మన దేశంలో , ఉగ్రవాదం కన్నా ప్రమాదమైనది, వాక్స్వాతంత్రం ( Freedom of speech ).. ఈమధ్య దేశంలో ప్రతీవాడూ, రోడ్డుసైడున పానీపూరీ అమ్ముకునేవాడిదగ్గరనుండి, రాజకీయనాయకులదాకా, ప్రతీవాడూ, దేశరక్షణ కోసం, మన సాయుధ దళాలు ఏం చేస్తే బాగుంటుందో చెప్పేవాడే… దేశరక్షణ అన్నది, మన కేంద్రప్రభుత్వ పరిధిలోకి వచ్చేది.. వాటిగురించి నిర్ణయాలు తీసుకునేది, బాధ్యతాయుతమైన కేంద్ర ప్రభుత్వం మాత్రమే… పరిస్థితులను బేరీజువేసి, సరిఅయిన నిర్ణయం వారుమాత్రమే తీసుకోగలరు.
కానీ గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నదేమిటంటే, మన వార్తాపత్రికలు, మీడియా , అవసరమైన దానికంటే ఎక్కువ ఉత్సాహాన్ని చూపడం. ఉదాహరణకి, అప్పుడెప్పుడో, ముంబై తాజ్ మహల్ హొటల్ దగ్గర జరిగిన, ఉగ్రవాద దాడిని, ప్రత్యక్ష ప్రసారం చేసి, శత్రువులకి , క్షణక్షణానికీ జరుగుతూన్న పరిణామాలు చూపించడం. చివరకి ప్రభుత్వం, కోర్టులూ , warning ఇచ్చిన తరవాతే పరిస్థితి చక్కబడింది.
ఆరోజుల్లో ఈ Social media అంతగా పాప్యులర్ కాదు కాబట్టి , కొంతలో కొంత మెరుగే. కానీ గత అయిదారు సంవత్సరాలుగా, ఎన్ని నియంత్రణలు ఉన్నా, ప్రజాభిప్రాయాలు, ఎవరికి తోచినవి వారు రాసేస్తున్నారు. దానితో పరిస్థితి మరీ దిగజారిపోయినట్టనిపిస్తోంది. ఇదివరకటి రోజుల్లో, rumour అన్నది పాకడానికి కొంత సమయం పట్టేది. కానీ ఈరోజుల్లోనో, మీడియా వారి అత్యోత్సాహమూ, సోషల్ మీడియాలో చెత్తరాతలూ మూలంగా, క్షణాల్లో , పరిస్థితి విషమించిపోతోంది… మనుషుల్లో self discipline అన్నది ఏ కోశాన్నా కనిపించడం లేదు.
వీటికి సాయం, ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పనిచేసినవారికి, publicity యావ ఎక్కువయింది. రిటైరయిపోగానే ముందుగా చేసేది, Memoirs అని ఓ పుస్తకం రాసేయడం. అసలు తను ఉద్యోగంలో ఉన్నప్పుడు, తెలిసిన విషయాలూ, చేసిన పనులూ, బహిరంగం చేయకూడదనే ఇంగిత జ్ఞానం కూడా లేదు. పాలకులకంటూ ఉంటేనే కదా, ఉద్యోగులకుండేది? ఉదాహరణకి, దేశ రక్షణ విషయంలో, నిర్ణయాలు ఊరందరికీ తెలియాల్సిన అవసరం లేదు. దేశరక్షణ విషయంలో , మన సాయుధ దళాలు, ఎంతో శ్రమ పడి, రాత్రనకా, పగలనకా పనిచేయడం వలనే, మనం సుఖంగా నిద్రపోగలుగుతున్నామన్నది నిస్సందేహంగా చెప్పొచ్చు… అలాటప్పుడు, టీవీల్లో జరిగే చర్చల్లో ( అన్ని భాషల్లోనూ ) , ఎవరో రిటైరయిపోయిన ఏ సైనికదళానికో చెందిన, ఏ ఉన్నతాధికారో, యుధ్ధసమయంలో చేసే ప్రణాలికల గురించి, అంత బహిరంగంగా వివరించడం ఏమైనా భావ్యంగా ఉంటుందా? వారు మాట్టాడేవన్నీ ఒక్కోప్పుడు చాలా బాధ్యతారహితంగా ఉంటూంటాయి. ఈ రోజుల్లో చూస్తూన్నదేమిటంటే, ప్రతీ చానెల్ లోనూ, కనీసం ఒక రిటైర్డ్ అధికారి ఉండడం. చానెళ్ళవాళ్ళకేముందీ, ఉన్న విషయాన్ని sensationalize చేసి, వాళ్ళ TR P లు పెంచుకోవడమే ముఖ్యం… కానీ దీనివలన indirect గా జరుగుతూన్న నష్టం గురించి పట్టించుకోవడం లేదు.
