ఈ వారం ( 15/3 – 21/3 ) మహానుభావులు
జయంతులు
మార్చ్ 15
శ్రీ మునిమాణిక్యం నరసింహారావు : మార్చ్ 15, 1896 న సంగంజాగర్లమూడి లో జన్మించారు. ఇరవైయ్యవ శతాబ్దం మొదటి పాదంలో ఒక కథకుడిగా రూపుదిద్దుకున్నారు. కుటుంబ జీవితంలోని కష్టసుఖాలు, దాంపత్య జీవితంలోని సౌందర్యం ఈయన కథలలో ప్రస్పుటంగా కనిపిస్తాయి. ఈయన సృష్టించిన కాంతం తెలుగు సాహిత్యంలోనే పెద్ద పీట వేసుకుని కూర్చుంది. తన రచనల ద్వారా మధ్యతరగతి సంసారంలోని సరిగమల్ని ఎన్నింటినో వినిపించాడు మునిమాణిక్యం.తెలుగు హాస్యరచయితలలో మునిమాణిక్యం గారికి ఒక విశిష్టస్థానం ఉంది.
మార్చ్ 16
శ్రీ మామిడి వెంకటార్యులు : వీరు, మార్చ్ 16, 1764 న బందరు లో జన్మించారు.తొలి తెలుగు నిఘంటు కర్త. ఈయన ఆంధ్ర దీపిక పేరుతో రాసిన నిఘంటువు తెలుగు భాషా చరిత్రలో ఒక నూతన ఒరవడికి నాందిపలికింది.ఈయన సంస్కృతంలో రచించిన శబ్దార్థ కల్పతరువు మొదటిగా అచ్చయిన సంస్కృత నిఘంటువు.ఈయన "ఆంధ్ర లక్షణం", "పర్యాయ పదాల రత్నమాల", "శకట రేఫ లక్షణం", "విశేష లబ్ద చింతామణి", " తెలుగు వ్యాకరణం" వంటి గ్రంథాలను రచించారు. తెలుగు వ్యాకరణంలో దంత్య తాలవ్యాలను వెంకటార్యులే మొదట ప్రవేశపెట్టారు. వేదాలు, ఉపనిషత్తులను అధ్యయనం చేశారు.యాజ్ఞవల్కుని పరాసర సంహితను తెలుగులోకి అనువదించారు.
2. శ్రీ పొట్టి శ్రీరాములు : వీరు మార్చ్ 16, 1901 న మద్రాస్ లో జన్మించారు.
ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు.
శ్రీ మునిపల్లె రాజు : వీరు మార్చ్ 16, 1925 న గరికపాడు లో జన్మించారు. వీరి అసలు పేరు శ్రీ మునిపల్లె బక్కరాజు. తెలుగు కథకులలో ప్రముఖుడు.[1] ఈయన తెలుగులో మొదటి సారిగా మాజికల్ రియలిజం శైలిలో కథ రాశారు. వీరు 69 కథలు, ఒక నవల రాసారు. “ పూజారి “ అనే వీరు రాసిన నవలనే శ్రీ బి.ఎన్. రెడ్డి “ పూజాఫలం “ పేరిట సినిమాగా నిర్మించారు.
మార్చ్ 17
శ్రీ రాయప్రోలు సుబ్బారావు : వీరు మార్చ్ 17 , 1892 న బాపట్లలో జన్మించారు.తెలుగులోభావ కవిత్వానికి ఆద్యుడు. ఈయన 1913లో వ్రాసిన తృణకంకణము తో తెలుగు కవిత్వములో నూతన శకము ఆరంభమైనదని అంటారు. ఇందులో ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించారు.. ప్రేమ పెళ్లికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో ఖండకావ్య ప్రక్రియకు అంకురార్పణ చేశారు.. మన సమాజానికి అనుగుణంగా భావుకతను అల్లి తెలుగు కవిత కు క్రొత్త సొగసులు అద్దారు..
మార్చ్ 20
శ్రీ చిర్రావూరి లక్ష్మినరసయ్య : వీరు మార్చ్ 20, 1915 న కైకొండాయి లో జన్మించారు. తెలంగాణా పోరాటయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు. వీర తెలంగాణ సాయుధ పోరాటం అన్ని దశల్లోనూ అగ్రభాగాన ఉన్నారు.
వర్ధంతులు
మార్చ్ 15
శ్రీ రాళ్ళబండి కవితా ప్రసాద్ : ప్రముఖ తెలుగు అవధాని , కవి. వీరు 500కు పైగా అవధానాలను చేశారు.. వాటిలో అష్టావధానాలతో పాటుగా శతావధానాలు, ద్విశతావధానాలు ఉన్నాయి. సంప్రదాయ అవధానంతో పాటు కథ, వచనకవిత, గణితం వంటి అనేక ప్రక్రియలను అవధానంలో చొప్పించారు.. ఒకసారి 25 నిమిషాలలో విచిత్ర అష్టావధానం చేసి పండితుల మెప్పు పొందారు.. వరంగల్లోని భద్రకాళి దేవాలయంలో ఏకదిన శతకరచన ధార అనే కార్యక్రమాన్ని చేపట్టి ఒకే రోజులో ఆశువుగా శతకాన్ని చెప్పారు.. ఆశుకవితా ఝరి పేరుతో గంటకు 500 పద్యాలు ఆశువుగా చెప్పారు..
వీరు మార్చ్ 15, 2015 న స్వర్గస్థులయారు.
మార్చ్ 16
శ్రీ సముద్రాల రాఘవాచార్య . తెలుగు సినిమా పరిశ్రమలో సముద్రాల సీనియర్గా ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకుడు మరియు నేపథ్యగాయకుడు.. 100 కు పైగా సినిమాలకు స్క్రిప్ట్ రాసారు. వాహిని సినిమాలకు సముద్రాల ఆస్థాన రచయితగా మారిపోయారు.. ఇతడు దాదాపు 80 చిత్రాలకు పనిచేసి సుమారు 1000 పాటలను రచించారు.
వీరు మార్చ్ 16, 1968 న స్వర్గస్థులయారు.శ్రీమతి శ్రీరంగం గోపాలరత్నం : ఆకాశవాణిలో శాస్త్రీయ మరియు లలిత సంగీత గాయకురాలు. అన్నమయ్య పదాలు, క్షేత్రయ్య పదాలు, మీరా భజన గీతాలు మొదలైనవి ఈమె ఆలపించిన పాటల్లో ప్రాచుర్యం పొందినవి. 1992 లో ఈమెకు భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారంలభించింది.వీరు మార్చ్ 16, 1993 న స్వర్గస్థులయారు.
మార్చ్ 17
శ్రీ నాళం కృష్ణారావు : బాల సాహిత్యబ్రహ్మ, మధుర కవి. తెలుగు వైతాళికుడు. సంఘ సంస్కర్త. గౌతమీ గ్రంథాలయం స్థాపకుడు."మానవసేవ" పత్రిక సంపాదకులు. స్వాతంత్ర్య సమర యోధుడు, భాషావేత్త. తమ 17 వ ఏట, రాజమండ్రి లో గౌతమీ గ్రంధాలయం స్థాపించారు.వీరు మార్చ్ 17, 1961 న స్వర్గస్థులయారు. శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్య : వీరు ప్రముఖ రచత. ఈయన కృషి ఫలితంగా జెనీవా నగరంలో మొరియా విశ్వవిద్యాలయం రూపొందింది. ఇది మానవ జీవితానికి ఆవశ్యకాలైన తత్వశాస్త్ర, వైద్యశాస్త్రాలను సమగ్రంగా సమన్వయించే విద్యాపీఠం. హోమియోపతి వైద్యవిధానం భారత దేశ ఆర్థిక పరిస్థితికి చక్కగా సరిపోతుందని భావించి, ఈయన కొన్ని కేంద్రాలలో ఉచిత హోమియో వైద్యాలయలను నెలకొల్పారు. ఈ వైద్యశాస్త్రాన్ని వివరించే సారస్వతాన్ని తెలుగులోను, ఆంగ్లంలోను రచించారు.భగవద్గీత రహస్యాల మీద ఈయన వ్రాసిన శంఖారావం పుస్తకం అద్వైతానికి విస్తృత భాష్యం, వివరణ ఇస్తుంది. వీరు మార్చ్ 17, 1984 న స్వర్గస్థులయారు.
మార్చ్ 20
శ్రీ ఉప్పు శోభనాచలపతి రావు. : శోభన్ బాబుగా ప్రసిధ్ధి చెందారు . ప్రముఖ సినీ నటుడు.తన చలన చిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయారు.వీరు మార్చ్ 20 , 2008 లో స్వర్గస్థులయారు.
మార్చ్ 21
శ్రీ తుమ్మల సీతారామ్మూర్తి : తెలుగులెంకగా సుప్రసిధ్ధుడైన ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు. అచ్చ తెలుగు మాటలతో అందమైన పద్యాలు అల్లగలిగిన ఆధునిక కవుల్లో తుమ్మలను మించిన వారు లేరంటె అతిశయోక్తి కాదు. ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు.
వీరు మార్చ్ 21, 1990 న స్వర్గస్థులయారు.