ప్రపంచం చాలా వేగంగా పరుగులు పెడుతోంది సాంకేతిక రంగంలో. గడిచిన పదేళ్లలో సాధించిన విజయాల్ని, అంతకు ముందు ఏభై ఏళ్లలో సాధించిన విజయాలతో పోల్చలేం. పూటకో ఆవిష్కరణ, గంటకో అద్భుతం, క్షణానికో కొత్త ఆలోచన.. ఇదీ నేటి ట్రెండ్. ఆశక్తికరమైన విషయమేంటంటే గడిచిన ఐదేళ్లలో అద్భుతాలు సృష్టిస్తున్న ఆవిష్కర్తలు తక్కువ వయసున్న వారే కావడం. అంటే ఒకప్పుడు జీవితమంతా కష్టపడి, నడి వయసులోనో, వృద్ధాప్యంలోనో అద్భుతాల్ని ఆవిష్కరించేవారు. అప్పటి పరిస్థితులు అలాంటిది. ఇప్పుడలా కాదు. బుర్రలో ఆలోచన మెదలడమే ఆలస్యం. అది ఏ వయసులో మొదలవుతుందనేదే కీలకం. ప్రపంచమంతా స్మార్ట్‌గా మన చేతుల్లోకి వచ్చేశాకా, ఏ కొత్త విషయం గురించైనా తెలుసుకోవడం చాలా తేలికైపోయింది. ప్రతీదాన్ని పరిశోధనాత్మక కోణంలో చూడాలన్న ఆలోచన ఈ జనరేషన్‌లో ఎక్కువగా కనిపిస్తోంది.
ఒకప్పుడు పరిశోధనలకు అవకాశాలు తక్కువ. అభినందనలు ఇంకా తక్కువ. ప్రోత్సాహం అనే మాటకు సరిగ్గా అర్ధమే ఉండేది కాదు. ఇప్పుడు ఈ మూడింటితో తంటా ఏమీ లేదు. చేతిలో మొబైల్ ఫోన్. మెదడులో ఆలోచన. మిగతావన్నీ ఆటోమెటిగ్గా జరిగిపోతాయంతే. అంతరిక్షంలోకి దూసుకెళ్లే శాటిలైట్ కావచ్చు, ఇంకో అద్భుతమైన గాడ్జెట్ కావచ్చు ఏదైనా సరే ఇప్పుడంతా స్మార్ట్ థింకింగ్. స్కూల్ స్థాయి నుండే రోబోటిక్స్ మీద అవగాహన పెరిగిపోయింది. దాంతో మానవ మేధస్సును కృత్రిమ మేధస్సుతో లింక్ చేయడం తేలికైపోయింది. ఇది దాదాపుగా అన్ని రంగాల్లోనూ కనిపిస్తోంది. ఓ అంచనా ప్రకారం సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్న వారి వయసు, 10 నుండి 25 ఏళ్ల లోపు ఎక్కువ శాతం ఉందని తేలింది. దీని అర్ధం స్కూల్ నుండి కాలేజ్ వరకూ పిల్లల మెదళ్లు ఎంత చురుగ్గా పని చేస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు.
ముందున్నది అసలు సిసలు పండగ. ఎందుకంటే రాబోతోంది కొత్తతరం. కొత్తతరం అంటే.. కొత్తతరానికి, పాత తరానికి తేడా జస్ట్ రోజులు, లేదా నెలలు మాత్రమే. నిన్నటి ఆలోచనలకు, రేపటి ఆలోచనలకు అసలు పొంతనే ఉండదు. ఇప్పటికిప్పుడు చేస్తున్న ఉద్యోగం మానేసి, సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడదాం. కొత్త తరంతో పోటీ పడదాం.. అనే ఆలోచన కూడా కొంత మందిలో పెరుగుతోంది. సాంకేతిక రంగంలో ఇంతటి విప్లవాత్మకమైన మార్పు వస్తుందని పదేళ్ల క్రితమో, ఇరవై ఏళ్ల క్రితమో ఎవరూ ఊహించి ఉండరు. అలా ఎవరూ ఊహించి ఉండరు కాబట్టే, ఇది ఇంతటి అద్భుతంలా కనిపిస్తోంది. స్మార్ట్ ప్రపంచంలో చిన్న చిన్న విషయాలే ప్రపంచ అద్భుతాలుగా మారిపోతున్నాయి. అది నానో శాటిలైట్ కావచ్చు.. నానో వెపన్ కావచ్చు.. వైద్య రంగంలో నానో శస్త్ర చికిత్స కావచ్చు.. ఇవన్నీ కొత్త ప్రపపంచంలోకి మనల్ని తీసుకెళ్లిపోయాయి. ఇంట్లో యాక్టివ్‌గా కనిపించే పిల్లల్ని కాస్త జాగ్రత్తగా గమనించి వారికి ఆశక్తి ఉన్న రంగం వైపు ప్రోత్సహించగలిగితే ఈ అద్భుతాలు ముందు ముందు చిన్నబోతాయి. మహాద్భుతాలు సృష్టించబడతాయి.