ఇంక Social Media లో అయితే , ఇంకా బరితెగించిపోతున్నారు. చాలామంది, తమతమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ, ప్రభుత్వం ఎలాటి చర్యలు తీసుకోవాలో కూడా సలహాలివ్వడం హాస్యాస్పదంగా ఉంది… పైగా ఇలాటి అర్ధంపర్ధంలేని రాతల వలన లాభంకంటే, నష్టమే ఎక్కువగా జరుగుతోంది… ఇంక రాజకీయ పార్టీలైతే, వారి స్వప్రచారంకోసం ఏమైనా రాస్తూంటారు.
మనకి ఎక్కడైనా సరే influence అనేది ఉంటే, ఏ పనైనా సరే క్షణాల్లో జరిగిపోతుంది. దాన్నే ఒక్కొక్కప్పుడు recommendation అనికూడా పిలుస్తూంటారు. ఆతావాతా తెలుగులో చెప్పేదేమిటంటే ' వడ్డించేవాడు మనవాడైతే, ఎక్కడ కూర్చుంటేనేమిటీ..' అని పూర్వకాలంలో అనేవారు! ఇప్పుడు ఎక్కడ చూసినా, ఈ recommendation ల పర్వమే కదా! ఆ శ్రివెంకటేశ్వరస్వామి దర్శనం, త్వరగా జరగాలీ అంటే, అదేదో సెల్లార్ దర్శనంట! హైదరాబాదులోనో ఎక్కడో వాడెవడో, ఓ లెటరిస్తాడుట, దాన్ని తీసికెళ్తే, చివరికి ఆ భగవంతుడు కూడా, ఎందుకొచ్చిన గొడవలే అనుకుంటూ దర్శనం ఇచ్చేస్తాడు! ఏమిటో ఆయనకూడా ఈ recommendation కి లోబడిపోయాడు.
ఏ రాజధాని నగరం అయినా ఆఖరికి ఢిల్లీ తో సహా, కిళ్ళి కొట్టువాడి దగ్గరనుండి, కార్పొరేటరు దాకా ప్రతీవాడికీ, ప్రభుత్వం లో ఎవడో ఒకడు తెలిసే ఉంటాడు.ప్రతీవాడూ,మనం ఏదైనా సమస్య గురించి చెప్తే,dont worry, I will do something అనేవాడే! వీళ్ళనే అదేదో లాబీయిస్టులంటారట. మధ్యమధ్యలో బయట పడే Scams వీళ్ళ ధర్మమే..
ఒక సంగతి మాత్రం అందరం గుర్తుంచుకోవాలి, ఎలాగోలాగ పాట్లు పడి, జీవితంలో ఎక్కడో చోట influence అనేది సంపాదించుకోవాలి. ఎప్పుడో అప్పుడు, ఎవరో ఒకరికి ఉపయోగిస్తుంది. అవతలివాడెదో పేద్ద ఆఫీసరే అవఖ్ఖర్లేదు, ఆఫీసులోకానీ, ఇంకో చోట కానీ పనిచేసే దర్వాన్ అయినా చాలు!ఆఖరికి, ఆఫీసరుగారి డ్రైవరైనా చల్తా హై! అలా కాదూ, ఆఫీసరుగారి పెళ్ళాం నే పట్టేస్తారా, మీకు తిరుగే లేదు! తిన్నగా కుంభస్థలాన్నే కొట్టేయొచ్చు! రైల్వేలో ఓ టి.టి తో ఫ్రెండ్ షిప్ చేయండి, మీకు ఎప్పుడు ఆఖరి క్షణాల్లో ప్రయాణం చేయవలసివచ్చినా, ఇంటికే టిక్కెట్లొచ్చేస్తాయి. ఓ పొలీసాడితో, పరిచయం చేసుకోండి, ఊళ్ళో ఎవడి బుర్ర పగలుకొట్టినా, మిమ్మల్నడిగే వాడుండడు!
అంతదాకా ఎందుకూ, ఈ గవర్నమెంటు ఆసుపత్రిలు కానీ, కార్పొరేట్ ఆసుపత్రిలు కానీ తీసుకోండి, ఒక్కడైనా తెలిసినవాడుంటే ఉండే ఉపయోగం, మీ దగ్గరెంతడబ్బున్నా దానిముందర బలాదూరే!ఒకడంటే ఒక్కడు, వాడు చివరకి వార్డ్ బోయ్ అయినా సరే, మహరాజభోగాలతో, మనకు వైద్యం జరుగుతుంది. ఎప్పుడైనా బాంకుల్లో చూస్తూంటాం, బయట ఎంత క్యూ ఉన్నా సరే, మనకి తెలిసినవాడొక్కడున్నాడంటే చాలు, ఈ క్యూలూ అవీ to hell with it!క్షణాల్లో పనిచేసికుని వచ్చేయొచ్చు!
