తమిళనాడు తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

నటరాజ మందిరం ( చిదంబరం )

ఈ వారం తమిళనాడులోని మరో ముఖ్యమైన మరియు పంచభూతలింగాలలో ఒకటైన ఆకాశ లింగం వున్న మందిరం గురించి చదవుదాం .    ఈ ఆకాశలింగం యెక్కడవుంది అంటే చిదంబరం లో వుంది , చిదంబరం తమిళనాడు రాష్ట్రం లో ‘ కడ్డలూరు’  జిల్లాలో వున్న ఓపట్టణం . ఇక్కడ పురాతనమైన అన్నామలై యూనివర్సిటీ వుంది .

చెన్నై నుంచి రైలు , రోడ్డు ద్వారా చిదంబరం చేరుకోవచ్చు , అయితే చెన్నై నుంచి సుమారు230 కిలోమీటర్లు ప్రయాణించాలి .  రైల్వే స్టేషనుకి , బస్సు స్టాండుకి కూడా సుమారు కిలోమీటరు , కిలోమీటరున్నర దూరంలో వుంటుందీ మందిరం .

ఇది పదవ దశాబ్దానికి ముందు పరిపాలించిన చోళుల రాజధానికూడా , ప్రస్తుతం యీ పట్టణం కొత్తపాతల కలయికతో వింతగా పెరుగుతున్న నగరంగా చెప్పుకోవచ్చు . పాతతరం కట్టుబొట్టు ఆచార వ్యవహారాలు అదే సమయంలో కొత్తతరం వారి జీన్స్ , టీ షర్ట్ కల్చరు ఒకే సారి చూస్తే మనకి వింతగా అనిపిస్తుంది . కొత్తకొత్త మార్పులు యెన్ని వచ్చినా పాత ఆచారాలు మారలేదు అనడానికి నిదర్శనంగా కట్టుబొట్టు మార్చని తమిళమామీలు ఇంకా పంచకట్టుతోనే తిరిగే తమిళమామలు కనిపించి మనం మరచిపోయిన మన సంసృతిని గుర్తు చేస్తూ వుంటారు . ఇక్కడకి వచ్చే పర్యాటకులు యిక్కడవున్న నటరాజమందిరాన్ని చూడడానికి గాని లేకపోతే అన్నామలై యూనివర్సిటీకి గాని వస్తూ వుండటంతో బస్సు స్టేండులో దిగినా స్టేషన్ లో దిగినా ఆటో వాళ్లు యీ రెండు పేర్లే అడుగుతారు .

మనం యిప్పుడు మందిరానికి వెళుతున్నాం కాబట్టి ఆ వివరాలు చూద్దాం , చాలా మంది చిదంబరం వెళ్లోచ్చేకా దైవదర్శనం అయిందా అంటే ‘ చిదంబర రహస్యం ‘ అని అనేవారు . అదేమిటో మొదటిమారు వెళ్లినపుడు తెలిసింది . దైవదర్శనంకోసం గబగబా గర్భగుడిలోకి వెళితే అక్కడ శివలింగం లేదు , దేవుడేడీ అని అడిగితే అంతటా వున్నాడనే సమాధానం , మాకేమీ అర్దంకాలేదు , బయట మంటపాలను చూసుకొని వచ్చేసేం . శివలింగం లేని కోవెలకు యెందుకు అంత ప్రాముఖ్యతో కూడా అర్దం కాలేదు , ఇది జరిగింది 1884 లో కాబట్టి నెట్ లో వెతక్కోడం , వీకీ పీడియాలు లేవు . అయితే పెద్దపెద్ద గోపురాలతో పెద్దగా రాళ్లతో కట్టిన ప్రహారీ గోడలోపల పెద్ద పుష్కరిణి తో వున్న పెద్ద కోవెలగానే నా మనసులో ముద్రించుకున్నాను .

1990 లో వెళ్లినప్పుడు ఆ మందిరానికి వచ్చిన ఓ తమిళమామ ని అడిగితే మందిరం గురించిన స్థలపురాణం  కొంచమే తెలిసింది , తర్వాత మారు వెళ్లినప్పుడు అక్కడ ఓ మంటపంలో ఓ అమ్మాయి నాట్యం చేస్తోంది , ఆ అమ్మాయితో వచ్చిన వారు చెప్పిన వివరాలతో యీ వ్యాసం రాస్తున్నాను .

