మూడు దశాబ్ధాల క్రితం పుట్టింది వరల్డ్ వైడ్ వెబ్. అప్పట్లో ఇదొక సాంకేతిక విప్లవం అవుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఇప్పుడిది ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆ మాటకొస్తే, ప్రపంచాన్ని చాలా చిన్నదిగా మార్చేసింది. క్షణాల్లో సమాచారాన్ని ప్రపంచమంతా తిప్పేస్తోంది. అన్నిటికీ ఇంటర్నెట్. అందరికీ ఇంటర్నెట్. ఇంటర్నెట్‌తో పని లేదంటే అసలు ప్రపంచంతో పని లేనట్లే. రెండు దశాబ్ధాల క్రితం ఇంటర్నెట్ అంటే అదో బ్రహ్మ పదార్ధం. కానీ ఇప్పుడది అందరికీ చేరువైపోయింది. సమస్త సమాచారమ్ ఒకే ఒక్క క్లిక్‌లో నిక్షిప్తమైపోయింది. 1989 మార్చి 12న వరల్డ్ వైడ్ వెబ్ రూపొందింది. కానీ 1990లో తొలి వెబ్ బ్రౌజర్‌ని రూపొందించడం మొదలుపెట్టారు. 1991 ఆగస్ట్‌లో ఇది సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది.
మొదట్లో ఇంటర్నెట్ సేవలు పొందడానికి చాలా అవస్థలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు చిటికెలో పని. ఎంత పెద్ద సమాచారాన్ని అయినా క్షణాల్లో అది చేరాలనుకున్న చోటికి చేరిపోతోంది. ఈ ఇంటర్నెట్ తెచ్చిన విప్లవం కారణంగానే ప్రపంచం స్మార్ట్‌గా మారిపోయింది. ఎంత స్మార్ట్‌గా అంటే రాత్రి ఒక అప్‌డేట్ ఉంటే, పొద్దున్నకి ఇంకో వంద అప్‌డేట్స్ పుట్టుకొచ్చేలా. విద్య, వైద్యం, వ్యాపారం.. ఇలా ఒక్కటేమిటీ, అన్నింటికీ అంతర్జాలమే ఆధారం అయిపోతోంది. అత్యంత క్లిష్టతరమైన సర్జరీలు ఇంటర్నెట్ సాయంతో చేసేస్తున్నారు నేటి వైద్యులు. విదేశీ యూనివర్సిటీల్లో అభ్యసించాల్సిన ఖరీదైన విద్య కూడా స్మార్ట్ ఫోన్‌లో లభించేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటర్నెట్ మనిషి శరీరంలో ఒక ప్రధాన అవయవం అనే స్థాయికి వెళ్లిపోయింది.
అతి సర్వత్రా వర్జయేత్.. అని పెద్దలు ఊరికే అనలేదు. ఈ ఇంటర్నెట్ విషయంలో అతి అత్యంత ప్రమాదరకంగా మారుతోంది. ప్రధానంగా పిల్లల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. కత్తి పదును ప్రాణాలు తీయడానికీ, పనికొచ్చే పనులకీ ఎలా ఉపయోగపడుతుందో ఇంటర్నెట్ కూడా అంతే. ఏడాది లోపు పిల్లలు ఇంటర్నెట్‌కి అడిక్ట్ అయిపోతున్నారు. ఈ అడిక్షన్ ఓ వయసుకొచ్చేసరికి ప్రమాదకరంగా మారుతోంది. సమాజానికి మేధావుల్ని అందిస్తోన్న ఇంటర్నెట్, కరడు కట్టిన నేరగాళ్లనూ పరిచయం చేస్తోంది. దురదృష్టవశాత్తూ ఇంటర్నెట్‌ని అదుపు చేయడం సాధ్యం కాని పని.