీ ఖ్యాతి హిమోన్నత శిఖరం
ఓ భారత జవాను నీ కీర్తి అజరామరం
ఓ భారత జవాను మా హృదయాలలో ఉంటావు నిరంతరం
- కొమ్ముల వెంకట సూర్యనారాయణ
****
వందనం! అభివందనం!!
సోదరా! ఓ సైనిక సోదరా వందనం! అభివందనం!!
మమతానురాగాలను పక్కనపెట్టి
బంధాలను, అనుభంధాలను వదిలిపెట్టి,
కరడు కట్టిన అసుర మూకను దునుమాడే క్రమంలో
ధైర్యాన్నిమూటకట్టి, తుపాకీని చేతబట్టి
ప్రాణాలను పణంగా పేట్టే,
సోదరా, ఓ సైనిక సోదరా వందనం! అభివందనం!!
దేశరక్షణకై, దుష్టశిక్షణకై ఇలఫై అవతరించి
కర్మ భూమిలో కధను తొక్కి, ప్రజా రక్షణకై
అసువులు బాసి అమరుడైన
సోదరా! ఓ సైనిక సోదరా వందనం! అభివందనం!!
తోపల్లి ఆనంద్
*****
తీరని ఋణం
ఎదురుపడి పోరాడే దమ్ము లేని
పిరికి పందలు
కొండల చాటునుండి విసిరిన
మృత్యువు ఒడిలో
నిద్ర పోతున్నారు మన యోధులు
దేశ రక్షణ అంటే ప్రాణంతో చెలగాటం
అని తెలిసీ ముందడుగేసిన ఆ వీరులకి
ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం!
ఖురాన్ చాటిన మానవత్వానికి
సమాధి కట్టి ఆ సమాధిపై
సామ్రాజ్యాలని నిర్మించాలని
కలలు కంటున్నారు ఆ నీచులు
ఆ తుచ్చుల కలలని
సమాధి చెయ్యడం కోసం
తమ ప్రాణాలని ఇటుకలుగా
సమర్పించిన మన వీర జవానులకి
ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం!
అమ్మ కన్నా దేశమే మిన్న అని నమ్మి
తమ ఊపిరిని దేశానికి
కవచంగా మార్చి కాపాడుతున్న రక్షకులకి
ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం!
కాల్చే ఎండని, కూల్చే వానని
కొరికే చలిని, తొలిచే మంచుని
లెక్క చెయ్యకుండా
దేశ రక్షణే ధ్యేయంగా
ప్రాణం తృణప్రాయంగా
మృత్యువు నీడలో నిలబడి
సరిహద్దులని కాస్తున్న సైనికులకి
ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం!
మా అశ్రునయనాలతో
నివాళులర్పించడం తప్ప..!
శ్రధ్ధాంజలి దీపాలతో
వీడ్కోలు పల్కడం తప్ప..!
మళ్ళీ ఈ నేల పైనే పుట్టమని
మనస్ఫూర్తిగా వేడుకోవడం తప్ప..!!
సుజాత పి.వి.ఎల్