ఊరికె స్నేహం చేయడంతోనే సరిపోదు, ఆ స్నేహాన్ని జాగ్రత్తగా maintain చేయడం ఓ కళ! పని ఉన్నా లేకపోయినా సరే, ఆయనాఫీసుకెళ్లి, ఏ రెండు మూడు నెలలకో వారిని పరామర్శిస్తూండాలి.అంతే కానీ, ఎప్పుడో పనున్నప్పుడే వెళ్ళడం కాదు.అప్పుడప్పుడు వెళ్తూ, ఆయన యోగక్షేమాలడుగుతూంటారనుకోండి, మనం ఎప్పుడైనా ఏ పనికోసమో వెళ్ళినప్పుడు, 'ఊరక రారు మహాత్ములు' అంటూ, ఓ కాఫీకూడా బోనస్ గా దొరకొచ్చు. అలా కాక, మన పని అయిపోయిందికదా అని, ఆయన ఉన్నాడో ఊడేడో కూడా తెలిసికోకుండా,' రేవు దాటి తెప్ప తగలెసినట్లు' గా ఉన్నారనుకోండి, మనం వెళ్ళీ వెళ్ళగానే ఆయన పలకరింపు కూడా అలాగే- ' ఏమిటీ, ఏదో పనిమీదొచ్చినట్లున్నారే, లేకపోతే, మేమెక్కడ కనిపిస్తాం లెండి'లా ఉంటుంది.ఆయనకీ తెలుసు, ఈ వెధవకి నాతో పని బడినట్లుంది, లేకపోతే ఎందుకు వస్తాడూ అని.
మనవైపు సినిమాహాళ్ళలో బుకింగాఫిసువాడు అందరిలోకీ బెస్ట్. ఏ సినిమా అయినా సరే,మొదటిరోజు మొదటాటకి మనకి టిక్కెట్లు గ్యారెంటీ!అసలు ఉద్యోగంలో ఉండగానే, మనం వివిధాఫీసుల్లోనూ, ఈ పరిచయాలు cultivate చేసికోవాలి. రిటైరయిన తరువాత మన మొహం ఎవడూ చూడడు. ఉద్యోగంలో ఉన్నంతకాలం ప్రతీవాడూ సలాం కొట్టేది, ఆ సీటుకే, మన మొహం చూసికాదు. చెప్పానుగా, ఈ రోజుల్లో ఏ పనికావాలన్నా, 'దక్షిణ తాంబూలాలు' తప్పని సరైపోయాయి.ఎంత చెట్టుకంత గాలి లా ఎంత దక్షిణకి అంత పని!
మా చిన్నతనపురోజుల్లోనూ ఉండేవి, ఇలాటివన్నీనూ, కానీ ఇంత commercialise కాదు. ఏదో పాఠాలు చెప్పిన మాస్టారి కొడుకూ అనో,ఫలానా వారికి చుట్టమనో చెప్పినా చాలు పన్లైపోయేవి. అక్కడ మన గొప్పతనం చూసి కాదు, మనం ఎవరిపేరైతే చెప్పేమో వారిని బట్టి! అంతదాకా ఎందుకూ, నాకు ఉద్యోగం వచ్చింది, మా అమ్మమ్మ గారికి మనవడినై పుట్టినందుకూ, మా అమ్మగారికి కొడుకునై పుట్టినందుకూ! ఎందువలనా అంటే, నా చదువుకి, పిలిచి ఉద్యోగం ఇచ్చినాయన, పై విధంగా మాకు పరిచయం! ఇప్పటికీ, నోట్లో రెండు పూట్లా ముద్దెళ్తోందంటే వారి చలవే!
నేను ఇక్కడ, రెండు సార్లు కమాండ్ హాస్పిటల్లోనూ, ఒకసారి మిలిటరీ హాస్పిటల్లోనూ, ఏ శ్రమా లేకుండా వైద్యం చేయించుకుని, లక్షణంగా ఇంటికొచ్చానంటే కారణం మా స్నేహితుడు బాలరంగయ్యగారూ, మా కజిన్ సదానందా నూ.Influence అనేది జీవితంలో ఎంత ముఖ్యమో,అప్పుడర్ధమయింది. మనం ఓ తీగ లాటివారం,అది ప్రాకడానికి ఓ పందిరో ఏదో, ఆఖరికి ఓ పుల్లయినా కావాలి కదా. అలాగే ఈ పరిచయాలూనూ.మనకి ఏదో ఉపయోగిస్తాడులే అని పరిచయం చేసికోకూడదు.మన ప్రవర్తనని బట్టి వారే మనకి ఉపకారం చేయొచ్చు.ఎందుకంటారా, ఈ రోజుల్లో ప్రతీ చోటా, ఎవరో ఒకరు తెలిసిన వారు లేకుంటే పన్లవడం చాలా కష్టం.నాకేమిటీ, డబ్బు పారేస్తే అదే అవుతుందీ అనుకోకండి, డబ్బొకటే కాదు ముఖ్యం. దాన్ని తీసుకోడానికి కూడా ఓ తెలిసినవాడుండాలి!! ఈ రొజుల్లో ఎవడుపడితే వాళ్ళదగ్గరనుంచి డబ్బులు తీసికోవడం లేదు. ఆ ఇచ్చినవాడు, ఏ ACB వాడో,ఏ T.V. వాడో అయితే ఖర్మ!ఉన్న ఉద్యోగం కూడా పోతుంది!