ఈ మందిర నిర్మాణం పదవ శతాబ్దం లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ఆదిత్య చోళుడు ఈ మందిరనిర్మాణాన్ని ప్రారంభించగా అతని తర్వాత పరిపాలనకు వచ్చిన పరాంతక చోళుని కాలంలో పూర్తయింది . పరాంతక చోళుడు ఈశ్వరుని చోళరాజుల కుదైవంగా ప్రకటించేడు . రాజరాజ చోళుని కాలంలో రాజధానిని చిదంబరం నుంచి తంజావూరుకు తరలించడం , అనంతరం విశ్వవిఖ్యాతి గాంచిన బృహధీశ్వరాలయ నిర్మాణం జరిగింది . ఇక్కడ లభించిన రాగిరేకులపై గల శాసనాలప్రకారం పరాంతక చోళుడు ఈశ్వరుని పద్మపుష్పంతోను , తనని తాను పుష్పాన్ని ఆశ్రయించిన తుమ్మెదతోను పోల్చుకున్నాడు .

కాలాంతరాలలో యీ మందిరంలో మార్పులు చేర్పులకు లోనయింది , ముస్లిమ్ రాజుల చేతులలో చాలా వరకు దెబ్బతింది , 19 వ శతాబ్దంలో తిరిగి నిర్మింపబడింది .

చరిత్రకు దొరికిన ఆధారాల ప్రకారం 5 వ శతాబ్దానికి ముందు నుంచి యీ మందిర వునికి వున్నట్లుగా గుర్తించేరు , స్కంధ పురాణం లో  ‘ సూతసంహిత ‘ లో యీ మందిరం గురించిన ప్రస్తావన వుంది .

ఇక మందిరంలోకి వెళితే నాలుగు వైపులా పెద్దపెద్ద గోపురాలతో వున్న పెద్ద కోవెల ఎత్తైన రాత్రి ప్రహారీగోడ లోపలకు వెళితే శివగంగ పుష్కరిణి , పెద్దపెద్ద మండపాలు , రెండు మూడు ప్రాకారాలలో వున్న దేవీ మందిరం , రధాన్ని అధిరోహించిన సూర్యుడు , వినాయకుడు , కార్తికేయుడు  , విష్ణుమూర్తులకు వున్న మందిరాలు ఆ కాలంలో శైవమతానికే కాక శాక్తేయం , వైష్ణవాలకు కూడా అంతే ప్రాముఖ్యతనిచ్చినట్లు తెలుస్తుంది .

చాలా పెద్ద కోవెల , లోపల తిరిగేసరికి కాళ్లు పట్టుకు పోతాయి . నాలుగు వైపులా తొమ్మిది అంతస్థుల గోపురాలతో చూడగానే చాలా పెద్ద మందిరమని తెలిసిపోతూ వుంటుంది . గోపురం మీద శివునికి సంబంధించిన గాథల శిల్పాలు చక్కగా చెక్కి వుంటాయి .

ఈ మందిరం లో ముఖ్యంగా చూడవలసినది వెండి నటరాజ విగ్రహం . ఈ మందిరం లో చిత్ సభ , హేమసభ , హిరణ్య సభ , కనకసభ అనే మండపాలు వున్నాయి , వీటిని పర్యాటకుల విశ్రాంతి తీసుకొనే ప్రదేశాలుగా వుపయోగించేవారు .

ఈ మందిరం శివుని ఆనందతాండవానికి సమర్పింపబడినదిగా చెప్తారు . చోళరాజులు శివుని ప్రసన్నరూపమయిన నటరాజుని ప్రతిష్టించి భరతముని చే రచింపబడ్డ నాట్యశాస్త్రాన్ని ముందుతరాలకు అందజేసే వుద్దేశంతో యీ మందిర నిర్మాణం చేపట్టినట్టుగా తెలుస్తుంది .ఈ మందిర మండపాలపై , స్తంభాలపైన తత్వనిధి  ప్రకారం నాట్య శాస్త్రంలోని యేడు రీతులను , కష్యప శిల్ప ప్రకారం వున్న 18 రకాల నాట్యరీతులను , భరతముని రచించిన నాట్యశాస్త్ర ప్రకారం వున్న 108 భంగిమలను మిగతా శిల్పాలతో పాటు భద్రపరిచేరు .

