ఆశ
ఒక్కసారైనా పువ్వుగా పుట్టించమని
భగవంతుడిని వేడుకున్నా
ఆయన పాదాల చెంతకి చేరాలనే ఆశతో..!
తధాస్తు..! అన్నాడు
జన్మించా! వికసించా! పరిమళించా!
విశ్వాన్ని గెలిచినంతగా ఆనందించా!
పుట్టిన కొన్ని గంటలలోనే
వడలిపోతున్న దేహాన్ని చూసుకుని
బిక్కమొఖమేశా!
వీస్తున్న గాలి నా పరిమళాన్ని దొంగిలిచుకుపోతూ
నా చిరు ఆయుష్షుని వెక్కిరిస్తుంటే
చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయా
చెట్టు తన అశక్తతని దీనమైన చూపులతో
వ్యక్తపరుస్తుంటే కృంగిపోయా
పండుటాకులన్నీ విషాదంగా తల వంచుకుంటే
మనిషికే కాదు పూలకి కూడా వార్ధక్య బాధ
తప్పదని తెలుసుకున్నా!
చింత వృద్దాప్యం వచ్చినందుకు కాదు
జన్మ సార్దకం చేసుకోలేకపోయినందుకు
దేవుడి పాదాలు చేరలేనందుకు!
మళ్ళీ ఎదురు చూస్తూనే ఉన్నాను
కొత్త చిగురుల ఆమని కోసం
ఎందుకంటే...!
ప్రతి ప్రాణికి ఆశ సహజమే కదా!
సుజాత పి.వి.ఎల్
సుజాత పి.వి.ఎల్