యువశక్తి అత్యధికంగా ఉన్న దేశాల్లో భారతదేశానికి ప్రపంచంలోనే అగ్రస్థానం. ఇంత పెద్ద ఎత్తున యువత దేశంలో ఉన్నా వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పాలకులు విఫలమవుతూ వస్తున్నారు. దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది. యువతని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తూ ఈ మధ్య రాజకీయ పార్టీలు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. చట్ట సభల్లో యువతకు సరైన అవకాశాలు కల్పిస్తే దేశ ప్రగతిని పరుగులు పెట్టించగలరన్న సోయ రాజకీయ పార్టీలకు ఇన్నాళ్లూ లేకుండా పోయింది. రాజకీయాల్లో యువతరం అంటే ఏభై ఏళ్లు దాటిపోవాలి. ఏభై ఏళ్లు దాటిన వారిని మాత్రమే యువనాయకుడు అని పిలిచేవారు. మిగతావాళ్లంతా కార్యకర్తలే. అయితే ఇదంత ఒకప్పటి మాట. రోజులు మారాయి. రాజకీయ పార్టీలు యువమంత్రం జపించక తప్పడం లేదు.
తెలంగాణాలో కల్వకుంట్ల తారకరామారావు యువనాయకుడిగా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఐదేళ్ల పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ, తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి తన వంతుగా కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు తనయుడు లోకేష్ తన శక్తి మేరకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అధినేతల కుమారులు కాబట్టే, వీరికి అవకాశాలు వచ్చాయనే విమర్శ మామూలే. ఆ సంగతి పక్కన పెడితే, రాజకీయాల్లో యువరక్తం ఇప్పుడు బాగా కనిపిస్తోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యువత పాత్ర చాలా కీలకం కాబోతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు యువతకు మెరుగైన అవకాశాలు ఇవ్వాల్సి వచ్చింది. ఎర్రన్నాయుడి మరణంతో ఆయన కుమారుడు రామ్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. పార్లమెంట్‌లో గట్టిగా తన మాట వినిపించారు. మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ ఈసారి ఎన్నికల బరిలోకి దిగారు. దేవినేని అవినాష్ ఇంకో యంగ్‌స్టర్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న జగన్, పవన్ కూడా యువతరం ప్రతినిధులుగానే చూడాలి. జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగిన వారిలో చాలా మంది యువతరమే ఉన్నారు.
మహిళలకు ఇక్కడ చాలా అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమే. ఆ విషయంలో అన్ని పార్టీలదీ ఒకటే తీరు. ఎట్టకేలకు ఇప్పటికి యువతరానికి మెరుగైన అవకాశాలు వచ్చాయి. ముందు ముందు మహిళా లోకానికి కూడా ఇంతకు మించిన అవకాశాలు రావల్సి ఉంది. పోటీలో ఉన్న వారి సంగతి పక్కన పెడితే, పార్టీలకు వ్యూహ కర్తలుగా యువతరమే పని చేస్తోంది. అభ్యర్దుల్ని గెలిపించడంలో ఈ యువతరం పాత్ర అంతా ఇంతా కాదు. ప్రచారంలో వేడి ఎక్కడ పెంచాలి.? ఎక్కడ తగ్గించాలి.? ఏ అంశాలపై ఎలా స్పందిస్తే ఓట్లు వస్తాయి.? ఇలాంటి వ్యూహాలు యువతరమే రచిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయాల్ని ఇప్పుడు యువతరమే నడిపిస్తోంది. ఎన్నికల వ్యూహాన్ని రచించి, అమలు చేయడమంటే ఆ శక్తి ప్రభుత్వాన్ని నడిపేందుకు కూడా సరిపోతుంది కదా.