సాగర సంగమం సినిమా చూశారా? అందులో కమల్‌హాసన్ నాట్యం తప్పుగా చేసిందని ఎస్.పి శైలజని తిట్టి "పంచ భూతములు.." అని పాట వచ్చేచోట అభినయించాల్సిన విధానం అదికాదు ఇది అని వివిధ నృత్య సాంప్రదాయాలలో చేసి చూపిస్తాడు. పంచ భూతాలు అంటే దెయ్యాలూ, భూతాలు కాదు అని చెపుతాడు.
పృథివ్యప్‌తేజోవాయురాకాశాలే పంచ భూతాలు. సులభంగా చెప్పుకోవాలంటే భూమి, నీరు, గాలి, అగ్ని (వెలుగు), ఆకాశము. ఇవే ప్రత్యక్ష దైవాలు. వేదకాలం నుండి వీటి గురించి మనకి తెలుసు. వీటి ఉపయోగాలు, ఆవస్యకతలూ కూడా మనకి తెలుసు. సైన్స్‌అభివృధ్ధి కారణంగా వీటికి సంబంధించిన లోతైన రహస్యాలని కూడా తెలుసుకోగలుగుతున్నాం. ఇక ఆరో భూతం విషయానికి వస్తే, వేదకాలంలో దీని ప్రాముఖ్యతని గుర్తించలేదో లేక దీని గురించి ఆలోచించలేదో తెలియదుగానీ దీని గురించి ఎక్కడా ప్రస్థావించలేదు. విశ్వవ్యాప్తమై ఉన్న ఈ భూతం యొక్క రహస్యాన్ని ఇంతవరకూ సైన్స్ కూడా తెలుసుకోలేకపోయింది. ఒక సందర్భంలో అబ్దుల్ కలాంగారు దీని గురించి తెలుసుకుంటే దేవుణ్ణి తెలుసుకున్నట్టే అని అన్నారు. ఈ భూతాన్ని ఉపయోగించుకోవడం తెలిస్తే జీవితంలో వ్యక్తిగతంగా, సామాజికంగా, ఆర్ధికంగా కూడా ఎన్నో విజయాలు సాధించవచ్చు. భూమిని మన ఆధీనంలోకి తెచ్చేసుకుని మనకి కావాల్సిన విధంగా వాడుకుంటున్నాం. గాలిని బంధించగలం, ఆనకట్టలు కట్టి నీటి ప్రవాహాన్ని ఆపగలుగుతున్నాం, అగ్నిని రగిలించే శక్తి, ఆర్ప గలిగే శక్తి మనకున్నాయి. ఇక ఆకాశానికి సంబంధించి ఎన్నో రహస్యాలు తెలుసుకున్నాం, తెలుసుకుంటున్నాం! కానీ ఈ ఆరో భూతం విషయానికి వస్తే దాంతో కలిసి పరిగెత్తడం తప్ప మనం ఏమీ చెయ్యలేము! అయితే కాస్త బద్దకం తగ్గించుకుని, తెలివిగా మసులుకుంటే ఈ భూతాన్ని మనం చాలా గొప్పగా ఉపయోగించుకోవచ్చు. ఇంతకీ ఆ ఆరో భూతం ఏంటి అంటారా? కాలం! చరాచరాలనీ, చతుర్దశ భువనాలనీ, సమస్త విశ్వాన్ని, చివరికి దైవాన్ని కూడా శాసించ గలిగే అత్యంత శక్తివంతమైన భూతం.
కాలం దైవాన్ని శాసించడం ఏంటి? అనుకుంటున్నారా? నేను చెప్పుతున్నది నిజమేనండి! మన వేదాలలో రాసి ఉన్న సమాచారం ప్రకారం మొత్తం 43,20,000 సంవత్సరాలని ఒక దివ్య యుగం అంటారు. ఆలాంటి వేయి దివ్య యుగాలు బ్రహ్మదేవుడికి ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము లేదా సర్గము అంటారు. మరొక వేయి దివ్య యుగాలు బ్రహ్మదేవుడికి ఒక రాత్రి. ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము. ఆ తరువాత అర్హత కల్గిన మరోకరు బ్రహ్మ పదవిని స్వీకరిస్తారు. మీకు తెలుసా? ప్రస్తుత బ్రహ్మ కాలం ముగిసినాక ఆ స్థానాన్ని మన హనుమంతులవారు అధీష్టించబోతున్నారట. వ్యాయామం చేయ్యడానికి సమయం ఉండటం లేదు, దేవుడి పూజకి కూడా సమయం ఉండటం లేదు, ఫలానా పని చెయ్యాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను కానీ సమయం ఉండటం లేదు, పెళ్ళాం పిల్లలతో గడపడానికి కూడా సమయం దొరకడం లేదు లాంటి మాటలు మనం తరచూ వింటూ ఉంటాం. కానీ, కాలాన్ని ఒక ప్రణాలిక ప్రకారం విభజించుకుంటే సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. అయితే ఊరికే ప్రణాలిక సిధ్ధం చేసుకుంటే సరిపోదు దాన్ని తూ.చా తప్పకుండా పటించాలి. అప్పుడే మనం అనుకున్నవి అనుకున్నట్టు, అనుకున్న సమయానికి చెయ్యగలుగుతాం. లేదంటే ప్రతీదానికి సమయం లేదు అని చెప్పుకుంటూ ఉండాల్సొస్తుంది.