ఈ మందిరంలో ప్రతీరోజూ ఆరు సేవలను నిర్వహిస్తారు , ప్రొద్దుట స్వామి పాదుకలను మందిరంలోకి పల్లకీలో తీసుకు వచ్చిన తరువాత నిత్యపూజాదులు నిర్వహిస్తారు , పన్నెండు గంటలకి మూడో పూజ ముగించి మందిరం మూసివేస్తారు , సాయంత్రం నాలుగింటికి తిరిగి అభిషేకంతో పూజలు మొదలవుతాయి , పవ్వళింపు సేవానంతరం పాదుకలను మందిరంనుంచి పల్లకీలో తీసుకు వెళతారు . పాదుకలు తీసుకెళ్లిన తరువాత స్వామి విశ్రాంతి తీసుకుంటారని నమ్ముతారు .

గర్భగుడిలో శివుని లింగాకారం వుండదు , 108 బంగారు బిల్వదళాల మాల మాత్రం కనబడుతుంది . గర్భగుడి ‘ చిత్ సభ ‘ అని అంటారు . చిత్ సభ అంటే ఆత్మ జ్ఞానం పొందే ప్రదేశమని అర్దం , ఆత్మ పరమాత్మ జ్ఞానం కలిగిన తరువాత జీవికి విగ్రహారాధనతో పనివుండదు కాబట్టి యిక్కడ విగ్రహం వుండదని వాదన , హేమ సభలో వున్న నటరాజ విగ్రహమే మూలవిరాట్టని కొందరి నమ్మకం .

హేమ సభలో వున్న స్పటిక లింగానికే నిత్యపూజలు నిర్వహిస్తారు .

ఇంతపెద్ద మందిరంలో గర్భగుడి ఖాళీగా వుండడం కాస్త నిరాశను కలిగించినా స్థలపురాణం విన్న తరువాత అణువణువునా శివుని వునికి అనుభవించేకా చాలా ప్రశాంతతను పొందేం .

ముందు నేను చెప్పినట్లు చాలామంది నర్తకులు యీ మందిరం లో తమ మొదటి ప్రదర్శన యిస్తే వారికి నటరాజు ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు , అలా నర్తిస్తున్న చాలా మందిని నేను వెళ్లిన ప్రతీ సారీ చూసేను .

ఇక స్థలపురాణం తెలుసుకుందాం .

పురాణకాలంలో  యీ ప్రదేశంలో చాలా మంది ఋషులు వారి పత్నులతో నివసిస్తూ వుండేవారట , ఒకనాడు శివుడు భిక్షాపాత్ర ధరించి విష్ణుమూర్తి మోహినీ రూపాన్ని ధరించి శివుని పత్ని వలె అతనిని అనుసరించి యీ ప్రదేశానికి వచ్చేరట , భిక్షువు పత్నిని చూచి ఋషులు మోహపరవసులయి వారిని అనుసరించసాగేరట , భిక్షువు ఋుషుల పర్ణశాల వీధులలోకి రాగానే యింటి పనులలో నిమగ్నమై వున్న వారి పత్నులు భిక్షువును మోహపు దృక్కులతో చూడసాగేరట , ఋషులు తమ పత్నులను యెంతవారించినా వారు పట్టించుకోలేదట , దానికి కోపించిన ఋషులు భిక్షువు పైకి కొన్ని మాయా పాములను ప్రయోగించేరట , భిక్షువు ఆపాములను ఆభరణాలుగా ధరించేడట , అది చూచి కోపంతో ఋషులు మాయా పులిని పంపగా శివుడు ఆ పులిని చంపి దాని చర్మాన్ని వస్త్రంగా కట్టుకొన్నాడట , అలాగే యేనుగను తరువాత భయంకరమైన రాక్షసుని పంపగా శివుడు వాటిని సంహరించి , రాక్షసుని శరీరముపై ఆనంద తాండవమాడేడట , శివుని ఆనందతాండవాన్ని చూచిన ఋషులు తమ తప్పు తెలుసుకొని శివుని క్షమార్పణ వేడుకున్నారట , శివుడు ఆనందతాండవ మాడిన ప్రదేశమే నటరాజ మందిరం .

