ఆన్‌లైన్ ఆటలు.. ప్రాణాల్ని హరించే ఆటలు. ఎందుకింత కష్టం.? ఎందుకిలాంటి ప్రాణ నష్టం..? ఎక్కడో విదేశాల్లో పుడతాయి. మన దేశానికొచ్చి తగలడతాయి. విచిత్రమేంటంటే వీటి పుట్టుక జరిగిన ప్రదేశంలో ఇవి మిగిల్చే నష్టం చాలా తక్కువ. కానీ మన దేశంలో ఈ ఆటలు సృష్టించే నష్టం చాలా చాలా ఎక్కువ. ప్రతీ జ్ఞాపకాన్నీ సెల్ఫీలో బంధించేయాలనే 'సెల్ఫీ పిచ్చి' కూడా విదేశాల నుండి పుట్టుకొచ్చిందే. అయితే మన దేశంలోకొచ్చాకే అది 'పిచ్చి'లా రూపాంతంరం చెందింది. పరుగెడుతున్న రైల్‌కి ఎదురుగా నిలబడి సెల్ఫీ దిగాలన్న పైత్యం, భయంకరమైన పారే జలపాతాల్ని చేతిలో బంధించేసినట్లుగా క్లిక్‌మనిపించే సెల్ఫీ.. ఇలా ఒక్కటేమిటీ ఈ సెల్ఫీ చరిత్ర చెబితే తీరేది కాదు. ఈ పిచ్చకి బలైపోయిన యువత ఎంతమందో లెక్కల్లో చెప్పలేనిది.
ఇదిలా ఉంటే ఇప్పుడు కొత్తగా దాపురించిన మరో మహమ్మారి 'పబ్‌జీ'. ఎవరో తెలీదు. ఎక్కడుంటారో తెలీదు. మైండ్ గేమ్ అంతకన్నా కాదు, ఓ పిచ్చి భ్రమలో ఆడే ఈ ఆట కోసం రియల్ లైఫ్‌లో క్రూరులుగా మారిపోతున్నారు యువత. క్రూరత్వం అంటే ఆఖరికి ప్రాణాలు తీసేంతలా. లేదంటే తమ ప్రాణాల్నే తీసుకునేంతలా.. హైద్రాబాద్‌కి చెందిన ఓ కుర్రోడు, పబ్‌జీ గేమ్ ఆడొద్దంటూ తల్లి మందలించిందని ఆత్మహత్య చేసుకున్న వైనం లేటెస్ట్‌గా వెలుగు చూసింది. ఇలా ఒక్కటి కాదు, చాలానే బలవన్మరణాలు ఈ ఆన్‌లైన్ గేమ్స్ కారణంగా. అయితే అన్నీ వెలుగులోకి రావడం లేదంతే. పరువు పోతుందనో, ఇంకో కారణమనో ఈ తరహా ఆత్మహత్యలు, హత్యలు మరుగున పడిపోతున్నాయి. ఒకవేళ వెలుగులోకి వచ్చినా తదుపరి పరిణామం ఘోచరించడం లేదు. ఈ జాడ్యాన్ని ఆపడం అసాధ్యమా.? అంటే ప్రతీ సమస్యకూ ఓ పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. గ్యాడ్జెట్స్, ఆన్‌లైన్ అండ్ మొబైల్ గేమ్స్‌ని తమ పిల్లలకు అలవాటు చేసే ముందు తల్లితండ్రులు ఒక అవగాహనకు రావాలి. పిల్లలకు వాటి పట్ల లోతైన అవగాహన కల్పించాలి.
ఆట అంటే ఆటలాగే చూడాలి. హద్దులు పెట్టుకోవాలి.. అనే ఖచ్చితమైన కట్టుబాట్లు పెట్టాలి. పిల్లలపై తల్లితండ్రులు నిరంతర నిఘా ఉంచాలి. మొక్కై వంగనిది మానై వంగునా..? అనేది ఒకప్పటి మాట. మొక్క వయసులోనే ఇప్పుడు మానుని మించిన మెచ్యూరిటీ దక్కించేసుకుంటున్నారు పిల్లలు. మానులుగా మారేసరికి మరింత స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు. స్మార్ట్ మరీ హద్దులు మీరితే ఇదిగో చావుతో ఆటలాడేదాకా వస్తుంది పరిస్థితి. ఈ పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారి, రేపటి భవిష్యత్ అయిన నేటి యువశక్తిని నిర్వీర్యం చేసేస్తోంది. అసలెందుకు ఇలా జరుగుతోంది.? అవగాహన లేని మానసిక పరిపక్వత లేకపోవడమా.? లేక మితి మీరిన పరిపక్వత వచ్చేయడమా.? లేక ఇంకేదైనానా.? అంటూ మానసిక నిపుణులే తలలు పట్టుకుంటున్నారు. ఉన్నంతలో తల్లితండ్రులు తమ పిల్లలకు హద్దులు పెట్టడం తప్ప ఈ సమస్యకు ఇంతకన్నా పరిష్కారం మరోటి లేదనేదే వారు సూచించే ముందస్తు సూచన.