కాలాన్ని శరీరం, సాధన, సంపాదన, సంసారం అని నాలుగు భాగాలుగా విడగొట్టండి. దేనికి ఎంత సమయం కేటాయించాలనుకుంటున్నారో రాసి పెట్టుకోండి. కాస్త కష్టంగా అనిపించినా కొంతకాలం ఆ ప్రణాలిక ప్రకారమే కొనసాగండి. ఆ తరువాత "సమయం లేదు" అనే మాట వాడల్సిన అవసరం ఎప్పటికీ రాదు.
శరీరం అనే విభాగంలోని కాలంలో మనం చెయ్యాల్సిన పనులు కాలకృత్యాలు, వ్యాయామం, ధ్యానం, ఆహారం తీసుకోవడం నిద్ర పోవడం. ఆరోగ్యంగా బ్రతకాలంటే వ్యాయామం చాలా అవసరం. రోజుకి ఒక్కసారైనా గుండెని దాని సాధారణ వేగం నుండి బాగా పెంచాలి. శరీరానికి చెమట పట్టాలి. అప్పుడే రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది. దైనందిన పనుల వల్ల శరీరానికి చెమట పట్టినప్పటికీ అవి వ్యాయామం కింద లెక్క రావు. మానసిక ప్రశాంతతకి ధ్యానం చాలా అవసరం. సమతుల్యామైన ఆహారము, కనీసం ఆరుగంటల నిద్ర ఉంటే ఆరోగ్య సమస్యలు ఉండవు. సాధన అనే విభాగంలో రోజూ కనీసం రెండు గంటలు కేటాయించండి. మనకు అభిరుచి ఉన్న విషయం నేర్చుకోవడానికి, వార్తా పత్రికలు, మంచి పుస్తకాలు చదవడానికి, పూజలు వంటి వాటికోసం ఈ సమయాన్ని వెచ్చించండి. ఫేస్‌బుక్, వాట్సప్, టీ.వీ, ఇంటర్నెట్లకన్నా పుస్తకాలు చాలా మేలు చేస్తాయి.
సంపాదన! ఈ విభాగంలో ఉద్యోగస్తులు తమ ఉద్యోగాలని, వ్యాపారులు తమ వ్యాపారాలనీ చూసుకోవాలి. కనీసం పది గంటల కాలం ఈ విభాగంలో వెచ్చించక తప్పదు. గృహిణులైతే ఈ సమయాన్ని ఇంటి పనులకి, చదువుకునే పిల్లలైతే స్కూళ్లకీ కాలేజీలకి వెచ్చించాలి.వారంలో ఆరు రోజుల కాలాన్ని శరీరం కోసం, సాధన కోసం, సంపాదన కోసం ఖర్చు చేసెయ్యండి. ఏడో రోజు అంటే ఆదివారం మాత్రం హాయిగా కుటుంబంతో గడపండి. ఈ సమయమే మీరు చాలా ఆనందంగా గడపగలిగిన సమయం అన్న విషయం మర్చిపోకండి. ఎంత సంపాదించినా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా కుటుంబంతో గడపకపోతే అనుబంధాలు బలహీన పడిపోతాయి. అందువల్ల మీరెంత “బిజీ మాన్” లేదా “బిజీ ఉమెన్” అయినా కుటుంబం కోసం ఖచ్చితంగా ఒక రోజుని కేటాయించండి. అప్పుడప్పుడు ఈ సమయాన్ని స్నేహితులకి కూడా కేటయించవచ్చు.
ఈ విధంగా ఆరో భూతాన్ని ప్రణాలికా బద్దం చేసుకుంటే వీలవ్వడం లేదు, టైం ఉండటం లేదు లాంటి మాటలు వాడాల్సిన అవసరం ఉండదు. మనవల్ల ఎవరూ ఇబ్బంది పడరు. ముఖ్యంగా మనవల్ల మనం ఇబ్బంది పడకుండా ఉంటాం. ఆఫీసులకి, స్కూళ్లకీ లేటైందని ఉరుకులూ పరుగులూ పెట్టడం ఉండదు. వేగంగా వాహనం నడిపి ప్రమాదాలకి గురవ్వాల్సిన అవసరం ఉండదు. జీవితాన్ని ఆనంద మయం చేసుకోవచ్చు. ఇంకా చాలా లాభాలు ఉంటాయి. ఒక్క వారం మీ కాలాన్ని ప్రణాలికా బద్దంగా వాడి చూడండి. అది అద్భుతాలని సృష్టిస్తుంది. జీవితాన్ని ఆనంద మయం అయిపోతుంది.