అందుకనే యీ కోవెలలో శివుడు నటరాజ రూపంలో పూజలందుకుంటున్నాడు .చోళరాజులైన పరాంతక చోళుడు , కుళోత్తుంగ చోళుల కాలంలో యెన్నో పురాతనమైన , కర్ర మందిరాలను శాశ్వత మందిరాలుగా మార్చడం , కొత్త మందిరాలను నిర్మించడం చేసేరు . వీరి కాలంలో శిల్పకళకు ప్రాముఖ్యత లభించింది .

ఈ మందిరం గురించిన మరికొన్ని చారిత్రాత్మక వివరాలు తెలుసుకుందాం . ఈ మందిరంలో 63 నాయనార్ల విగ్రహాలు వున్నాయి , వీటి గురించిన కథ కూడా వుంది అదీ తెలుసుకుందాం . ఓ రోజు పరాంతక చోళునికి కలలో శివుడు కనిపించి మందిరంలో వున్న పవిత్రగ్రంధాలు పాడయిపోతున్నాయని వాటిని వెలికి తీసి శుభ్రపరచి భద్రపరచవలసినదిగా కోరుతాడు . రాజు మరునాడు మందిరానికి వచ్చి పూజారితో తన కలగురించి చెప్పగా మతపెద్దలతో చర్చించి నాయనార్ల అనుమతిలేనిదే ఆ గ్రంథాలను వెలికి తీయరాదని చెప్తారు . రాజు 63 నాయనార్ల విగ్రహాలను చేయించి వాటిని రథాలమీద తీసుకు వచ్చి గ్రంధాలయాలుగల గది దగ్గరకు వస్తాడు . గది సందులలోంచి చెదలు బయటకు రావడం చూసిన మతగురువులు తలుపులు తెరవటానికి అంగీకరిస్తారు . రాజు మత గ్రంథాలను రక్షిస్తాడు .

చోళుల తరువాత వచ్చిన పాండ్యులు , విజయనగరరాజులుకూడా యీ మందిరానికి మరమ్మత్తులు , చేర్పులు చేసేరు . ఢిల్లీ సుల్తానుల కాలంలో మూడు సార్లుమందిరంలో వున్న నిధులకోసం మందిరం మీదకి దండెత్తి వచ్చి చాలా క్షతి కలుగ జేసేరు . ఆ సమయంలో చాలా దేవతా మూర్తులను భూమిలో పాతిపెట్టి రక్షించినట్లుగా చరిత్రలో వుంది . సుల్తానుల దండయాత్రలలో చాలా మటుకు మందిరం నేల మట్టంకాగా 19వ శతాబ్దంలో నిర్మించిన మందిరాన్ని మనం యిప్పడు చూస్తున్నాం .

తమిళనాడు మందిరాలు ద్రవిడ శిల్పకళతో కట్టబడినవి , వీటి నిర్మాణం చూసి యివి యేకాలానికి చెందినవో కూడా చెప్పగలం . యీ మందిరంలోని కొన్ని కట్టడాలు బృహధీశ్వరాలయాన్ని పోలివుండడం కనిపెట్టవచ్చు .

ప్రతీ శివరాత్రకి ఈ మందిరంలో నాట్యప్రదర్శనలు జరుగుతాయి , వీటిలో పాల్గొనడానికి , చూడడానికి దేశవిదేశాలనుంచి అనేకమంది వస్తూవుంటారు .

దక్షిణాది రాష్ట్రాలలో మంచి భోజనం కోసం వెతుక్కో అక్కరలేదు , చిన్న పాటి హోటల్ లో కూడా మంచి భోజనాలు దొరకుతాయి . వచ్చేవారం మరి కొన్ని మందిర వివరాలతో  మీ ముందుంటానని మనవి చేస్తూశలవు .

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు