కొంతమందుంటారు, వాళ్ళకి ఎప్పుడూ ఒకటే ధ్యాస.. అవతలివాడు, మనకంటే ఏదో బాగుపడిపోతున్నాడేమో అనే ఏడుపు!దానితో అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో ఒక మాటనడమో, అడిగినవాడికీ, అడగనివాడికీ దండోరా వేయడమో.అవతలివారు, ఏదో తమ దారిన తాము వెళ్తున్నారుగా, అసలు ఈ “పక్షుల” కి ఎందుకూ అంట? ఆ పక్షులు మొగాళ్ళవొచ్చు, ఆడాళ్ళవొచ్చు.ఏడవడం వచ్చేసరికి లింగవివక్షతనేదుండదు.మనం చేయలేనిదేదో, అవతలివాడు చేస్తున్నాడూ, వాళ్ళకి తాటాకులుకట్టడం మన పనీ, అంతే!దానికి ఓ అర్ధం పర్ధం ఉండదు.
ఇదివరకటి రోజుల్లో , ఇదివరకేమిటిలెండి, ఈమధ్యదాకా, అంటే ప్రభుత్వం వారు పే కమీషను వేసి, ప్రభుత్వోద్యోగులకీ జీతాలు పెంచేదాకా, కుటుంబ పరిస్థితులవలననండి, లేదా, ఇంట్లో సౌఖ్యం, శాంతీ ఉండకపోవడంవలననండి, ఏదో ఒక కారణంచేత, ఉద్యోగానికి సాయంగా, ఆఫీసునుంచి వచ్చేసిన తరువాత, అక్కడినుంచే direct గానో, ఇంటికొచ్చి ఓ కాఫీయో, చాయో తాగేసి, ఓ రెండు మూడు గంటలపాటు ఓ part time job చేసేవారు.ఏ రాత్రి తొమ్మిదింటికో, పదింటికో కొంపకు చేరేవారు. మళ్ళీ ప్రొద్దుటే లేవడం, ఆఫీసూ వగైరా..ఇలా వచ్చిన పైసంపాదన తనుసంపాదిస్తున్న జీతభత్యాలకి వేణ్ణీళ్ళకి చన్నీళ్ళలాగ ఉపయోగపడేది.అదేమీ తప్పేం కాదు.చూసేవాళ్ళ దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది.
ఇంటిమగాడు, ఏదో రెండుమూడు బట్టల దుకాణాల్లోనో, కిరాణా దుకాణాల్లోనో పద్దులు వ్రాయడం, వాళ్ళ ఎకౌంట్లు చూడ్డం చేసేవారు. వాటినే ఈ రోజుల్లో data entry అని ఓ sophisticated పేరు పెట్టేరనుకోండి, అది వేరే విషయం.ఇళ్ళల్లో ఆడవారు,ఏ బ్యుటీషియన్ కోర్సో చేసి, హాయిగా ఇంట్లోనే ఓ పార్లరు లాటిది తెరిచి పని చేసేవారు. కాదూ కూడదూ అనుకుంటే, హాయిగా బట్టలు కుట్టడం నేర్చుకోడం, కాలనీలో వాళ్ళకి కుడుతూండడం. అలా అలవాటై చేసినవాళ్ళే ఇప్పుడు, బొటీక్కులూ అవీ ప్రారంభించారు.లక్షలకి లక్షలు సంపాదిస్తున్నారు.
కానీ, వీళ్ళందరూ ఆ part time joబ్బులు ప్రారంభించినప్పుడు, మన ” పక్షులు” న్నారే, వాళ్ళు ఎంతంతగా యాగీ చేసేవారో- “విన్నావుటే.. ఫలానా ఆవిడ బట్టలు కుడుతోందిట, మన ఇంటా వంటా ఎక్కడైనా విన్నామా.. ఫలానా ఆవిడ అదేదో బ్యూటీ శలూన్ అని పేరెట్టి, అడ్డమైన పనులూ చేస్తోందిటా…ఏమిటో కలికాలమూ...”.మరి ఈరోజుల్లో లేడీస్ టైలర్లూ, బ్యూటీ శలూన్ లూ లేకుండా జరుగుతోందా? ఎవరికిష్టమున్నది వారు నేర్చుకుంటారు. అలాగే వంటలూ, వార్పులూనూ, ఈరోజుల్లో క్యాటరింగుకీ, హోటెల్ మానేజ్మెంటుకీ కాలేజీలూ అవీనూ… అదే ఇదివరకేమనేవారూ.. ” అయ్యో..అయ్యో.. వంటమనిషిగా చేస్తోందిట…”. ఏ పనైనా సరే dignity of labour చూడాలి కానీ, తాము చేయలేనిదేదో, అవతలివారు చేసేస్తున్నారో బాగుపడిపోతున్నారో అని ఏడవకూడదు.
ఈ రోజుల్లో వారివారి ఆసక్తులనిబట్టి ఆడవారూ, మగవారూ కూడా ఎన్నెన్నో రంగాల్లో part time jobs చేస్తున్నారు. ఉదాహరణకి కాలేజీకెళ్ళే పిల్లలు, శలవలొచ్చాయంటే, pocket money కోసం, ఏదో ఒక పని చేస్తారు, బుధ్ధిమంతులైనవాళ్ళు- ఓ న్యూసుపేపరు డెలివరీ కావొచ్చు,లేదా ఏ Mcdonalds, Pizza Hut, Dominos లోనో డెలివరీ బాయ్ కింద. అలాచేస్తున్నాడు కదా అని, ఏదో చేయరాని పని చేస్తున్నట్టు చెవులు కొరుక్కోడం బాగుండదు.
ఈరోజుల్లో ఎక్కడ చూసినా Corporate Colleges, Management Institutes..కావలిసినన్నున్నాయి, అదీ పెద్ద పెద్ద నగరాల్లో అయితే మరీనూ. వాళ్ళకి రెగ్యులర్ వాళ్ళకన్నా, part time వాళ్ళంటేనే ఆసక్తి చూపిస్తారు. వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి- రెగ్యులర్ వాళ్ళైతే పిఎఫ్ లూ, శలవలూ, యూనియన్లూ గొడవానూ, హాయిగా గంటకింతా అని, ఎవరినో engage చేసేసికుంటే, వాళ్ళ పనీ అవుతుంది,ఆ చెప్పేవాళ్ళ అవసరమూ తీరుతుంది. ఉభయతారకం.
ఎంత పెద్దపెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారైనా, ఏదో అవసరాన్నిబట్టో,టైం పాసుకో,కాదూకూడదూ అంటే, చిన్నప్పటినుండీ అవకాశాలు రాక నిద్రాణమైన కోరిక తీర్చుకోడానికో, ఏ వీకెండుకో ఏదో ఒక కాలేజీలోనో, లేక ఏదో ఒక Management Institute లోనో పాఠాలు చెప్పడానికి చేరతారు. అదేదో తిన్నతిండరక్క కాదు.పోనీ అవన్నీ ఏమైనా Cake walk లా ఏమిటీ, ఎంతంత శ్రమ పడాలి, ఇంట్లో భర్తా పిల్లలనీ చూసుకోవాలి, అక్కడ తీసికున్నపనికి న్యాయం చేయాలి. ఇంత కార్యక్రమం ఉంది. కానీ, పనీ పాటాలేని, రోజంతా టీవీ సీరియళ్ళలోనో, కిట్టీ పార్టీల్లోనో కాలం గడిపేవారికి ఇలాటివి somehow they just can not digest. ఛాన్సు దొరికినప్పుడల్లా ఏదో ఒక మాటనడం.అవతలివారిని బాధపెట్టడం. అదో sadistic pleasure.
ఈ మధ్య నగరాల్లో టాక్సీ సర్వీసులు UBER, OLA లాటివి వచ్చేసాయి. కొన్ని నగరాలలో, స్వంత కార్లు ఉన్నవాళ్ళుకూడా, ఖాళీ టైములో , టాక్సీలుగా నడుపుతున్నారు. సంపాదనా పెరుగుతోంది. ఇదివరకటి కంటే , ఈరోజుల్లో అవకాశాలుకూడా ఎక్కువగా ఉండడంతో , వీలవుతోంది… ఎవరిష్టం వారిది. తప్పుపట్టే హక్కు ఎవరికీ లేదు. న్యాయమార్గంలో సంపాదిస్తున్నంతవరకూ, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.
సర్వేజనా సుఖినోభవంతూ…